Abn logo
Sep 18 2021 @ 12:24PM

శ్రీశైలంలో అపచారం.. భక్తుల ఆందోళన..

అధికారుల నిరక్ష్యంపై పలు విమర్శలు..

ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి.. సీరియస్..


అదొక ప్రముఖ పుణ్యక్షేత్రం. అక్కడ డ్రోన్ల ఫ్లయింగ్‌, అన్యమత ప్రచారాలు వంటి ఘటనలు వరుసగా చోటుచేసుకుంటుండటంతో.. ఆ ఆలయ రక్షణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆలయం చుట్టూ రాజకీయ వివాదాలు అల్లుకున్నాయి. ఇంతకీ ఆ ఆలయం ఏది? అక్కడ అసలు ఏం జరుగుతోంది? వివరాలు ఈ కథనంలో చూద్దాం.

రోజుకో ఘటనతో అలజడి

ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల మహాక్షేత్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న సంఘటనలు తీవ్ర అలజడి రేపుతున్నాయి, ఎమ్‌ఎన్వీ దేవస్థానంలో అధికార పార్టీని అడ్డు పెట్టుకుని కొంతమంది అన్యమతస్థులు పెత్తనం చెలాయిస్తున్నారని కొంతకాలం క్రితం బీజేపీ నాయకులు చేసిన సవాళ్లు, వైసీపీ నాయకుల ప్రతిసవాళ్లతో శ్రీశైలం అట్టుడుకింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూలై మొదటి వారంలో శ్రీశైల క్షేత్రం పరిధిలో గుర్తుతెలియని వ్యక్తులు డ్రోన్‌లు ఎగురవేశారు. ఆ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది.


అప్పటి ఎస్పీ ఫక్కీరప్ప, ఆత్మకూరు డీఎస్పీ శ్రుతి.. శ్రీశైలంలోనే ఉండి డ్రోన్‌లు ఎగిరిన ప్రదేశాలను పరిశీలించారు. నల్లమల ఫారెస్ట్‌ను పోలీసులు, అటవీశాఖ అధికారులు జల్లెడ పట్టారు. కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. పోలీసులకు సవాలుగా మారిన డ్రోన్‌ల కేసులో రెండు నెలలు దాటినా ఎలాంటి పురోగతి లేదు. ఈ కేసు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.

సోషల్ మీడియాలో మరో ప్రచారం..

శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో డ్రోన్‌లు ఎగిరిన సంఘటన మరువకముందే.. ఆలయ పరిధిలో అన్యమత ప్రచారం కలకలం రేపింది. సాధువుల వేషంలో నలుగురు వ్యక్తులు కాలనీల్లో భిక్షాటన చేస్తూ ఇతర మతాలకు సంబంధించిన వస్తువులను మెడలో వేసుకుని అన్యమత ప్రచారం చేయడాన్ని స్థానికులు గుర్తించారు. వారికి వార్నింగ్ ఇచ్చి పంపించేశారు. ఇక సోషల్ మీడియాలో దేవస్థానంపై, అలాగే ఆలయంలో పనిచేసే ఉద్యోగులపై రకరకాలుగా దుష్ప్రచారం సాగుతోంది. ఓ వైపు అన్యమత ప్రచారం, మరోవైపు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం వలన ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం శ్రీశైలం దేవస్థానం వేదికగా జరిగే వివాదాలు, సంఘటనలపై సీరియస్‌గా దృష్టి సారించకపోవడం వల్లే తరుచూ ఏదోఒక సంఘటన చోటుచేసుకోవడం పరిపాటిగా మారిందని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తనిఖీ బృందాల నియామకం..

ఇటీవల శ్రీశైల దేవస్థానంపై సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారంపై స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సీరియస్ అయ్యారు. ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. మరోవైపు అన్యమత ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకు ఆలయ కొత్త ఈవోగా బాధ్యతలు స్వీకరించిన లవన్న చర్యలకు శ్రీకారం చుట్టారు. దేవస్థానం భద్రతా సిబ్బందితో సంచార తనిఖీ బృందాలను నియమించారు. మరి శ్రీశైల ఆలయ రక్షణకు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, ఆలయ కొత్త ఈవో తీసుకున్న తాజా నిర్ణయాలు ఏ మేరకు దోహదం చేస్తాయో చూడాలి.