Abn logo
May 21 2020 @ 00:47AM

మానవత పరిమళించిన రహదారి!

అందరూ గాలికి వదిలేసిన బరువును తెలంగాణా పౌరసమాజం బాధ్యతగా తలకెత్తుకు మోస్తున్నది. చేతులున్నది కేవలం సబ్బునీళ్ళు, శానిటైజెర్లు పూసుకోవడానికి మాత్రమే కాదని, కష్టకాలంలో కన్నీళ్లు తుడవడానికి, కడుపు నింపడానికి కూడా అని నిరూపిస్తున్నది. దాదాపు గడిచిన రెండు నెలలుగా జాతీయ రహదారుల మీద పొయ్యి వెలిగించి సొంత దేశంలోనే  నిరాశ్రయులైన వలస కూలీల ఆకలి తీరుస్తున్నది. కరోనా వైరస్‌తో కలిసి బతకాల్సిందేనని అందరూ చెపుతున్నారు. కానీ చావయినా బతుకైనా తమ ఊళ్ళల్లోనేనని వలస కార్మికులు ఇంటి బాటపట్టారు. ఈ ప్రయాణం అప్పుడే ముగిసిపోయేలా లేదు. చివరిమనిషి సరిహద్దులు దాటేదాకా, ఆఖరి కడుపు ఆకలి తీరేదాకా ఆ పొయ్యి ఆరిపోకుండా ఉండాలి.


విశ్వమంతా విలయతాండవం చేస్తోన్న కరోనా వైరస్ మనకు చేసిన హెచ్చరిక ఏమిటి? ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఉండమని. ముక్కులు, మూతులు మూసేసుకుని, చుట్టూ గిరిగీసుకుని చేతులు ముడుచుకు కూర్చోమని!  రెండునెలలుగా ప్రపంచమంతా అదే పని చేస్తోంది. కానీ తెలంగాణా పౌరసమాజం మాత్రం అందుకు భిన్నంగా చేయీ చేయీ కలిపి వలసకూలీలకు బాసటగా నిలబడింది. కన్యాకుమారి నుంచి కశ్మీరు సరిహద్దుల దాకా తెలంగాణా గుండా నడిచివెళుతున్న నిర్భాగ్యులకు చేదోడు వాదోడుగా ఉండాలనుకుంది. అందరూ గాలికి వదిలేసిన బరువును బాధ్యతగా తలకెత్తుకు మోస్తున్నది.


చేతులున్నది కేవలం సబ్బునీళ్ళు, శానిటైజెర్లు పూసుకోవడానికి మాత్రమే కాదని, కష్టకాలంలో కన్నీళ్లు తుడవడానికి, కడుపు నింపడానికి కూడా అని నిరూపిస్తున్నది. దాదాపు గడిచిన రెండు నెలలుగా జాతీయ రహదారుల మీద పొయ్యి వెలిగించి సొంత దేశంలోనే  నిరాశ్రయులైన వలస కూలీల ఆకలి తీరుస్తున్నది. హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ మొదలు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పెన్‌గంగ వరకు జాతీయ రహదారి మొత్తాన్ని ఒక మానవహారంగా మలిచి బతుకు చెదిరిన బాటసారులకు బాసటగా నిలుస్తున్నది. కాలే కడుపులను నింపడమే కాదు, కందిపోయిన కాళ్లకు చెప్పులు తొడుగుతోంది. చెదిరిపోయిన ఆ గుండెలకు సేదదీర్చి ఇంకా ఈ దేశంలో  మనుషులున్నారని,  మానవత్వం మిగిలే ఉందని భరోసా కల్పిస్తోంది.  


కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించిన తరువాత దాదాపు 50రోజుల వరకు కూడా మనకు వ్యాధి తీవ్రత అర్థం కాలేదు. అప్పటికే ఈ వైరస్ బాధితుల సంఖ్య 300 దాటింది. పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన ప్రభుత్వం అప్పటికప్పుడు అనూహ్యమైన నిర్ణయం తీసుకుని దేశవ్యాప్త లాక్‍డౌన్ ప్రకటించింది. వైరస్‌‍తో దేశానికి పెనుప్రమాదం పొంచివుందని, ఎక్కడివాళ్ళు అక్కడే వుండాలని ఆదేశించింది. ఇది కోట్లాదిమందికి అశనిపాతం అయ్యింది. భారతదేశం నిత్యచలనశీలత కలిగి ఉండే దేశం. రెక్కాడితేగాని డొక్కాడని వాళ్ళే మన దేశంలో ఎక్కువ. ఇక్కడ పరిశ్రమలు, ఫ్యాక్టరీలే కాదు అన్ని కార్యస్థలాలూ మూడు పూటలా పనిచేస్తాయి. రేయింబవళ్లు తేడా లేకుండా రోడ్ల మీద రవాణా వ్యవస్థ సరుకులనో, మనుషులనో మోస్తూ ఉంటుంది. దేశంలో కోట్లాదిమంది నిత్యం అవసరాల నిమిత్తం తమదికాని ప్రదేశాలకు, నగరాలకు, పట్టణాలకు వెళుతుంటారు.


ముఖ్యంగా అసంఘటిత కార్మికులు, ఇల్లూవాకిలి వదిలేసి ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్లి జీవిస్తుంటారు. వాళ్లందరికీ ఇదొక పిడుగుపాటు అయ్యింది. లాక్‍డౌన్ వార్త వారిని కలవరపెట్టింది. రోడ్ల మీదికి కోట్లాదిమంది మూటాముల్లె సర్దేసుకుని రావడంతో దేశం ఒకరకంగా షాక్‌కు గురయ్యింది. అప్పటివరకు దేశంలో ఎంతమంది వలసకూలీలు ఉన్నారో అంచనా లేదు. వాళ్ళ పరిస్థితి ఏమిటి అనే ఆలోచన కూడా రాలేదు. ఒక వైపు పొంచి ఉన్న వైరస్ ముప్పు, మరోవైపు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ జీవితాలు.. ఇవి వారిలో భయాన్ని, అభద్రతను కలిగించాయి. ప్రభుత్వాలు ఎన్ని హామీలు ఇచ్చినా, శిబిరాలు ఏర్పాటు చేసినా, కట్టడి చేసినా అవన్నీ నిర్బంధాన్ని తలపించాయి తప్ప వారికి ఆత్మనిర్భరతను ఇవ్వలేకపోయాయి. అంతే.., ఎవరికి వారు ఆంక్షలను ధిక్కరించి, అన్ని భయాలను అధిగమించి వందలు వేలమైళ్ల మహాప్రస్థానానికి పూనుకున్నారు.


దేశంలోని విశాల రహదారులన్నీ కాలిబాటలైపోయాయి. బహుశా భారతదేశం గతంలో ఎన్నడూ  కనీవినీ ఎరుగని జన ప్రయాణమిది. ప్రజలు ఇంతటి భయంతో, అభద్రతతో దేశవిభజన సందర్భంగా కూడా ప్రయాణాలు చేయలేదని, ఇంతమంది ఇంత దూరం ఎన్నడూ నడిచివెళ్లలేదని సమాజ శాస్త్ర పరిశోధకులు అంటున్నారు. దేశవిభజన సందర్భంగా ఇలా తరలిపోయింది కేవలం కోటి, కోటిన్నరమంది కానీ ఇప్పుడు అంతకంటే అనేక రెట్ల మంది రోడ్డు మార్గాల గుండా, రైలు పట్టాల వెంట ప్రాణాలు ఫణంగా పెట్టి మరీ ప్రయాణాలు చేస్తున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా కాళ్ళను నమ్ముకుని ప్రయాణిస్తున్నారు. ఒకవేళ డబ్బులున్నా లాక్‌డౌన్ పుణ్యమా అని హోటళ్లు, తినుబండారాల దుకాణాలూ మూతపడిపోయాయి. అందుకే తిండికోసం పిండి మూటగట్టుకుని బయలుదేరారు. నిండుగర్భిణులు, పసిపిల్లలను వేసుకుని మండే ఎండల్లో కాందిశీకుల్లా కదిలిపోతున్నారు. 


దేశాన్ని రెండుగా విభజిస్తూ ఉత్తర దక్షిణ భారత రాష్ట్రాలను కలుపుకుంటూ వెళ్లే 44వ నెంబరు జాతీయ రహదారి ఇప్పుడు వలసకూలీలకు కన్నీటి కాలిబాటగా మారిపోయింది. ఈ దారి గుండా రోజుకు లక్షలాదిమంది కూలీలు దక్షిణం నుంచి ఉత్తర భారతానికి తరలివెళ్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ నుంచి నేపాల్ దాక ఇట్లా దేశమంతా ఇప్పుడు ఈ రహదారిలోనే నడిచి వెళ్తోంది. దేశంలోనే అత్యంత పొడవైన ఈ రహదారిని, వాళ్ళ తాతలో, తాతల తాతలో వేసి ఉంటారు. వీళ్ళు కూడా ఇదే దారి గుండా కూటి కోసం కూలీ పనులు వెతుక్కుంటూ వచ్చి ఉంటారు.


ఇప్పుడు అదే వారికి ఇంటిదారి చూపిస్తోంది. కోటి ఆశల్ని మూటగట్టుకుని వచ్చిన వారంతా ఉట్టి చేతుల్తో పుట్టెడు దుఃఖాన్ని మూటగట్టుకుని వెళ్తున్నారు. మూడువేల ఎనిమిది వందల కిలోమీటర్లకు పైగా పొడవున్న ఈ రహదారి తెలంగాణలో దాదాపు ఐదువందల కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. ఒకరకంగా ఇది వలస దారి. పారిశ్రామిక పట్టణాలైన కోయంబత్తూరు, సేలం మొదలు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి ఉపాధికల్పించే మహానగరాలను కలిపే మార్గమిది. భారతదేశ చిత్రపటానికి వెన్నెముకలా నిటారుగా సాగే ఈ జాతీయ రహదారి మరో 7 జాతీయ రహదారుల్ని మిళితం చేసుకుని 10 రాష్ట్రాల గుండా వెళుతుంది. ఇప్పుడీ రహదారి కనీసం తెలంగాణలో మనుషుల్ని కలుపుతోంది. మానవీయ విలువల ఊట చెలిమెలా దప్పిగొన్న గొంతులు తడుపుతోంది, కడుపులు నింపుతోంది. వారికి దారిదీపమై నడిపిస్తోంది. 


మనమంతా తలుపులు మూసుకుని, ఇంట్లో లాక్‌డౌన్ అయిన సమయంలోనే నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రజల హృదయాలు తెరుచుకున్నాయి. దారివెంబడి దీనంగా నడుచుకుంటూ వెళుతున్నవారిని చూసి చలించిపోయారు. వారిని తమ అతిథులుగా భావించారు. ఆకలి తెలుసుకున్నారు, అక్కున చేర్చుకున్నారు. తాము వండుకునే వేళ మరో నాలుగు పిడికిళ్ల బియ్యాన్ని వాళ్ళకోసం కూడా వండారు,  తమ పిల్లలకు రెండు ముద్దలు తక్కువపెట్టి అందులోంచి వాళ్లకు పెట్టి ఆ ఆకలిని పంచుకున్నారు. ఇది దానమనో, అన్న దానంతో పుణ్యమొస్తుందనో వాళ్ళు అనుకోలేదు, తమ ధర్మం అనుకున్నారు. తమ ఊరినుంచి, తమ ఇళ్ల ముందు నుంచి కాళ్ళు ఈడ్చుకుంటూ నడిచివెళ్లేవాళ్లను తమ బంధువులని భావించారు. బాధ్యతగా నిలబడ్డారు. కానీ బంధువులు ఒకరో ఇద్దరో అయితే పరవాలేదు, కానీ రోజూ వేలాదిమంది తరలివస్తున్నారు.


ఇది అక్కడి ఉపాధ్యాయులను ఆలోచనలో పడేసింది. మొదటినుంచీ సమాజంతో మమేకమై నడిచే తెలంగాణా ఉపాధ్యాయులకు సామాజిక స్పృహ ఎక్కువ, సంఘటిత చైతన్యం కూడా ఎక్కువే. తెలంగాణా ఉద్యమంతోపాటు అనేక ఉద్యమాలకు జవజీవాలు నింపింది వాళ్ళే. ఆ అనుభవాన్ని పునాది చేసుకుని అప్పటికప్పుడు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాలకు చెందిన వందమంది ఉపాధ్యాయులు ఒక్కటై నిలబడ్డారు. ఉద్యమస్ఫూర్తితో ప్రజలతో మమేకమై ఆకలితీర్చే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నారు. వారికి తెలంగాణా ఉద్యమ సమయంలో రహదారుల మీద వంటా వార్పూ చేసిన అనుభవంతోపాటు, రోజూ పిల్లలకు మధ్యాహ్న భోజనం వండి వడ్డించిన అనుభవం కూడా తోడయ్యింది. ప్రజలను భాగస్వాముల్ని చేసి ఆర్మూర్ మండలం పెర్కిట్  చౌరస్తాను కేంద్రంగా చేసుకుని మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్ ఒక ‘కమ్యూనిటీ కిచెన్’ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులంతా వాలంటీర్లుగా పనిచేస్తున్నారు.


ఇప్పుడు ఏ సమయంలో వెళ్లినా అక్కడ  వేలాదిమందికి భోజనం సిద్ధంగా ఉంటుంది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయం చేయడమే కాకుండా వారు పండించిన కూరగాయలు, పండ్లు అక్కడ పంచి పెడుతున్నారు. కొందరు వృద్ధులు దారి ఖర్చుల కోసం దాచుకున్న డబ్బులు ఇచ్చి వెళ్తున్నారు. మరికొందరు మాస్కులు, చెప్పులు కొనితెచ్చి బాటసారులకు అందజేస్తున్నారు. దీనికి కొందరు పోలీసులు, ఇతర అధికారులు కూడా తోడుగా నిలబడ్డారు. కాలినడకన వస్తున్నవారికి కొన్నిచోట్ల మహారాష్ట్ర సరిహద్దులదాకా వాహన సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. 


ఇప్పుడు మేడ్చల్ మొదలు ఆదిలాబాద్ దాకా ఇందల్వాయి, పెర్కిట్, పోచంపాడ్, బుస్సాపూర్, మెండోరా గ్రామాల్లో ఇదే స్ఫూర్తి సాగుతోంది. ఇందులో మేడ్చల్ కొంత భిన్నమయింది. నగరానికి చేరువలో ఉండడం వల్ల హైదరాబాద్ నగరంలోని బుద్ధిజీవులు, కవులు, రచయితలు, పాత్రికేయులు కొన్ని ప్రజాసంఘాల మద్దతుతో దీన్ని నిర్వహిస్తున్నారు. మారుమూల గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో మాత్రం ఇవి అక్కడి స్థానిక చైతన్యంతోనే నిలదొక్కుకుంటున్నాయి. ఈ సాముదాయిక వంటశాలలకు సోషల్ మీడియా వెన్నుదన్నుగా నిలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ ప్రజలు ఉపాధ్యాయుల చొరవను గమనించిన అల్లపుల్ల గంగారెడ్డి అనే యువకుడు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసాడు. లండన్‌లో ఎంబీఏ చదివి వచ్చిన గంగారెడ్డి చాలాకాలంగా తెలుగు సినిమా రంగంలో పనిచేస్తున్నారు. ఆయన ఎప్పటికప్పుడు వీడియోలు, ఫోటోలు మిత్రులతో పంచుకుంటున్నాడు. దీనికి ఊహించని స్పందన వచ్చింది.


కొందరు ఆర్థిక సహాయంతో ముందుకు వస్తుంటే మరికొందరు అండగా నిలబడి భాగస్వాములవుతున్నారు. ఇప్పుడు లాక్‌డౌన్ వాతావరణం సడలుతోంది. మరోవైపు కరోనా వైరస్ మనదేశం మీద తన పట్టును మరింత బిగిస్తోంది. ఇప్పుడు నగరాల్లో వలస కార్మికులు నివసించిన మురికివాడలు ఖాళీ అవుతున్నాయి. రహదారులన్నీ ఉసూరుమంటూ కదులుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితి ఇంకా నెలరోజులదాకా ఉండొచ్చు. కరోనా వైరస్‍తో కలిసి బతకాల్సిందేనని అందరూ చెపుతున్నారు. కానీ చావయినా బతుకైనా తమ ఊళ్ళల్లోనేనని వలసకార్మికులు ఇంటి బాటపట్టారు. ఈ ప్రయాణం అప్పుడే ముగిసి పోయేలా లేదు. చివరిమనిషి సరిహద్దులు దాటేదాకా ఈ ప్రయత్నాలు కొనసాగాలి. ఆఖరి కడుపు ఆకలి తీరేదాకా ఆ పొయ్యి ఆరిపోకుండా ఉండాలి. ఆ స్ఫూర్తిని తెలంగాణా పౌరసమాజం అలాగే నిలబెట్టాలి.  

ప్రొ. ఘంటా చక్రపాణి

Advertisement
Advertisement
Advertisement