Abn logo
Aug 4 2020 @ 01:22AM

శ్రీరాముడి పునరాగమనం

అయోధ్య ఆలయ నిర్మాణానికి అన్ని మతాల పెద్దలు సామరస్యపూర్వకంగా స్వాగతం పలుకుతూ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించటమే ఆగస్టు 5వ తేదీ నాటి చారిత్రాత్మక ప్రత్యేకత. శ్రీరాముడు అయోధ్యకు తిరిగి రావడం అనేది మళ్లీ మనందరికీ జ్ఞానోదయం కలిగించే కార్యక్రమం. మరీ ముఖ్యంగా, అయోధ్యలో రామ మందిర నిర్మాణం తమ హక్కు అని నినదించిన భారతీయుల ఆకాంక్షలను, ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించే మరచిపోలేని గొప్ప సుదినం.


రామసేతు.. ఇది రాముడు లంకకు వెళ్లడానికి వానరసేన నిర్మించిన వంతెన అని భారతీయులందరికీ తెలుసు. అయితే, భారతదేశం, శ్రీలంక మధ్య నిర్మించిన వంతెన మానవులు నిర్మించినదే అని చెప్పడానికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయంటూ 2017 డిసెంబరులో డిస్కవరీ చానల్ ఓ చిన్నపాటి వీడియోను ట్విటర్‌లో విడుదల చేసింది. దానిలో ఆ వంతెన మానవ నిర్మితమే అని ప్రకటించింది. ఆ వీడియో చర్చలో బౌల్డర్‍లోని కొలరాడో యూనివర్సిటీ ప్రొఫెసర్, జియాలజిస్టు డాక్టర్ అలన్ లెస్టర్, నార్త్ వెస్ట్లోని ఇండియానా యూనివర్సిటీ జియో సైన్సెస్ విభాగానికి ప్రొఫెసరుగా ఉన్న డాక్టర్ ఎరిన్ అర్గ్కిలాన్ తదితరులు పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య నిర్మించిన వంతెన సహజసిద్ధమైనదేనని, వంతెన నిర్మించడానికి రాళ్లు ఎక్కడో సుదూరం నుంచి తీసుకొచ్చారని చర్చలో పేర్కొన్నారు. నిజానికి, ఈ విషయం రామాయణంలోని యుద్ధ కాండలో ఉందని భారతీయులకు ఎప్పుడో తెలుసు. రాముడి సేన అయిన వానరులు దీనిని నిర్మించారని, ప్రతి రాయి మీద శ్రీరాముడి పేరు రాశారని కూడా యుద్ధ కాండలో ఉంది.


హిందూ విశ్వాసాలను పాశ్చాత్య విద్యావేత్తలు శాస్త్రీయ ఆధారాలతో నిర్ధారించాల్సిన అగత్యం భారత దేశానికి పట్టలేదు. అయితే, కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న విధానం కారణంగా ఈ అంశానికి ఇప్పుడు ప్రాధాన్యం ఏర్పడింది. సేతు సముద్రం షిప్పింగ్ కెనాల్ ప్రాజెక్టును నిర్మించడానికి రామ సేతును విధ్వంసం చేయాలంటూ సుప్రీం కోర్టులో ఓ కేసు విచారణకు వచ్చింది. దానికి సంబంధించి 2007 సెప్టెంబరులో అప్పటి యూపీఏ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ‘‘...ఇటువంటి ఘటన జరిగిందని కానీ, ఇటువంటి వ్యక్తులు, పాత్రలు ఉన్నాయని కానీ నిర్వివాదంగా నిర్ధారించడానికి పురాతన భారతీయ సాహిత్యంలో కీలక భాగమైన పురాణాలు ఎటువంటి చారిత్రక ఆధారాలు చూపలేదు’’ అని అందులో పేర్కొంది. శ్రీరాముడి ఉనికిని తిరస్కరించడం ద్వారా రామసేతు ఉనికిని కూడా వాళ్లు తిరస్కరించవచ్చు. అందుకే, ఈ విషయంలో తన సొంత ఎజెండాను మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఆర్చియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)ని యూపీఏ ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. అయితే, దేశ ప్రజలు తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తీసుకు రావడంతో చివరికి, ఆ అఫిడవిట్‍ను వెనక్కి తీసుకోవడమే కాదు, చెత్తబుట్టలో వేయక తప్పలేదు. ఆ అఫిడవిట్‍ను న్యాయ, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ రూపొందించిందని, దానిపై సంతకం పెట్టాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆ తర్వాత ఏఎస్ఐలోని మాన్యుమెంట్స్ డైరెక్టర్ స్పష్టం చేశారు కూడా.


మతం నుంచి పాలన వ్యవహారాలను వేరు చేయగలిగిందని లౌకిక వాదులు భావించినంత వరకూ కాగితాలపై లౌకిక వాదం బాగానే ఉంటుంది. కానీ, భారత గణతంత్రం రూపుదిద్దుకున్న కొన్ని సంవత్సరాల్లోనే, ఎక్కువమంది ఆచరించే మతాన్ని నిర్వీర్యపరచడానికి లౌకిక వాదాన్ని ఒక ఆయుధంగా వాడుకున్నారు. కాలక్రమంలో, నెహ్రూ లౌకిక వాదం తెరపైకి వచ్చింది. దానర్థం మరేమీ కాదు... హిందూయిజాన్ని వ్యతిరేకించడమే. ఈ హిందూ వ్యతిరేకత అనేది ఇటీవలి కాలంలోనే వచ్చిన పరిణామం ఏమీ కాదు. దీని మూలాలను 1951లోనే మనం గుర్తించవచ్చు. సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణం నుంచే ఇది మొదలైంది.


సోమనాథ్ దేవాలయాన్ని పునర్నిర్మించాలని దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే, 1947 నవంబరులో నాటి దేశ ఉపప్రధాని మరియు హోం శాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తదితరులు నిర్ణయించారు. ఇందుకు గాంధీజీ సుముఖత వ్యక్తం చేశారు. కాకపోతే, ప్రజల నుంచి సేకరించిన విరాళాల ద్వారా మాత్రమే ఆలయాన్ని నిర్మించాలని భావించారు. ఆలయ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. దీనికి భిన్నంగా, ప్రధాన మంత్రి నెహ్రూ ఆలయ నిర్మాణాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాకుండా, 1951 మేలో సోమనాథ్ ఆలయంలో విగ్రహాలను ప్రతిష్టించే కార్యక్రమానికి అప్పటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ హాజరవుతున్నారని తెలుసుకుని.. ఆయనను వెళ్లకుండా చేయడానికి ఎన్నో లేఖలు కూడా రాశారు.


రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‍కు నెహ్రూ రాసిన లేఖల ద్వారా రెండు విషయాలు మనకు సుస్పష్టంగా తెలుస్తాయి. వాటిలో ఒకటి, హిందువుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి, తమ గతాన్ని పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తోంది. ఇక, రెండోది, హిందూ సంప్రదాయాలు, మత విశ్వాసాలను ఎద్దేవా చేయడం, అవమానపరచడం. సోమనాథ్ మందిర నిర్మాణానికి విరాళంగా నీళ్లూ, ఇనుప చువ్వలూ సేకరించాలని ఇతర దేశాల రాయబార కార్యాలయాలను కోరడం వంటివి. నీళ్లు, ఇనుప చువ్వలను సేకరించడాన్ని దుందుడుకు చర్యగా రాష్ట్రపతికి రాసిన లేఖలో ప్రధాన మంత్రి నెహ్రూ అభివర్ణించారు. ఇదో చిత్ర విచిత్ర, వింత చర్య అని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించవద్దని విదేశాంగ శాఖలోని విదేశాంగ కార్యదర్శి తదితరులకు రాసిన నోట్స్ లో నెహ్రూ నిర్దేశించారు. ఇటువంటి విజ్ఞప్తులును అమలుచేయకూడదని రాయబార కార్యాయాలకు స్పష్టం చేశారు.


సోమనాథ్ ఆలయ ప్రతిష్ట సమయంలో ఏ వాదనలు చేశారో అవే వాదనలను కొంతమంది నేడు కూడా చేస్తూనే ఉన్నారు. ఆలయాల పునరుద్ధరణ వంటి చర్యలు చేపట్టినప్పుడు, వాటిలో నిర్దిష్ట ప్రజోపయోగం ఉండాలంటూ ఇప్పటికీ కొందరు మేధావులు అభిప్రాయపడుతూనే ఉంటారు. అయితే, ఆధ్యాత్మిక కార్యకలాపాలు జరిగే ఆలయాల నిర్మాణం ప్రజోపయోగం కోసం అని, అవి సామాజిక భావనను పెంపొందింప చేస్తాయన్న విషయాన్ని వాళ్లు అర్థం చేసుకోలేరు. 


ఈ సామాజిక భావన వచ్చే నెల మొదటి వారంలో మళ్ళీ పునరావృతం కానున్నది. శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన భారీ ఆలయ నిర్మాణానికి జరగనున్న భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆలయ నిర్మాణ కమిటీ వారు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రితోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాన మంత్రి నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందుకు కారణం లేకపోలేదు. గతంలో అణచివేతకు గురి చేసిన, హిందువులకు ఎంతో ప్రీతిపాత్రమైన అయోధ్య రామాలయ ఆధారాలను విధ్వంసం చేసి, అవి పూర్తిగా కనుమరుగు కావడానికి ప్రయత్నాలు చేసిన ప్రభుత్వాల గురించి పూర్తి నిజానిజాలను చర్చించుకునే అవకాశం మనకు ఇప్పుడు వచ్చింది. ఈ విషయంలో నిజాయతీగా చర్చ జరగాలని చాలామంది ప్రతిపక్ష నాయకులు కోరుకోవడం లేదు. అందుకే, ఈ కార్యక్రమానికి హాజరు కాకూడదని ప్రధానమంత్రిని కొంతమంది పత్రికాముఖంగా కోరుతున్నారు. సుదీర్ఘ కాలంగా, నెహ్రూ లౌకిక వాదం పేరిట హిందూ మతాన్ని నిర్లజ్జగా వ్యతిరేకించడం అనేది రాను రాను జడలు విప్పుకుంది. ఈ రకమైన కుహానా లౌకిక వాదానికి 1990 సెప్టెంబరులో ఆడ్వాణీ చేపట్టిన రథ యాత్ర చరమగీతం పాడింది. దేశంలో మత సామరస్యానికి ప్రతీకగా అయోధ్య ఆలయ నిర్మాణానికి అన్ని మతాల పెద్దలు సామరస్యపూర్వకంగా స్వాగతం పలుకుతూ భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించటమే ఆగస్టు 5వ తేదీ నాటి చారిత్రాత్మక ప్రత్యేకత. శ్రీరాముడు అయోధ్యకు తిరిగి రావడం అనేది మళ్లీ మనందరికీ జ్ఞానోదయం కలిగించే కార్యక్రమం. మరీ ముఖ్యంగా, అయోధ్యలో రామ మందిర నిర్మాణం తమ హక్కు అని నినదించిన భారతీయుల ఆకాంక్షలను, ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించే మరచిపోలేని గొప్ప సుదినం.

జి. కిషన్‌ రెడ్డి

(కేంద్ర హోంశాఖ సహాయమంత్రి)

Advertisement
Advertisement
Advertisement