Abn logo
May 5 2020 @ 00:34AM

పాటగా మిగిలిన అరుణోదయ రామారావు

రామారావు గొప్ప గాయకుడు మాత్రమే కాదు. విప్లవ సంస్థలో రాష్ట్ర నాయకుడు కూడా. సున్నితమైన వ్యక్తి. ఉద్వేగంతో చలించిపోయేవాడు. ఎందరో నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల చికిత్స, వైద్యం అవసరాలని ఎంతో శ్రద్ధగా పట్టించుకుని దగ్గరుండి ఆసుపత్రులకి తీసుకెళ్ళేవాడు, అక్కడ డాక్టర్లతో తనకున్న పరిచయాలతో సహాయపడేవాడు. తెలుగు రాష్ట్రాలలో లెక్కలేనంతమందికి ఆయనొక ఆప్తుడు, బంధువు, కుటుంబ సభ్యుడూ.


పాటొక్కటే మిగులుతుంది 

పూలమీంచి పరిమళమై తేలివస్తుందో

గొంతులోంచి పెదాలమీద 

మొగ్గతొడిగి వికసిస్తుందో 

పాత మెరుపై ఆకాశం మీద నినాదమౌతుందో 

పాటొక్కటే మిగులుతుంది 


అరుణోదయ రామారావు వెళ్ళిపోయి నేటికి అప్పుడే ఒక సంవత్సరం అయింది. మనకు పాటలు మిగిల్చి వెళ్ళిపోయాడు. తానొక గొంతుపెగలని పాటగా, దుఃఖపు జ్ఞాపకంగా మిగిలాడు. మే 1, 2019న కాజీపేట, రామగుండం రైల్వే కార్మికుల మేడే సభలలో పాటలుపాడి, హైదరాబాద్ చేరుకొని ఆసుపత్రి నుండి, అటునుంచి అటే వెళ్ళిపోయాడు. ఎప్పటి వలే చెప్పకుండా వచ్చి, అవీ ఇవీ కబుర్లు చెప్పి, మధ్యలో కొంత సీరియస్ చర్చలుచేసి, హడావుడిగా వెళ్ళిపోయినట్లే వెళ్ళిపోయాడు. మండుటెండల మధ్య వడదెబ్బ అనుకున్నాము కానీ, గుండెపోటు అని తెలుసుకునే సరికే ఆలస్యమయింది.


కర్నూలు జిల్లా మూలగవల్లిలో 1955 జూలై 1న అణగారిన కులంలో సత్యంగా పుట్టిన మనిషి, తన అస్తిత్వాన్నీ, విమోచననీ విప్లవోద్యమంలోనే వెదుక్కుకునే క్రమంలో అరుణోదయ రామారావుగా మారాడు. పుట్టుకతోనో, సాధనతోనో సాధించిన అద్భుత ప్రతిభాపాటవాలని అణగారిన ప్రజలకోసం, పీడిత ప్రజా ఉద్యమాల కోసం అంకితం చేసి తుదివరకూ నిబద్ధతతో నిలిచిన మనిషి రామారావు. పౌరాణిక, పద్య నాటకాలతో ఆగిపోలేదు, సినిమా పాటల అవకాశాల వేటలో తనని తాను కోల్పోలేదు. సంస్థ పేరుని తన పేరులో విడదీయరాని భాగం చేసుకుని, జీవితాంతం ప్రజల పాటతోనే నిలిచి ఉంటానని వినమ్రంగా ప్రకటించిన గాయకుడు, నాయకుడు, మనిషి, కార్యకర్త, ఆర్గానిక్ కళాకారుడు అరుణోదయ రామారావు.


రామారావుది విలక్షణమైన గొంతు, అంతకంటే విలక్షణమైనది తన వ్యక్తిత్వం. డప్పు, కంజిర వాద్యాలపై తనకి మంచి పట్టు ఉండేది. అద్భుతమైన కంఠస్వరం తన సొంతమైనా, స్వరాలనీ, రాగాలనీ అలవోకగా ఆలపించగల ప్రతిభ, నైపుణ్యం తనకి సహజంగానో, సహజాతంగానో అబ్బినా– వాటినేనాడూ తన గొప్పతనం చాటుకోవడానికన్నట్లు చూడలేదు, వాడుకోలేదు. అద్భుత ప్రతిభా పాటవాలతో పాటు, నిబద్ధత, అంతే స్థాయిలో వినమ్రత కలగలిసిన వ్యక్తిత్వమే తనని విలక్షణమైన వ్యక్తిగా, సామూహిక స్వరశక్తిగా నిలబెట్టింది.


రామారావు ప్రయాణం పౌరాణిక నాటకాల నుండి మొదలైంది. అందులో రామాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణ రాయబారం, సత్య హరిశ్చంద్ర పౌరాణిక నాటకాలు, జాషువా పద్యాల నుంచి నాజర్ బుర్రకథ వారసత్వం, కానూరి, శివసాగర్, కాశీపతి విప్లవగీతాల దాకా సాగిన పరిణామం వుంది. తన పాటలో శాస్త్రీయ సంగీతపు ఒరవడీ, ప్రజాకళా రూపాల మేళవింపూ కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. విలువైన తరతరాల సాంస్కృతిక వారసత్వాన్ని, అందులోని మకిలిని తిరస్కరిస్తూ, ప్రజల కోణంనుండి సొంతం చేసుకొనే విషయంలో రామారావు ప్రత్యేకమైన కృషిని మనం ఇంకా గుర్తించాల్సే వుంది.


నక్సల్బరీ, శ్రీకాకుళం పోరాటాలు దెబ్బతిని, ఎమర్జెన్సీ నిర్బంధంలో తీవ్రమైన నష్టానికి గురై దెబ్బతిన్న విప్లవోద్యమాన్ని పునరుద్ధరించిన అనంతర కాలంలో రామారావు పాట గొప్ప పాత్ర నిర్వహించింది. ఉయ్యాలో జంపాల, అన్న అమరుడురా మన రామనర్సయ్య, వీరగాథల పాడరా వంటి పాటలు, బుర్రకథలు, వీధిబాగోతం ప్రదర్శనలు విస్తృతస్థాయిలో ప్రజలు, విద్యార్థి యువజనులనీ విప్లవోద్యమంవైపు ఆకర్షించాయి. 1980లలో భారతదేశంలో పర్యటించిన స్వీడన్ రచయిత ఇయాన్ మిర్డాల్ తన ‘ఇండియా వెయిట్స్’ పుస్తకంలో ‘అన్న అమరుడురా’ పాట గురించి ప్రత్యేకంగా పేర్కొన్నాడు. కదిలించే ఈ పాటతో పోల్చదగినదేదీ తన దృష్టికి రాలేదనీ, రష్యన్ విప్లవ నేపథ్యంలో వచ్చిన రష్యన్ పాట (రెవల్యూషనరీస్ ఫ్యునరల్ మార్చ్) కంటే, ఇది ఎంతో గొప్పగా అనిపిస్తుందనీ ఆయన రాశాడు. ఆ పాటని స్వరపరిచిందీ, వందలు వేలమందిని కంటతడి పెట్టించి కసితో కర్తవ్యోన్ముఖుల్ని చేసిందీ రామారావే. ‘మేలిమి కొండల్లో మెరిసింది మేఘం’, ‘అమ్మ నను కన్నందుకు విప్లవాభివందనాలు’, ‘నాకోసం ఎదురు చూడు’, ‘జీవితమా నా యవ్వనాన్ని తిరిగి నాకివ్వు’ వంటి శివసాగర్ గీతాలని తనదైన గొంతులో ఆలపించి చిరస్థాయిగా నిలబెట్టిన వాడూ అరుణోదయ రామారావే.


రామారావు గొప్ప గాయకుడు మాత్రమే కాదు. విప్లవ సంస్థలో రాష్ట్ర నాయకుడు కూడా. సున్నితమైన వ్యక్తి. ఉద్వేగంతో చలించిపోయేవాడు. ఎందరో నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరుల చికిత్స, వైద్యం అవసరాలని ఎంతో శ్రద్ధగా పట్టించుకుని దగ్గరుండి ఆసుపత్రులకి తీసుకెళ్ళేవాడు, అక్కడ డాక్టర్లతో తనకున్న పరిచయాలతో సహాయపడేవాడు. తెలుగు రాష్ట్రాలలో లెక్కలేనంతమందికి ఆయనొక ఆప్తుడు, బంధువు, కుటుంబ సభ్యుడూ. అది ప్రకాశం జిల్లా ఉప్పుగుండూరు కావచ్చు, అనంతారం కావచ్చు, నల్లగొండ జిల్లా వెలిదండ కావచ్చు, రంగాపురం కావచ్చు. కర్నూలు జిల్లా బొల్లవరం కావచ్చు. గోదావరిలోయ అడవి పల్లెలు కావచ్చు. తెలుగు రాష్ట్రాలలో అనేక జిల్లాల నుంచి సహచరులు, మిత్రులు, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, వివిధ వృత్తుల ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చిన ఆయన అంతిమయాత్ర (మే 6, 2019); రైతుకూలీలు, జూట్ కార్మికులు, బీడీ కార్మికులు, మునిసిపల్ కార్మికులు, హమాలీలు, విద్యార్థి యువజనులు రెండు రాష్ట్రాలలో పలు గ్రామాలు, పట్టణాలలో స్వచ్ఛందంగా నిర్వహించుకున్న సంతాపసభలు.. ఆయన ఎందరెందరికి ఎంత సన్నిహితుడో తెలియజేశాయి.


విప్లవం, విప్లవ ఉద్యమం, విప్లవ సంస్కృతి వీటిలో సాంస్కృతిక సంఘాల పాత్ర గురించి నిరంతరం చర్చిస్తూ ఉండేవాడు. కులం సమస్య, ఉత్పత్తి సంబంధాలలో మార్పులు, సామ్రాజ్యవాదం, ఫాసిస్టు ప్రమాదం, విప్లవ సంస్థలలో చీలికలు - ఇలా వివిధ అంశాలపైన సంస్థల లోపలా, బయటా వున్న మిత్రులతో నిరంతరం చర్చిస్తూనే ఉండేవాడు. తన అభిప్రాయాలని దాచుకోకుండా చర్చకి పెట్టేవాడు. ఉద్యమాలు ఆటుపోట్లకు, చీలికలకి గురైనా చివరివరకూ ప్రజా రాజకీయాల పట్ల నిబద్ధతతో నిలబడ్డాడు రామారావు.


రామారావును తలచుకుంటే, స్పానిష్ కవి లోర్కాకి నివాళిగా లెనార్డ్ కోహెన్ గీతం, టేక్ దట్ వాల్ట్జ్ గుర్తుకుకొస్తుంది. ‘‘మృత్యువు తలవాల్చి విలపించే భుజం వొకటి వుండేది/ తొమ్మిది వందల కిటీకీలున్న వాకిలి ఒకటి వుండేది/ పావురాలు ప్రాణాలు వదిలేయడానికి వచ్చి వాలే చెట్టు వొకటి వుండేది/ వేకువ నుంచి ఛిద్రం చేసిన శకలం వొకటి వుండేది.’’ బహుశా అరుణోదయ రామారావుని గురించి ఇలా చెప్పుకోవాలేమో––


అమరత్వం తలవాల్చి, విలపించే గీతమొకటి వుండేది

వీరగాథలని గొంతెత్తి ఆలపించే అద్భుత స్వరం ఒకటి వుండేది

విప్లవాగ్నులనీ, విషాదాశ్రువులనీ మేళవించిన గొంతు వొకటి వుండేది 

అడవిబాటలనీ, అరుణారుణ పాటలనీ వెలిగించే దీపమొకటి వుండేది 

సముద్రాన్ని పాటల పతాకమై పలకరించే దీపస్తంభమొకటి వుండేది

అరుణోదయ రామారావుకు జోహార్లు.

అరుణోదయ రామారావు మిత్రులు

(నేడు అరుణోదయ రామారావు ప్రథమ వర్ధంతి)

Advertisement
Advertisement
Advertisement