Abn logo
Sep 28 2021 @ 19:23PM

సిద్ధూ రాజీనామాకు కారణాలివేనా?

చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా చేయడం వెనుక అసలు కారణాలివే అంటూ కొంత మంది చెప్తున్నారు. తన అసంతృప్తిని బహిరంగంగా సిద్ధూ వెల్లడించనప్పటికీ పార్టీలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న అనేక పరిణామాల కారణంగానే అధ్యక్ష పదవిని సిద్ధూ వదులుకున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. సిద్ధూ నిర్ణయానికి పంజాబ్‌కు కొత్తగా నియామకమైన ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, ఉపముఖ్యమంత్రి సుఖ్‌జిందర్ సింగ్ రాంధావా ప్రధాన కారణం అంటున్నారు.


చరణ్‌జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రి అవ్వడంపై సిద్ధూకి పెద్దగా అభ్యంతరాలు లేకపోయినప్పటికీ సుఖ్‌జిందర్ సింగ్‌ రాంధావాను ఉప ముఖ్యమంత్రిని చేయడం ఇష్టం లేదట. ఇద్దరు నేతలూ జాట్ సిక్కు సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో భవిష్యత్‌లో తన ముఖ్యమంత్రి పదవికి రాంధావా అడ్డు వస్తారనే అసంతృప్తి సిద్ధూలో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అమరీందర్‌ను వ్యతిరేకించడంలో కాంగ్రెస్ హైకమాండ్‌తో చొరవ విషయంలో సిద్ధూకి రాంధావా పోటీదారుగా ఉన్నారట. తన అవకాశాలను రాంధావా తన్నుకుపోతున్నారని, 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రాంధావా ముఖ్యమంత్రి కుర్చీని చేజిక్కించుకుంటారనే అనుమానాలు సిద్ధూకు బలంగా ఉన్నాయట.


ఇక చరణ్‌జిత్ సింగ్ చన్నీ విషయంలో సిద్ధూకి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. డీజీపీ నియామకం నుంచి మంత్రి వర్గంలోకి తాను సూచించిన అభ్యర్థులను చరణ్‌జిత్ పట్టించుకోలేదట. తాను ముందు నుంచి పెడుతున్న ప్రతిపాదలను చన్నీ పక్కన పెడుతున్నారని, పార్టీ అధినేతగా తాను నామమాత్రంగానే మిగిలిపోతున్నానని సిద్ధూ విచారిస్తున్నారట. ఈ విషయమై హైకమాండ్‌ను సంప్రదించినప్పటికీ పెద్దగా ఫలితం లేదని, అందుకే సిద్ధూ రాజీనామా వైపు మొగ్గు చూపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండిImage Caption