Abn logo
Jun 12 2021 @ 08:02AM

నెల రోజుల వ్యవధిలోనే ‘డబుల్’ అని చెప్పి నట్టేట ముంచేసిన చైనీయులు

  • ముంచుకొచ్చిన చైనీయుల మరో కొత్త దందా
  • పవర్‌బ్యాంక్‌ యాప్‌ పేరిట అమాయకులకు వల
  • 5లక్షల మంది నుంచి రూ. 350 కోట్ల మళ్లింపు
  • ఉత్తర భారతంతో పాటు బెంగళూరులో ఫిర్యాదులు
  • హైదరాబాద్‌లోనూ బాధితులున్నట్లు అనుమానాలు

హైదరాబాద్‌ సిటీ : చైనీయులు పవర్‌బ్యాంక్‌ యాప్‌ల పేరిట మరో కొత్త మోసానికి తెరలేపారు. దేశ ప్రజలను ముంచడానికి కొత్త పథకంతో ముందుకు రావడమే కాకుండా నెల రోజుల వ్యవధిలోనే డబ్బులు రెట్టింపు చేస్తామంటూ నట్టేట ముంచేశారు. ఇప్పటికే ఈ మాయలో దేశవ్యాప్తంగా 5లక్షల మందికి సంబంధించిన రూ.350 కోట్లు కొల్లగొట్టారు. గతేడాదిలో 30వేల కోట్లకు పైగా మోసం జరిగిన రుణాల యాప్‌ కుంభకోణం వెలుగులోకి వచ్చేయడంతో... కొత్త దందాపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.  


5 లక్షల మంది బాధితులు

చైనీయుల మాయలో ఇప్పటికే దేశవ్యాప్తంగా 5లక్షల మంది చిక్కి ఉంటారని.. రూ. 350కోట్లు పోగొట్టుకుని ఉంటారని ఢిల్లీ, ఉత్తరాఖండ్‌ పోలీసులు భావిస్తున్నారు. ఈ కొత్త కుంభకోణానికి సంబంధించి ఉత్తర భారతంలో కేసులు వెలుగు చూసినప్పటికీ.. హైదరాబాద్‌, బెంగళూరులో కూడా బాధితులున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెంగళూరులో కూడా కేసులు నమోదు కాగా... మోసపోయిన వారెవరైనా ఉంటే వెంటనే సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆశ్రయించాలని హైదరాబాద్‌ అధికారులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లోనూ బాధితులు?

ఢిల్లీ పోలీసులు ఈ కేసును వెలుగులోకి తీసుకురాగా.. ఉత్తరాఖండ్‌, బెంగళూరుల్లోనూ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లోనూ బాధితులుండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ల ద్వారా పవర్‌ బ్యాంక్‌, సన్‌ ఫ్యాక్టరీ, ఈజ్‌ప్లాన్‌ యాప్‌లను సృష్టించి వాటి ద్వారా అమాయకులను దోచుకున్నారు. వాటిలో పవర్‌బ్యాంక్‌ యాప్‌ ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉండగా ఇతర యాప్‌లను వెబ్‌సైట్ల  నుంచి ఏపీకే ఫైల్స్‌ ఆధారంగా డౌన్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.  


అనుమానితుడి అరెస్టుతో..

ఉత్తరాఖండ్‌ పోలీసులకు వచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 7న చైనా షెల్‌ కంపెనీకి ఓ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న పవన్‌కుమార్‌ అనే పాండేను అదుపులోకి తీసుకున్నారు. అతనిచ్చిన సమాచారం మేరకు... చైనా సృష్టించిన యాప్‌ ఆధారిత ఖాతాల్లో డబ్బులు జమచేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మించి అమాయకులను నుంచి డబ్బులు సేకరించారు. ఆ డబ్బును క్షణాల్లో వివిధ మాధ్యమాల ద్వారా ఇతర దేశాలకు తరలించేశారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి చెందిన స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విచారణానంతరం ఈ కుంభకోణాన్ని మరింత వెలుగులోకి తెచ్చారు. చైనీయుల ఆలోచనతో... సాగుతున్న ఈ దందాను కూడా ఇక్కడి వారే ఆచరిస్తున్నారు. ఈ మోసంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా 5లక్షల మంది బాధితులను తమ ఖాతాల్లోకి చేర్చుకున్నామని... వారినుంచి రూ. 350 కోట్లు సేకరించి తరలించేశామని పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. క్విక్‌ అర్నింగ్‌ (తొందరగా అధిక సంపాదన) అని ప్రచారం కల్పిస్తూ పవర్‌బ్యాంక్‌ పేరిట యాప్‌ క్రియేట్‌ చేశారు. అదేవిధంగా మరో రెండు యాప్‌లను తయారు చేశారు. ఆన్‌లైన్‌లో మల్టీలెవల్‌ మార్కెటింగ్‌ పద్ధతిలో ప్రచారం కల్పించి మోసాలకు పాల్పడినట్లు ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌ కుమార్‌ వెల్లడించారు. 


నెల రోజుల్లో డబుల్‌ మనీ

గూగుల్‌ ప్లేస్టోర్‌లో పవర్‌బ్యాంక్‌ యాప్‌ క్రియేట్‌ చేశారు. అయితే నెల రోజుల క్రితమే పోలీసులకు అనుమానం రావడంతో తెలివిగా గత నెల 12న ఆ యాప్‌ను తొలగించేశారు కూడా. అయితే కేవలం ఆ యాప్‌ మాత్రమే కాకుండా ఇలాంటి యాప్‌లు మరి కొన్ని ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేవలం 24 రోజుల నుంచి 35 రోజుల వ్యవధిలో డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మించి వారి పెట్టుబడులను తస్కరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆన్‌లైన్‌లో ఈ మోసం గురించి మే 18న డెహ్రాడూన్‌లో తొలి ఫిర్యాదు అందగా తొలి కేసు నమోదు చేశారు. మే 29న హరిద్వార్‌కు చెందిన మరో వ్యక్తి ఢిల్లీ సైబర్‌క్రైం పీఎ్‌సలో ఫిర్యాదు చేశాడు. ఇప్పటి వరకు ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోనే 25 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. జూన్‌ 1న  ఇదే తరహాలో బెంగళూరులో కూడా కేసు నమోదు కావడంతో... ఈ వ్యవహారంలో బాధితులు అన్ని నగరాల్లో ఉండి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.