Abn logo
Jul 11 2020 @ 00:21AM

నిషేధం నిష్ఫలమని చరిత్ర చెప్తోంది!

ప్రభుత్వమే మద్యం దుకాణాలను తెరిచే అవసరం అసలు ఏముంది? మంచి రకాల మద్యాలను ఎందుకు అమ్మడంలేదని అడిగితే, ఆ కంపెనీలకు డబ్బు చెల్లించకపోవటంచేత వారు సరకు సరఫరా చేయటం లేదని అధికారులు అంటున్నారు. కనీ వినీ ఎరుగని చౌక రకం బ్రాండ్లను ఎక్కువ ధరలకు అమ్మడానికి ఇలా అవకాశం సృష్టించుకున్నారని అనిపిస్తోంది. ఈ మాదిరి చర్యలు చేపట్టటానికీ, సంపూర్ణ  మద్య నిషేధానికి ఏమయినా సంబంధం ఉందా? చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వాలు మద్య పానాన్ని నిషేధించటం కాదు చేయాల్సింది. ప్రజలు మద్య పానాన్ని తమంతట తాము తగ్గించుకొనే దిశలో కృషి చేయాలి.


స్వాతంత్రం వచ్చే ముందు నుంచి, తరువాత కూడా మద్యపాన నిషేధానికి, అనేక మహిళా సంఘాలు, వావిలాల గోపాల కృష్ణయ్య వంటి నాయకులు, పత్రికలు, సంస్థలు ఎన్ని రకాల అలజడులు చేశాయో ఎన్ని సార్లు మద్య నిషేదాన్ని అమలు జరపి మళ్ళీ తీసివేశారో చరిత్ర చెప్తుంది. అమెరికాలో 1920– 33 సంవత్సరాల మధ్య రాజ్యాంగపరంగా అన్నిరకాల మద్యాలను తయారు చేయడంపైన, ఇతర దేశాల నుంచి దిగుమతిచేసుకోవటంపైన, ఇతర ప్రాంతాలకు తరలించటంపైన, చివరిగా వాటి అమ్మకంపైన నిషేధం విధించారు. మానవ నైజం యెక్కడయినా ఒకటేకదా! మద్యాన్ని ఇతర దేశాల నుంచి దొంగతనంగా రవాణా చేసేవారు. ఐరోపా దేశాలనుంచి దిగుమతి అయ్యే కాలికి తొడిగే పొడుగుపాటి పాద రక్షలల్లో (Boots) మద్యం సీసాలను దాచిపెట్టి అమెరికాకు తరలించేవారు. వీరిని ‘బూట్ లెగ్గెర్స్’ (Boot leggers)’ అనేవారు. అలా మద్యపాన నిషేధం ఓడిపోయింది. 1933లో తీసివేశారు. అమెరికన్ల సాంఘిక జీవనంలో మద్యం ఒక ముఖ్య భాగం అయింది. అన్ని దేశాలలో దాదాపు ఇదే మాదిరిగా కొనసాగుతోంది.


మన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ పూర్తి స్థాయి మద్యపాన నిషేధాన్ని అంచెలుగా విధించటానికి కొన్ని చర్యలు చేపట్టింది. 1) ప్రైవేటు మద్యపాన దుకాణాలను మూసివేసి ప్రభుత్వపరంగా అమ్మకాలను ప్రారంభించారు. 2) దుకాణాల సంఖ్య తగ్గించారు. 3) అన్ని రకాల బ్రాండ్స్ అందుబాటులో లేకుండా కొన్ని మాత్రమే, ముఖ్యంగా ఎక్కువ మందికి తెలియని రకాలను, అమ్మకానికి ఉంచారు. వాటి ధరలేమీ తక్కువలో లేవు, కానీ నాణ్యత మాత్రం చాలా తక్కువ అని చాలామంది చెప్పారు. ఈ చర్యలు అనేక రకాల ఊహలకు దారి తీసింది. 4) ప్రభుత్వం ఉన్నట్టుండి ధరలను 70% పెంచేశారు (పొరుగు తెలంగాణ ప్రభుత్వము 16% మాత్రమే పెంచారు). ఒక ప్రక్క అంచెలుగా మద్యపాన నిషేధాన్ని అమలు చేయదలచిన ప్రభుత్వం- ఇప్పటిదాకా నడుస్తున్న పద్ధతిని (ప్రభుత్వం కంపెనీల వద్ద మద్యాన్ని కొనుగోలు చేసి, నిర్ణయించిన ధరలకు ప్రైవేటు దుకాణాలకు సరఫరా చేయటం) ఆపివేసి తామే స్వయంగా అమ్మకాలను చేపట్టే అవసరం ఏముంది? ధరలు పెంచటం వల్ల ప్రజలు తక్కువ సంఖ్యలో మద్యం కొంటారని ప్రభుత్వం భావిస్తోందని అనుకుంటే, అది అపోహ. పైగా పూర్తి వ్యతిరేక పరిణామానికి దారి తీస్తుంది, తీస్తోంది. మన రాష్ట్రంలో ధరలన్నీ పొరుగు రాష్ట్రాల కన్నా ఎక్కువగా ఉండటంచేత, పైగా అన్ని రకాల మద్యం దొరక్కపోవడం చేత, పొరుగు రాష్ట్రాల నుండి మద్యం యెక్కువగా దొంగ రవాణా అవుతోంది. పొరుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణకూ మనకూ కొన్ని వందల కిలోమైళ్ళ తేలికపాటి సరిహద్దు ఉన్నది. కొండలు, లోయలు, పెద్ద నదులు అడ్డం లేవు. అందుచేత, కొంత రిస్కు ఉన్నా, కొనే వాళ్ళు పుష్కలంగా ఉండటంచేత, దొంగ రవాణా పెరుగుతోంది. దొంగ రవాణాదారులే కాదు, మామూలు ప్రయాణికులు కూడా పొరుగు రాష్ట్రాలనుండి వచ్చేటప్పుడు మద్యాన్ని తెస్తున్నారు. అది నివారించటానికి ప్రభుత్వం అధిక సంఖ్యలో అధికార్లను సరిహద్దులలో నియమించింది. వందల వేల మద్యం సీసాలను పట్టుకున్నామని అధికారుల ప్రకటనలను పత్రికలలో చదువుతున్నాము. అనుభవం ఏం చెప్తుందంటే, దొంగ రవాణా సరుకుని పట్టుకొని విధులను పాటిస్తున్నామని వార్తలకు ప్రకటించే అధికారులే కొన్ని వేల సీసాలలను సరిహద్దు దాటిస్తారు. 


మద్యపానానికి అలవాటు పడ్డవాళ్లని ముఖ్యంగా రెండు రకాలుగా విభజించ వచ్చు. 1) కష్టపడి పనిచేసే కర్షక, కార్మిక వర్గాలు. వీళ్ళు పెద్ద సంస్థలు తయారు చేసే ఖరీదైన మందును కొనలేరు, వాటి కోసం చూడరు కూడా. తరాలుగా వచ్చే కల్లు, సారాయి మొదలగువాటి కోసం చూస్తారు . దొరక్కపోతే కల్తీ సరుకు కొంటారు. ఆరోగ్యకరమైన ఆహారం కొనలేరు, తినలేరు. కాబట్టి వీరిలోనే అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వీరికి కోసం- కొన్నాళ్ల క్రితం ఉన్న మాదిరి ‘ప్రభుత్వ కల్లు’ దుకాణాలను ఏర్పాటు చేసి కొంత ఆరోగ్యకరమైన ‘నీరా’, కల్లు మొదలగువాటిని అందుబాటులో ఉంచే ఆలోచన చేయాలి. అదే సమయంలో, మద్యం ముట్టమని, లేదా ఒక ఆరు నెలలలో లేదా ఒక సంవత్సర కాలంలో మద్య పానాన్ని ఆపివేస్తామని లిఖిత పూర్వకంగా వాగ్దానం చేసినవారికి మాత్రమే ప్రభుత్వ సహాయాలు అందుతాయని, స్థానిక ప్రభుత్వ వాలంటీరులు లబ్ధిదారులను పర్యవేక్షిస్తూ ఉంటారని ప్రభుత్వం ప్రకటనలు చేయాలి. అలాగే, అనేక సాంఘిక సేవా సంస్థలద్వారా, రేడియో, టీవి, పత్రికల ద్వారా మద్యపాన అరిష్టాలను గురించి ప్రచారము చేస్తూ ఉండాలి. 2) సామాజికంగా, ఆర్థికంగా బలంగా ఉన్నవారిలో, బాధ్యత గల అధికారులలో ఇంకా అనేక వృత్తి ప్రవృత్తులు ఉన్నవారిలో కొందరికి మద్యాన్ని కొద్ది మోతాదుల్లో సేవించటం ఒక సాంఘిక ఆచారముగా మారింది. వైద్యుల సలహాతో కొందరు వృద్ధులు కొన్ని రకాల మద్యాన్ని సేవిస్తారు. వారికి గాని, వారివల్ల సంఘానికి గాని హాని ఉండదు.వీరి వల్లే ప్రభుత్వానికి విశేషమైన ఆదాయం చేకూరుతుంది. వీరి సాంఘిక అలవాట్లకు గండి కొట్టటానికి చేసే ప్రయత్నాలు అనవసరం అని పరిపాలకులు గ్రహించవలసి ఉంది.


ప్రభుత్వం గమనించవలసిన మరికొన్ని విషయాలు ఉన్నాయి. అసలే టూరిజంలో వెనుకబడిన రాష్ట్రంలో, ఉన్న కొద్ది యాత్రస్థలాల్లోని హోటళ్లలో మద్యం దొరకక పోయినట్లయితే, యాత్రికుల రాక తగ్గిపోతుంది. అనేక కంపెనీలవాళ్ళు సమావేశాలను ఏర్పాటు చేసుకోవటం మానివేస్తారు. నగ్న సత్యం ఏమిటంటే – ‘మద్యపాన నిషేధం’ ఎవరూ విజయవంతంగా అమలుచేయలేరు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు వీలయినంతవరకు ప్రభుత్వ కార్యకలాపాలను పర్యవేక్షించాలిగాని పరిపాలించకూడదు. ముఖ్యంగా మద్యపాన నిషేధానికి ఇది వర్తిస్తుంది. ప్రభుత్వమే వివిధ సంస్థల నుండి అనేక రకాల మద్యాన్ని కొనుగోలు చేసి ప్రైవేటు వ్యాపారస్తుల ద్వారా విక్రయించే పద్ధతిని తీసివేసి తానే మద్యం దుకాణాలను తెరిచే అవసరం అసలు ఏముంది? కొన్ని మంచి రకాల మద్యాలను ఎందుకు అమ్మడంలేదని అడిగితే, ఆ కంపెనీలకు డబ్బు చెల్లించకపోవటంచేత వారు సరకు సరఫరా చేయటం లేదు అని అధికారులు సమాధానము చెప్పారు (ఇది పత్రికలలోని వార్త). ధనం వసూలు చేయకుండా సరుకు సరఫరా చేయరుగదా. ఆ ధనాన్ని కంపెనీలకు ఇవ్వకుండా మళ్లించారనుకోవటములో తప్పులేదేమో? ఇది కావాలని చేశారు అని కూడా అనిపిస్తుంది. కనీ వినీ ఎరుగని చౌక రకం కంపెనీల నుంచి సరుకు తీసుకొని ఎక్కువ ధరలకు అమ్మడానికి అవకాశము సృష్టించుకున్నారనే అనిపిస్తుంది. ఈ మాదిరి చర్యలు చేపట్టటానికి సంపూర్ణ మద్య నిషేధానికి ఏమయినా సంబంధం ఉందా? చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వాలు మద్య పానాన్ని నిషేధించటం కాదు చేయాల్సింది. ప్రజలు మద్య పానాన్ని తమంతట తాము తగ్గించుకొనే దిశలో కృషి చేయాలి. దానితో పాటు అసాంఘిక కార్యకలాపాలు చేయటానికి వీలు లేకుండా చర్యలు తీసుకోవాలి.


మన రాష్ట్రంలో మద్యం ఆదాయం రూ.400 కోట్లు తగ్గిందని, అమ్మకాలు తగ్గాయని, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 38శాతం తగ్గాయని, మొత్తం మద్యం ఆదాయం రూ.1944 కోట్లు తగ్గిందని, ఇవన్నీ ప్రభుత్వ విజయాలని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఇది ఎంత హాస్యాస్పదమో చెప్పనక్కరలేదు. మద్యం దుకాణాలను మూసివేసిన రోజుల్లో, వాహనాల రాకపోకలను కట్టడి చేసిన రోజుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఉండటానికి ఆస్కారం ఉందా? ప్రజలలో మద్య పానం ఎంత తగ్గింది; అరాచక కార్యకలాపాలు (దొంగ రవాణా మొదలైనవి) ఎంత పెరిగాయి, ప్రజల్లో అధికారుల్లో లంచాలు ఇవ్వటం పుచ్చుకోవటం ఎంత పెరిగింది మంత్రి చెప్పగలరా. చివరిగా అధికారులు ఆలోచించవలసిన విషయాలు: 1) అన్ని రకాల మద్యాలను అందుబాటులో ఉంచటంవల్ల ప్రజలు నచ్చినవాటిని మాత్రమే కొంటారు. అప్పుడు మద్యం తయారీదారుల్లో పోటీపెరిగి వారి సరుకుల నాణ్యత పెరగటం, లేదా ధర తగ్గటం జరుగుతుంది. 2) వీలైనంతవరకు పొరుగు రాష్ట్రాలతో సమాన ధరలలో మద్యం లభ్యమయ్యేటట్లు చూడాలి. లేకపోతే దొంగ రవాణా, లంచగొండితనం పెరుగుతాయి. 3) మద్యపాన నియమాలను ఉల్లంఘించే వాళ్ళను కఠినంగా శిక్షించాలి. ఈ కారణంచేతనే అభివృద్ధి చెందిన దేశాల్లో మద్యపానం వల్ల జరిగే ప్రమాదాలతో పాటు మద్యపాన వినియోగమే చాలా వరకు తగ్గిపోయింది.డా. జంధ్యాల శంకర్ 

మాజీ మేయర్‌, విజయవాడ

Advertisement
Advertisement
Advertisement