Abn logo
Oct 13 2021 @ 01:02AM

ఈ ‘మహర్షి’ ఉండగా దీనదయాళ్ దేనికి?

భారతీయ జనతాపార్టీకి దాని పూర్వ రూపమైన భారతీయ జనసంఘ్‌కు తాత్వికుడుగా వ్యవహరించిన దీనదయాళ్ ఉపాధ్యాయ ఆవశ్యకత ఇప్పటికీ ఉన్నదని ఆ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తన తాజా పుస్తకం ‘ద హిందూత్వ పారడైమ్’ అన్న పుస్తకంలో రాశారు. భారతీయ జనతాపార్టీకి తాత్విక భూమిక కల్పించింది, లాల్ కృష్ణ ఆడ్వాణీ లాంటి నేతలపై ప్రభావం చూపిందీ దీనదయాళ్ ఉపాధ్యాయే అన్న విషయంలో సందేహం లేదు. ప్రజా జీవితంలో స్వచ్ఛత, ఆత్మ విమర్శ అన్నవి దీనదయాళ్ నుంచే నేర్చుకున్నానని ఆడ్వాణీ అనేక సందర్భాల్లో ప్రకటించారు. ‘నా వద్ద ముగ్గురు దీనదయాళ్ ఉపాధ్యాయలు ఉన్నట్లైతే దేశ చిత్రపటాన్ని మార్చి వేసేవాడిన’ని శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. దీనదయాళ్ ఉపాధ్యాయ 15 సంవత్సరాల పాటు చేసిన నిర్విరామ కృషి మూలంగానే భారతీయ జనసంఘ్ కాంగ్రెస్‌కు సుదూరంలో ఉన్న ప్రత్యామ్నాయంగానైనా రాజకీయ విశ్లేషకులు గుర్తించడం ప్రారంభించారు. అన్ని రకాల సైద్ధాంతిక భావాలున్న వ్యక్తులతో కూడా దీనదయాళ్ మాట్లాడేవారు. 1967లో జరిగిన సార్వత్రక ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలం క్షీణించింది. దీనదయాళ్ రాజకీయ ఎత్తుగడల మూలంగా దేశంలో సంయుక్త విధాయక దళ్ పేరిట తొలి కాంగ్రెసేతర కూటమి అవతరించింది. భారతీయ జనసంఘ్, ప్రజాసోషలిస్టు పార్టీ, సంయుక్త సోషలిస్టు పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, భారతీయ క్రాంతి దళ్, లోక్ తాంత్రిక్ కాంగ్రెస్, డిఎంకె, స్వతంత్ర పార్టీ, అకాలీదళ్‌తో పాటు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కూడా ఈ కూటమిలో ఉన్నాయి. ఈ పార్టీల్లో పలు పార్టీలు పరస్పర విభిన్నమైన సైద్ధాంతిక దృక్పథం కలవి. అయినప్పటికీ 1967–71 మధ్య బిహార్, ఉత్తర ప్రదేశ్‌తోపాటు 8 రాష్ట్రాల్లో సంయుక్త విధాయక్ దళ్ ప్రభుత్వాలను ఏర్పర్చింది. ‘సమాజంలో అస్పృశ్యతను పాపంగా పరిగణించేవారు రాజకీయాల్లో అస్పృశ్యతను ఎందుకు పాటించాలి? కమ్యూనిస్టుల వ్యూహరచనను, రాజకీయ సంస్కృతిని మేము అంగీకరించం కాని కలిసికట్టుగా అంగీకరించిన కార్యాచరణ ప్రకారం సమస్యల ఆధారంగా వారు మాతో కలిసి పనిచేయడానికి ఒప్పుకుంటే, అందులో తప్పేమి లేదు. ఇది ప్రజాస్వామ్యంలో ముందడుగు. ఎన్ని తీవ్ర విభేదాలున్నా, కలిసికట్టుగా పనిచేయడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సంకేతం’ అని దీనదయాళ్ అన్నట్లు రాం మాధవ్ ఉటంకించారు. నిజానికి జమ్మూ కశ్మీర్‌లో బిజెపి–పిడిపి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన రాంమాధవ్ కూడా నాడు తమకు రాజకీయ అస్పృశ్యతలో నమ్మకం లేదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో అనేక రంగులుంటాయని కాని వాటితోనే ఇంద్రధనుస్సు రూపొందుతుందని చెప్పారు. బిజెపి–పిడిపిలు కలిసి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో అభివృద్ధి సాధించగలిగాయని అన్నారు.


రాంమాధవ్ అభిప్రాయాలతో చాలా మంది ఏకీభవించకపోవచ్చు. కాని సైద్ధాంతికవేత్తలు, ఆలోచనాపరులు కరువైన భారతీయ జనతాపార్టీలో రాంమాధవ్ లాంటివారికి కూడా స్థానం లేకపోవడం, అధికారులకు, జీ హుజూర్ అనేవారికి, ప్రశ్నించేందుకు భయపడేవారికి మాత్రమే అవకాశం లభించడం గమనించాల్సిన పరిణామం. భారతీయ జనతాపార్టీలో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన, జమ్మూ కశ్మీర్‌లో అందరూ ఆశ్చర్యపడే విధంగా బిజెపి–-పిడిపి ప్రభుత్వానికి కారకుడైన, ఈశాన్యంలో బిజెపి బలోపేతం కావడానికి తోడ్పడిన రాంమాధవ్‌ను ఎందుకు బిజెపి నుంచి తప్పించారో ఎవరూ చెప్పలేరు. చాలా రోజుల పాటు ఆయన పార్టీ అధ్యక్షుడవుతారనో, లేక విదేశాంగమంత్రి అవుతారనో ప్రచారం జరిగింది. కాని ఆయన ఇప్పుడు కనీసం బిజెపి సిద్ధాంతకర్త అవునో కాదో కూడా చెప్పలేం. ఇవాళ పాశ్చాత్య దృక్పథాలకు ప్రత్యామ్నాయంగా దీనదయాళ్ లాంటి భారతీయ సిద్ధాంతవేత్తలు, ఆయన ప్రతిపాదించిన సమగ్ర మానవతా సిద్ధాంతానికి ఆవశ్యకత ఉన్నదని రాం మాధవ్ భావిస్తున్నారు కాని భారతీయ జనతా పార్టీని నిర్వహిస్తున్న వారి ఆలోచన భిన్నంగా కనిపిస్తోంది.

రాజకీయాల్లో అస్పృశ్యత లేదని నాడు దీనదయాళ్ అన్నారు కాని ఇవాళ రాజకీయ పార్టీలు పరస్పరం ఘర్షించుకుంటున్న, దూషించుకుంటున్న తీరు, పార్లమెంట్ జరుగుతున్న తీరు చూస్తుంటే నేతలు మాట్లాడుకునే పరిస్థితి ఉన్నదా అన్న అభిప్రాయం ఏర్పడుతోంది. ప్రజాస్వామిక వేదిక అయిన పార్లమెంట్‌లోనే బిల్లుల విషయంలో ఏకాభిప్రాయం సాధించలేని వారు, కలిసి చర్చించే వాతావరణం కల్పించలేని వారు పార్లమెంట్ బయట కలిసి ప్రజలకు ఉపయోగకరమైన అంశాలపై సమిష్టి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పర్చగలరా? ఫలానా పార్టీ నుంచి దేశాన్ని విముక్తి చేస్తానని మాట్లాడేవారు, నిరంతరం ఏ ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలా, ఎవర్ని భయభ్రాంతులను చేసి లొంగదీసుకోవాలా అని ఆలోచించేవారు, శివసేన, అకాలీదళ్ లాంటి పార్టీలను వదుల్చుకున్న వారు దీనదయాళ్ ఆశించిన ఇంద్రధనుస్సు లాంటి వివిధ పార్టీలతో కూడిన ప్రభుత్వాలను ఏర్పర్చడం సాధ్యమవుతుందా? ‘రాజకీయం నేడు ఒక లక్ష్యం కోసం పోరాడే సాధనంగా కాక అదే లక్ష్యంగా మారిపోయింద’ని దీనదయాళ్ అన్న మాటల్ని ఎవరు పట్టించుకుంటారు?


దీనదయాళ్ ఉపాధ్యాయకు ప్రజా ఉద్యమాలంటే కూడా సదభిప్రాయం ఉండేది. ‘వేగంగా మారుతున్న ఒక సామాజిక వ్యవస్థలో ప్రజా ఉద్యమాలు సహజమైనవి, అవసరమైనవి కూడా. నిజానికి ఈ ఉద్యమాలు సమాజంలో ఒక కొత్త చైతన్యానికి సూచికలు. ప్రజా ఉద్యమాలంటే భయపడేవారు కాలచక్రాన్ని ఆపివేయాలనుకుంటారు. కాని అది సాధ్యం కాదు..’ అని ఆయన 1967లో కాలికట్‌లో జరిగిన భారతీయ జనసంఘ్ సదస్సులో అధ్యక్షోపన్యాసంలో చెప్పారు. విచిత్రమేమంటే ఇవాళ ప్రజా ఉద్యమాలంటే ఒక లెక్కలేని పరిస్థితి ఏర్పడింది. ఏడాదికి పైగా రైతులు సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తుంటే చీమ కుట్టినట్లయినా లేని వారు కేంద్ర నాయకత్వంలో ఉంటే రాష్ట్రాలలోని నేతలకు ఉద్యమాలంటే గౌరవం ఎందుకుంటుంది? అందుకే నిర్లక్ష్యంగా, నిర్దాక్షిణ్యంగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న జనం మీద నుంచే కొద్ది రోజుల క్రితం లఖీంపూర్ ఖేరీలో వాహనాన్ని నడిపించుకుంటూ తీసుకువెళ్లి నలుగురు రైతులు చక్రాల క్రింద నలిగి చనిపోయేలా చేశారు. ‘నా చరిత్ర ఏమిటో ఇక్కడి ప్రజలకు తెలుసు. నేను కారు దిగానంటే వారు పారిపోలేరు కూడా. నా అసలు శక్తి చూపిస్తే వారు గ్రామంలోనే కాదు, జిల్లాలో కూడా ఉండరు..’ అని హెచ్చరించిన ఒక ఎంపి కేంద్రప్రభుత్వంలో హోంశాఖ సహాయమంత్రి. రైతులపై వాహనం నడిపించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన కుమారుడిని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత కాని పోలీసులు అరెస్టు చేయలేదు. కేంద్రంలో పెద్దలు ఈ సంఘటనపై ఇంతవరకూ కనీసం నోరు విప్పలేదు. మానవ హక్కుల కమిషన్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు కూడా వాహనం క్రింద నలిగి మరణించిన వారు గుర్తు రాలేదు. రాజకీయాల్లో స్వచ్ఛత, ఆత్మవిమర్శ అవసరమని దీనదయాళ్ అన్నమాటల్ని నేడు వినేవారు ఎవరు?


అందరితో చర్చించి, అందరి మాటలను ఓపికగా విని ఆ తర్వాత కాని మోదీ నిర్ణయాలు తీసుకోరు అని ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురించి అభివర్ణిస్తూ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు నుంచి ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ వరకు ఎంతమందితో చర్చించారు? సాగు చట్టాలపై ఆర్డినెన్స్ నుంచి వాక్సిన్ విధానం వరకు ఏఏ రాష్ట్రాలతో చర్చించారు? ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేసిన ఆర్థిక వర్తక, వ్యవసాయ విధానాల గురించి పార్లమెంట్‌లో కాని, రాష్ట్రాలతో కానీ చర్చించారా? ఏడేళ్లలో 76 ఆర్డినెన్స్‌లు తేవాల్సిన అవసరం దేనికి వచ్చింది? కనీసం ఒక్క పత్రికా విలేఖరుల సమావేశమైనా ఏర్పర్చి ప్రశ్నలను ఎదుర్కొన్నారా?


వేలాది ఎకరాల వ్యవసాయ భూమి కొద్దిమంది సంపన్నుల చేతిలో ఉండే జాగీర్దార్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఒకప్పుడు దీనదయాళ్ పోరాడారు. ఇప్పుడు కొద్ది మంది సంపన్నులైన కార్పొరేట్లకే ప్రభుత్వ ఆస్తులను అప్పజెప్పే అభినవ జాగీర్దార్ వ్యవస్థకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ పరిణామాన్ని దీనదయాళ్ ఆశించారా?


భారత ప్రజాస్వామ్యంలో మూడు స్తంభాలైన కార్యనిర్వాహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థ సమర్థంగా, శక్తిమంతంగా పనిచేయాలంటే పరిపక్వత గల నాయకత్వం అవసరమని రాంమాధవ్ తన పుస్తకం ముగింపులో అన్నారు. ఇప్పుడు వ్యవస్థల స్వతంత్ర పనితీరే ప్రశ్నార్థకమైంది. ‘రాజ్యాంగ నైతికత అనేది సహజసిద్ధమైన మనోభావం కాదు. దాన్ని పెంచి పోషించాలి..’ అని అంబేడ్కర్ అన్న మాటల్ని ఆయన ఉటంకించారు. రాజ్యాంగ నైతికత మాట అటుంచి ఇప్పుడు సాధారణ నైతికతే మృగ్యమైపోయింది. ‘రాజకీయ వికేంద్రీకరణ, సమిష్టి నాయకత్వం అనేది నైతికమైన, సచ్ఛీలమైన రాజకీయ వ్యవస్థకు ఆధారం’ అని దీనదయాళ్ అన్న వాక్యాల్నీ ఆయన ప్రస్తావించారు. నేటి కేంద్రీకృత రాజకీయ, అధికార వ్యవస్థలో దీనదయాళ్ వ్యాఖ్యలకు విలువ ఎక్కడుంది? కరోనా వైరస్ రెండేళ్ల పాటు ప్రపంచాన్ని అతలాకుతలం చేయడమే కాక, అనేక దేశాల్లో అధికారాన్ని పూర్తిగా గుప్పిట్లో పెట్టుకున్న నేతల్ని సృష్టించిందని రాంమాధవ్ అన్నారు. కాని మన దేశంలో కరోనా వైరస్‌కు ముందే ఈ పరిణామం జరిగింది.


భారతదేశం కారల్ మార్క్స్, జాన్ స్టువార్ట్ మిల్ వంటి సైద్ధాంతిక వేత్తలను ఉత్పత్తి చేయలేదు కాని మన మహర్షుల లోతైన తాత్విక ఆలోచనలే నిరంతరం మన ప్రజలను ప్రభావితం చేస్తూ వచ్చిందని రాంమాధవ్ అన్నారు. ఇప్పుడు కేంద్రంలో ఒకే ఒక ‘మహర్షి’ దేశం కోసం లోతైన తాత్విక ఆలోచనలు చేస్తుండగా దీనదయాళ్ లాంటి పాత మహర్షుల ఆవశ్యకత దేనికి?

వేలాది ఎకరాల వ్యవసాయ భూమి కొద్ది మంది సంపన్నుల చేతిలో ఉండే జాగీర్దార్ వ్యవస్థకు వ్యతిరేకంగా ఒకప్పుడు దీనదయాళ్ ఉపాధ్యాయ పోరాడారు. ఇప్పుడు కొద్దిమంది సంపన్నులైన కార్పొరేట్లకే ప్రభుత్వ ఆస్తులను అప్పజెప్పే అభినవ జాగీర్దార్ వ్యవస్థకు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ పరిణామాన్ని దీనదయాళ్ ఆశించారా?


ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి