Abn logo
Jul 11 2020 @ 05:02AM

పట్టు తప్పుతున్న దారం

కరోనాతో కళ తప్పిన చేనేత పరిశ్రమ

ఉపాధి కోసం కూలి పనులకు వెళ్తున్న కార్మికులు

చేతులు మొద్దు బారి నేత పని చేయలేకపోతున్నామని ఆవేదన

ఆప్కో ద్వారా చీరలను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి


రాజోలి, జూలై 10 : కూలి పనులతో చేతులు మొద్దుబారి పట్టు దారం చేతికి చిక్కడం లేదని, దారం పట్టు తప్పుతుండడంతో చీరలు నేయలేకపోతున్నామని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి అన్ని రంగాలతో పాటు చేనేత పరిశ్రమనూ దెబ్బతీసింది. నేత కార్మికుల జీవనాధారాన్ని అతలాకుతలం చేసింది. జోగుళాంబ గద్వాల జిల్లాలోని చేనేత కార్మికులకు ఉపాధి కరువయ్యింది. తయారుచేసిన చీరలు అమ్ముకునే పరిస్థితి లేక, కుటుంబాన్ని పస్తులు ఉంచలేక తరతరాలుగా వస్తున్న వృత్తిని వీడి ప్రత్యన్మాయ ఉపాధి చూసుకుంటున్నారు. కూలిపనికి వెళ్తుండడంతో చేతులు మొద్దుబారుతున్నాయి. దీంతో చీరలు తయారు చేసేందుకు వీలు కాదని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు మొగ్గం పనిముట్లను, పరికరాలను అమ్ముకుని, పండ్లు, కూరగాయల వ్యాపారాలు చేసుకుంటున్నారు. చాలా కాలంగా నేత పని మాత్రమే వచ్చిన కొందరు కూలికి వెళ్లలేక కూల్‌డ్రింక్‌ షాపుల్లోను, హోటళ్లలోనూ పని చేసుకుని బతుకుబండిని నడుపుకుటున్నారు. 


ప్రభుత్వం ఆదుకోవాలి

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆదుకోకపోతే చేనేత కళనే కనమరుగయ్యే ప్రమాదముందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యవర్తులు చేనేతను కేవలం వ్యాపారంగా మాత్రమే చూశారని, కళగా గుర్తించి ప్రోత్సహించలేదని వారు చెప్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్కెటింగ్‌ అవకాశాలు పూర్తిగా తగ్గిపోవడం, చీరల కొనుగోళ్లు సాగకపోవడంతో దళారులు చేతులెత్తేశారని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని, చేనేత కార్మికులు తయారు చేసిన పట్టుచీరలను ఆప్కో ద్వారా గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలని కోరుతున్నారు. డిమాండు ఉన్న రాష్ర్టాలకు ఎగుమతి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతీ నేతన్న కార్మికుడి కుటుంబానికి 50 శాతం సబ్సిడీతో వడ్డీలేని రుణం అందించి ఆదుకోవాలని వారు కోరుతున్నారు.


కూరగాయలమ్ముకుంటున్న... 

చిన్నప్పటి నుంచి నేత పనే చేస్తున్నాను. ఇప్పుడు ఉపాధి లేక మొగ్గం పనిముట్లను అమ్ముకుని కూరగాయల వ్యాపారం చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించి కార్మికుల వద్ద నిల్వ ఉండిపోయిన పట్టు చీరలను కొనుగోలు చేయాలి. అప్పుడే నేతన్నలకు మనుగడ సాధ్యమవుతుంది.

- వెంకటేష్‌, రాజోలి చేనేత కార్మికుడు 


కూల్‌ డ్రింక్స్‌ షాపులో పని చేస్తున్నా..  

మాకు తెలిసింది పట్టు చీరల తయారీ మాత్రమే. ప్రస్తుతం కరోనా కారణంగా ఉపాధి కరువైంది. ఇటు వృత్తిని వదులుకోలేక, అటు కూలి పనికి వెళ్లలేక కూల్‌డ్రింక్‌ షాపులో పని చేస్తున్నాను. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోకపోతే బతకడమే కష్టం.

- వీరేష్‌, రాజోలి చేనేత కార్మికుడు

Advertisement
Advertisement