Abn logo
Jan 21 2021 @ 00:16AM

అతడి నుంచి ఆమెగా..!

మనదేశంలో తొలి ట్రాన్స్‌జండర్‌ డిజైనర్‌ శైషా షిండే! ట్రాన్స్‌జండర్‌గా  మారకముందు శైషా 

ఒక పురుషుడు. అతడి పేరు స్వాప్నిల్‌! కానీ అతడు ఆమెగా మారారు. తనను తానుగా 

ట్రాన్స్‌విమెన్‌గా ప్రకటించుకున్నారు. ఆ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు, మరెన్నో సంఘర్షణలూ 

ఆమె ఎదుర్కొన్నారు. ఆ విశేషాలు ఇవి...


శైషా ముంబయిలో వడాలాలోని సెయింట్‌ జోసెఫ్‌ హైస్కూల్‌లో చదివారు. అప్పుడు (అతని) ఆమె రూపు, ప్రవర్తనలను హేళన చేస్తూ తోటి అబ్బాయిలు బాగా ఏడిపించేవారు. ‘బైలా’ అంటూ వెక్కిరించేవారు. ‘‘నాలోని బిడియం, ఆడవాళ్ల లక్షణాలు నన్ను మరింత ముడుచుపోయేలా చేశాయి. ఆ రోజుల్లో నరకం చవి చూశా. స్కూలు ప్రాంగణంలో ఉన్న చర్చి నాకు అప్పుడు ఆశ్రయం ఇచ్చింది. ఎందుకంటే బడి తర్వాత  తోటి విద్యార్థులందరూ వెళ్లిపోయాకే మెల్లిగా చర్చి గోడల వెనుక నుంచి బయటకు వచ్చి ఇంటిదారి పట్టేదాణ్ణి’ అని శైషా గుర్తుచేసుకుంటారు.


గే-మ్యాన్‌ నుంచి..

స్కూల్లో తోటి విద్యార్థులు పెట్టిన బాధలు శైషాను ఎంతోకాలం వెన్నాడాయి. ఇరవై ఏళ్ల వయసులో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో చదువుతున్నప్పుడు  తాను గే-మ్యాన్‌ అని షిండే ప్రకటించుకున్నారు. హైపర్‌-మాస్కులైన్‌గా  తన ప్రవర్తన, తన అప్పియరెన్స్‌ ఉండేలా షిండే జాగ్రత్త పడ్డారు. ‘అప్పట్లో అది పూర్తిగా నేను ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయం’ అని శైషా వెల్లడించారు. ఈ ఏడాది జనవరి 5న 35 ఏళ్ల షిండే తనను తాను ట్రాన్స్‌విమెన్‌గా ప్రకటించుకున్నారు. శైషాగా మారారు. అబ్బాయిగా పుట్టినా తనకు జ్ఞానం వచ్చిన నాటి నుంచి అమ్మాయిగానే ఫీలయ్యేదానిని అని శైషా అంటారు. ‘‘అప్పట్లో నా  జుట్టును కట్‌ చేయించుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఆడపిల్లలు ఆడుకునే బొమ్మలతో ఆడుకోవడానికి ఇష్టపడేదాన్ని’’ అని శైషా చెప్పారు. ఏడేళ్ల క్రితం ఒక థెరపీకి వెళ్లినప్పుడు జండర్‌ డైఫోరియాతో తాను బాధపడుతున్నట్టు శైషా గుర్తించారు. ఇది చాలా సంక్లిష్టమైన స్థితి. ఇది ఉన్న వాళ్లల్లో జండర్‌ ఒకటైతే, వారి వ్యక్తీకరణ జండర్‌ మరో రీతిలో ఉంటుంది. ‘‘గత ఏడాది చివరి ఆరు నెలల్లో నేను ‘ఎవరు’, ‘ఏమిటి’ అనే విషయాలలో నాకు స్పష్టత వచ్చింది. నేను ట్రాన్స్‌విమెన్‌ అని తెలుసుకున్నాను’’ అని శైషా అంటారు. 


 సోషల్‌ మీడియా వేదికగా...

ట్రాన్స్‌విమెన్‌ అని సోషల్‌ మీడియాలో ప్రకటించడానికి ముందువరకూ గే-మ్యాన్‌గా అతని(శైషా) జీవితం సాఫీగానే సాగింది. ‘ మాది బాగా పేరున్న కుటుంబం. మంచి డిజైనర్‌గా నేను బాగా నిలదొక్కుకున్నాను కూడా. నా ఐడెంటిటీ ప్రకటిస్తే వస్తే నష్టం ఏమీ లేదనుకున్నాను. నాకోసం నేను బతకాలనుకున్నాను. తలుపుల వెనుక నా జీవితం నా స్నేహితులకు కూడా తెలియదు. నేను మేకప్‌ వేసుకుంటా! హీల్స్‌ ధరిస్తా! రంగు రంగుల దుస్తులు కట్టుకుంటా! ఇవేమీ ఎవ్వరికీ తెలియదు. చాలాకాలం నేను  రెండు జండర్లుగా నా జీవితాన్ని కొనసాగించా. నాకు అమ్మాయిగా  ఉండాలని ఇష్టం కానీ, బయట మగాడిలా రగ్‌ జీన్స్‌, బూట్లు వేసుకుని తిరగాల్సి వచ్చేది’’ అని శైషా చెప్పుకొచ్చారు. చివరకు ‘తనేమిటో’ తన తల్లిదండ్రులకు, తన తోటి సిబ్బందికి చెప్పాల్సివచ్చినపుడు కూడా ఒకలాంటి ఒత్తిడి ఎదుర్కొంది. ‘‘వాళ్లు నన్ను అంగీకరిస్తారో లేదో తెలియని స్థితిలో తీవ్ర గందరగోళానికి గురయ్యాన’’ని శైషా అన్నారు.  


దాదర్‌లోని హిందూ కాలనీలో షిండే పుట్టిపెరిగారు. శైషా తండ్రి వ్యాపారవేత్త.  దాదర్‌ ఈస్ట్‌ స్టేషన్‌లో బాగా పేరొందిన రిషి రెస్టారెంట్‌ కూడా శైషా తండ్రిదే. శైషా తల్లి మంచి ఆర్టిస్టు. గృహిణిగా జీవితం గడుపుతున్నారు. ‘‘మా  నాన్న ఎంతో స్వేచ్ఛనిచ్చే మనిషి. ఆయన కూడా అలాగే ఉంటారు. ఆయన నాకు అన్ని సమయాల్లో వెన్నుదన్నుగా నిలిచారు. చిన్నప్పుడు నేను అడిగిన బొమ్మలను నాకు ఎలా కొనిపెట్టేవారో పెద్దయిన తర్వాత ఫ్యాషన్‌ రంగంలోకి నేను వెడతానన్నప్పుడు కూడా నాకు అంతే అవకాశాలను అందించారు. అంతేకాదు నా జండర్‌ మార్పు సమయంలో సైతం నాకు అండగా నిలబడ్డారు. కానీ మా అమ్మ మాత్రం ఈ పరిణామాన్ని తట్టుకోలేకపోయింది. వాస్తవాన్ని అంగీకరించడానికి ఆమెకు ఒక రోజు పైగా పట్టింది. నేను అమ్మాయిలా తయారయి మొట్టమొదటిసారి అమ్మ ముందుకు వెడితే ఆమె అస్సలు గుర్తుపట్టలేకపోయింది. తర్వాత అమ్మ నాకు  పేరు పెట్టుకోవడంతో సహా అన్నింటా సహకరించింది! ఇప్పుడు మా అమ్మ, నేను హెయిర్‌, బ్యూటీ టిప్స్‌ను ఒకరితో ఒకరు పంచుకుంటుంటాం’’ అని శైషా నవ్వారు. ‘శైషాగా మారిన నన్ను చూసి మా సిబ్బంది ‘మీరు  పూర్తిగా మారిపోయారు’ అన్నారు’ అని  శైషా గుర్తుచేసుకుంటుంది. తన జండర్‌ ట్రాన్సిషన్‌ గురించి తన డిజైనింగ్‌ బృంద సభ్యులతో ప్రత్యేకంగా మీటింగ్‌ పెట్టి మరీ శైషా తన మార్పు గురించి వివరించారు. ‘ఇప్పుడు వాళ్లంతా నన్ను ‘మా’ అని పిలుస్తున్నారు’ అని శైషా చెప్పారు. 


ఫ్యాషన్‌ స్టయిలూ మారింది...

 ఆడవాళ్లను గ్లామరస్‌గా చూపడం ఎలాగో శైషాకి బాగా తెలుసు. ‘శైషా’ ఫ్యాషన్‌  లేబుల్‌ దుస్తుల్లో మెరిసిపోయిన బాలివుడ్‌ తారల్లో కరీనా కపూర్‌, దీపికా పదుకొనె, అదితీరావ్‌ హైదరీ వంటివాళ్లు ఉన్నారు.  2020 లాక్మీ  ఫ్యాషన్‌ షో వచ్చేటప్పటికి  శైషా స్టయిల్‌ సిగ్నేచర్‌ మారింది. ‘2019 అక్టోబర్‌ నాటికి జండర్‌ మార్పు చేయించుకోవాలని మానసికంగా గట్టి నిర్ణయానికి  వచ్చాను. అలాగే నా ‘శైషా’ లేబుల్‌కి సరికొత్త మెరుపులు ఇవ్వాలని నిశ్చయించుకున్నా. 


లైవ్‌ షోలో నా కొత్త ‘ఐడెంటిటీ’ని తెలపాలని నిశ్చయించుకున్నా. ర్యాంప్‌పై ‘శైషా’లా వాక్‌ చేయాలని నిర్ణయించుకున్నా’’ అని శైషా చెప్పారు. శైషా ఆశించినట్టుగానే ఆమె ప్రదర్శించిన ఫ్యాషన్‌ షో శైషాకు ఆత్మవిశ్వాసాన్ని, బలాన్ని ఇచ్చింది.  ఇండియన్‌ ఫ్యాషన్‌ ఇండస్ట్రీలో ఇంకా ఆ ‘ఓపెన్‌నెస్‌’ రాలేదని శైషా అంటారు.‘ పైకి మనం చేసిన పనిని మెచ్చుకుంటారు కానీ ‘నేను గే ’అని బహిరంగంగా చెబుతూ బయటకు వస్తున్న వాళ్లు చాలా తక్కువమంది మాత్రమే’ నంటారు శైషా. ‘అలాగే లెస్బియన్‌ డిజైనర్లు కూడా మనదేశంలో ఉన్నారు. కానీ అలాంటి ఆడవాళ్లు ధైర్యంగా బయటకు రావడం లేదు. తమ ఇమేజ్‌ దెబ్బతింటుందని వాళ్లు భావిస్తారు’ అని శైషా అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకూ జండర్‌ మార్పులో 40 శాతం మేర  శైషా మార్పు చెందారు. మిగతా ప్రొసీజర్‌ ఈ ఏడాది నవంబరుకు పూర్తికావచ్చని శైషా వెల్లడించారు. వాయిస్‌ మాడ్యులేటింగ్‌లో కూడా శైషా శిక్షణ తీసుకున్నారు. ఫేషియల్‌ ఫెమినైజేషన్‌ సర్జరీ కోసం తొందరలోనే శైషా బెల్జియం వెళ్లనున్నారు. ‘ఆరడుగుల అబ్బాయినైన నన్ను అందమైన అమ్మాయిగా తీర్చిదిద్దడానికి వైద్యులు, మరెందరో ప్రొఫెషనల్స్‌ ఎంతో కష్టపడ్డారు’ అని అంటారు శైషా. 

తలుపుల వెనుక నా జీవితం నా స్నేహితులకు కూడా తెలియదు. నేను మేకప్‌ వేసుకుంటా! హీల్స్‌ ధరిస్తా! రంగు రంగుల దుస్తులు కట్టుకుంటా! ఇవేమీ ఎవ్వరికీ తెలియదు. చాలాకాలం నేను  రెండు జండర్లుగా నా జీవితాన్ని కొనసాగించా. నాకు అమ్మాయిగా  ఉండాలని ఇష్టం కానీ, బయట మగాడిలా రగ్‌ జీన్స్‌, బూట్లు వేసుకుని తిరగాల్సి వచ్చేది.

Advertisement
Advertisement
Advertisement