Abn logo
Sep 8 2020 @ 04:14AM

మొదటి అంశం, కరోనా

తెలంగాణ శాసనసభ, మండలి వర్షాకాల సమావేశాలు ఈ సారి ఎంతో విశేషమైనవి. చట్టసభలలో ఏయే అంశాలు చర్చించాలి, ఎంత సేపు  చర్చించాలి వంటి అంశాలు అధికారపక్షం ఆధిక్యంలో ఉండే సభాసంప్రదింపుల కమిటీ సమావేశం ద్వారా నిర్ణయమవుతాయి. కొత్త రెవెన్యూ చట్టం, సాగునీటి శాఖ ప్రక్షాళన వంటి కీలక అంశాలను ముఖ్య ఎజెండాగా ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ, సమావేశాలు జరుగుతున్న సమయం, సందర్భం రీత్యా ఒక అంశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వక తప్పదు. అదే ప్రపంచాన్నంతా కమ్మివేసి, భారతదేశాన్ని, తెలంగాణను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా వ్యాప్తి. తెలంగాణ శాసనసభ గత సమావేశాలు మార్చి రెండో వారంలో జరిగాయి. అప్పటికి కరోనా      దేశంలోను, తెలంగాణలోనూ కూడా ప్రవేశించింది కానీ, అప్పటికది విపత్తుగా మారలేదు. మార్చి పదహారున ముగిసిన సమావేశాలు తిరిగి ఇప్పుడు సెప్టెంబర్‌ 7 నాడు మొదలయ్యాయి. ఈ ఆరునెలల కాలం ప్రపంచమంతా అతలాకుతలం అయిన కాలం. ప్రజల జీవితాలు, జీవనోపాధులు, దినచర్యలు, ప్రాధాన్యాలు, మానవ సంబంధాలు– అన్నీ ప్రభావితం అయిన కాలం. అన్నిటికీ మించి, వ్యాధి వ్యాప్తి విపరీతమై, మృత్యువు ప్రతి తల మీద వేలాడే కత్తై, జబ్బును ఎదిరించడానికి వనరులూ సామర్థ్యమూ సంకల్పమూ సరిపోనివై, సంక్షోభం నెలకొని ఉన్న సమయం ఇది. ఈ సమయంలో ప్రజాప్రతినిధులు చేసే చర్చల్లో, సమీక్ష, చర్చ, దిద్దుబాటు, దీక్ష– అన్నీ వ్యక్తమవుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. 


మానవ ప్రయత్నం చేయగలిగినంత చేస్తున్నాము, ఇక చేయవలసినది ఏమీ లేదని నిర్లిప్తంగా, నిస్సహాయంగా మిగిలిపోతే సరికాదు. అతి కొద్దిమందినే అయినా వ్యాధి చంపేస్తున్నది. బతికి బట్టకట్టినవారిని కూడా కృశింపజేస్తున్నది. చావైనా, బతుకైనా వైద్య వ్యయం కుటుంబాలు నెత్తురు పీలుస్తున్నది. ఆరంభదశలో అన్ని కట్టడులు పాటించి, విజృంభణ దశలో అన్నిటిని సడలించే విధానమేమిటో ప్రజలకు అర్థం కాక, జీవనసమరంలో అనివార్యంగా ప్రమాదాలకు సిద్ధపడుతున్నారు. ఒక సాంక్రామిక వ్యాధి దావానలంలా వ్యాపిస్తే ఎదుర్కొనేందుకు కావలసిన ప్రాథమిక వైద్య సదుపాయాల వ్యవస్థ ఏర్పరచుకోవడం ఏ దేశానికీ సాధ్యపడదు. కానీ, ముందే కునారిల్లిపోయినది భారతీయ ప్రాథమిక వైద్య వ్యవస్థ. దానికి తోడు ప్రైవేటు వైద్యానికి ప్రభుత్వాల పరోక్ష మద్దతు. తెలంగాణ వైద్య, ఆరోగ్య వ్యవస్థ కూడా పెద్ద మెరుగుగా ఏమీ లేదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన సంఖ్యలో వైద్యులు, సర్జన్లు లేరు. ఇక సదుపాయాల స్థాయి కూడా అంతంత మాత్రమే. ఆస్పత్రులు, పరీక్షా కేంద్రాలు–అన్నీ ప్రధానంగా హైదరాబాద్‌లో, మరి ఒకటి రెండు పట్టణాల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. జంట నగరాలను అల్లకల్లోలం చేసిన కరోనా ఇప్పుడు గ్రామాలకు తరలింది. జిల్లాల్లో విజృంభిస్తున్నది.


ఆరంభం నుంచి తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కరోనా విషయంలో, విమర్శలను ఎదుర్కొంటూనే ఉన్నది. పరీక్షలు జరపడం దుస్సాధ్యమైన కాలం నుంచి, తగినంతగా జరపకపోవడం, గణాంకాల విశ్వసనీయత లోపించడం, చివరకు మరణాల సంఖ్య కూడా అనుమానాస్పదం కావడం– న్యాయస్థానాలు కూడా పరిగణనలోకి తీసుకున్నాయి. మొదట ప్రైవేటు ఆస్పత్రులను అసలే అనుమతించకపోవడం, కోర్టు జోక్యం తరువాత అనుమతించి, ఆ పైన ఎటువంటి నియంత్రణా అమలుచేయకపోవడం– విమర్శలకు లోనయ్యాయి. ప్రైవేటు ఆస్పత్రులలో సగం పడకలు ప్రభుత్వం నిర్ణయించిన చార్జీలకే కేటాయిస్తామని చెప్పిన మాట కూడా ఆచరణలో అమలుకాలేదు. ప్రభుత్వ ఆస్పత్రుల విశ్వసనీయతను పెంచడానికి, ప్రచారం చేయడానికి ప్రభుత్వం పెద్దగా ప్రయత్నించలేదు. దానితో, ఇన్నాళ్లూ ప్రభుత్వ వైద్యం మీద ఏర్పడి ఉన్న దురభిప్రాయం ఒకవైపు, స్తోమత సరిపోని ప్రైవేటు వైద్యం మరొకవైపు ప్రజలను బాధించాయి. చికిత్స కోసం లక్షలకొలది కుమ్మరించలేక, ఎన్ని కుటుంబాలు అప్పుల పాలయ్యాయో? 


నేరుగా, జబ్బు, వైద్యం వంటి అంశాలే కాక. పరోక్షంగా కరోనా సన్నివేశం అసంఖ్యాకులను ప్రభావితం చేసింది. నిరుద్యోగులను, రుణగ్రస్తులను చేసింది. అనేక జీవనాధారాలు నిష్క్రమించాయి. మరికొన్నిటికి గిరాకీ తగ్గింది. సేవా, వినోదరంగంలో పనిచేసే లక్షలాది మంది చిరుద్యోగులు రోడ్డున పడ్డారు. పరిస్థితి ఎట్లా మెరుగుపడుతుందో, వారి జీవనాధారాలు ఎప్పుడు మెరుగుపడతాయో తెలియదు. లాక్‌డౌన్‌ ఆరంభకాలంలో పంచిన ఉచిత రేషన్‌, అందించిన కాసింత డబ్బు, మినహా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు బాధితులకు విదిల్చింది ఏమీ లేదు. వేలాది, లక్షలాది మంది వలసకార్మికులు రహదారులపై పాదచారులై స్వప్రాంతాలకు తరలివెడుతుంటే, ప్రభుత్వ యంత్రాంగం తనంత తాను చేసింది పెద్దగా లేదు.


సమస్యలన్నీ అట్లాగే ఉన్నాయి. వైరస్‌ కూడా వేగం మీదనే ఉన్నది. అయినా జనజీవనాన్ని తిరిగి పూర్వపు స్థాయికి చేర్చాలని ప్రయత్నం జరుగుతున్నది. ఫలితం, ఆశించనంత ఉండడం లేదు. ఈ పరిస్థితి వల్ల దెబ్బతిన్న సకల రంగాలకు, కోట్లాది మంది ప్రజలకు ఏదో ఒక ఆశ్వాసన లభించాలి. కేంద్రం బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ, రాష్ట్రాలకు ఇవ్వవలసిన సాయం ఇవ్వడం లేదు, నిజమే. కానీ, ఒక పెద్ద ఉపద్రవంలో చిక్కుకున్న తన ప్రజానీకం కష్టాలను ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎట్లా? దీర్ఘకాలికమైన, కీలకమైన అన్ని అంశాలతో పాటు, అన్నిటి కంటె ఎక్కువగా ప్రజాప్రతినిధులు ఈ ఆరోగ్య ఉత్పాతం గురించి, దాని సామాజిక పర్యవసానాల గురించి చర్చించాలి.


Advertisement
Advertisement
Advertisement