Abn logo
Sep 22 2020 @ 00:20AM

పోలీసుల డేగ కన్ను

Kaakateeya

పోలీసు దిగ్బంధంలో ప్రాణహిత తీర ప్రాంతాలు

ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మావోయిస్టులను పట్టుకోవడమే లక్ష్యం

రాష్ట్ర కమిటీ సభ్యుడు భాస్కర్‌ లేఖతో మరింత అప్రమత్తం


కాగజ్‌నగర్‌, సెప్టెంబరు21: కడంబా ఎన్‌కౌంటర్‌ నేపథ్యంలో జిల్లాలోని ప్రాణహిత తీర ప్రాంతాలను పోలీసు యంత్రాంగం డ్రోన్ల సహాయంతో జల్లెడ పడుతోంది. కాగజ్‌నగర్‌ మండలం కడంబా అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మావోయిస్టులను పట్టుకునేందుకు ఉమ్మడి జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. తప్పించుకున్న మావోయిస్టులు ప్రాణ హిత తీర ప్రాంతం గుండా మహారాష్ట్రకు వెళ్లే అవకాశం ఉండడంతో నిఘాను పటిష్టం చేశారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన కొన్ని గంటల్లోనే మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు, మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల ఇన్‌చార్జి ఆడెల్లు భాస్కర్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. కడంబా ఎన్‌కౌంటర్‌ బూటకమని, ఇందుకు పోలీసులు, టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల నాయకులకు మూల్యం తప్పదని ఆయన హెచ్చరికలు  జారీ చేశారు. దీంతో జిల్లాలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు హైరానా పడు తున్నారు. పదేళ్ల తర్వాత జిల్లాలో ఎన్‌కౌంటర్‌  జరగ డంతో అందరిలోనూ టెన్షన్‌ వాతావరణం నెలకొంది. కడంబాతో పాటు సమీప ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు  భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు. అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ చేపడుతూ అనుమానితులను ఆరా తీస్తున్నారు. 


టార్గెట్‌ అడెల్లు భాస్కర్‌

కడంబా ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు అడెల్లు భాస్కర్‌ తప్పించుకున్నారన్న సమాచారంతో పోలీసులు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. కడంబా వీదుగా బెజ్జూరు, ప్రాణహిత, మహారాష్ట్ర సరిహద్దున వెళ్లే అవకాశం ఉండడంతో 400మంది సాయుధ బలగాలతో కూంబింగ్‌ చేపడుతున్నారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన సమీప గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వారు వచ్చారా అనే కోణంలోనూ పోలీసులు వాకబు చేస్తున్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో మావోయిస్టు పార్టీ పునర్‌ నిర్మాణం చేసేందుకు అడెళ్లు భాస్కర్‌ కార్యకాలపాలు చేపడుతున్నట్టు ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి సమాచారం రావటంతో గిరి ప్రాంతాలపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. పోలీసులు గ్రామీణ ప్రాంతాల్లో ఇన్‌ఫార్మర్ల ద్వారా అడెల్లుభాస్కర్‌ కదలికలపై ఆరా తీస్తున్నారు. చొక్కాలు, జుగ్నాక బాజీరావుల ఎన్‌కౌంటర్‌ దరిమిలా మావోయిస్టులు ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉందనే చర్చ జిల్లాలో జరుగుతోంది. దీంతో మారుమూల ప్రాంతాల వాసులు  భయం భయంగా కాలం గడుపుతున్నారు.


మహారాష్ట్ర పోలీసులూ అప్రమత్తం

ప్రాణహిత పరివాహాక ప్రాంతం గుండా తెలంగాణ పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా, ప్రాణహిత అవతలి వైపు మహారాష్ట్ర ప్రాంతం ఉండడంతో అక్కడి పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. మహారాష్ట్ర అవతలి ఒడ్డున కూడా   పోలీసులు కూంబింగ్‌ చేస్తున్నారు. కడంబా నుంచి వంద కిలోమీటర్ల మేర పోలీసులు అడగడుగునా జల్లెడ పడుతున్నారు. దీంతో స్తబ్ధుగా ఉన్న అటవీ ప్రాంతంలో ఇప్పుడు కూంబింగ్‌, కార్డెన్‌సెర్చ్‌ జరుగుతుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని  ప్రజలు టెన్షన్‌ పడుతున్నారు.


అడవుల జల్లెడ 

చింతలమానేపల్లి: సరిహద్దు ప్రాంతాలైన అహిరి, గడ్చిరోలి, వెంటాపూర్‌, సిరోంచ, బామిని, రేగుంటతో పాటు పోతెపల్లి, నీల్వాయి, చింతలమానేపల్లి, బెజ్జూరు, దహెగాం, సిర్పూర్‌(టి) మండలంలోని ప్రాణహిత తీర ప్రాంతంపై 15గ్రేహౌండ్స్‌ బలగాలు  దృష్టి సారించాయి. ఈ క్రమంలో పోలీసులు ప్రాణహిత పరిసరాలను డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించి ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.సోమవారం  జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ సత్యనారాయణ గూడెం ప్రాణహిత తీరాన్ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.  గ్రేహౌండ్స్‌ బలగాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ కూంబింగ్‌ నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు పోతున్నట్లు వివరించారు. ఎన్‌కౌంటర్‌లో తప్పిం చుకున్న భాస్కర్‌తో పాటు మిగిలిన దళ సభ్యులను పట్టుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు.   ఆయన వెంట మంచిర్యాల డీసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, ఉట్నూర్‌ డీఎస్పీ ఉదయ్‌కుమార్‌, కౌటాల సీఐ శ్రీనివాస్‌, ఎస్సైలు సందీప్‌కుమార్‌, ఆంజనేయులు తదితరులు ఉన్నారు. 

Advertisement
Advertisement
Advertisement