Abn logo
Oct 4 2020 @ 00:04AM

అంతకుమించి...మేడ్చల్‌ జిల్లాలో లక్ష్యం దాటిన హరితహారం

Kaakateeya

రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచిన జిల్లా 

నిర్దేశించిన మొక్కల లక్ష్యం 60.62లక్షలు

ఇప్పటి వరకు నాటింది 70లక్షలు 

నీడనిచ్చే చెట్లతో పాటు పండ్లు, పూల మొక్కల పెంపకం

115శాతం పూర్తి..


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి): ప్రభుత్వం హరితహారం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకం కింద ప్రతిసంవత్సరం ప్రభుత్వశాఖల ద్వారా మొక్కలను నాటుతున్నారు. మేడ్చల్‌- మల్కాజ్‌గిరి జిల్లాను ఆకుపచ్చగా మార్చాలన్న లక్ష్యంతో జిల్లాయంత్రాంగం ఈ కార్యక్రమంలో అందర్నీ భాగస్వాములను చేసింది.  గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంది. జిల్లాలో మొత్తం 61 గ్రామ పంచాయతీలు, నాలుగు మునిసిపల్‌ కార్పొరేషన్లు, 9 మునిసిపాలిటీలున్నాయి. ఈ సంవత్సరంలో జిల్లాలో 60.62లక్షల మొక్కలను నాటాలన్న లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఇప్పటివరకూ దాదాపు 70లక్షల మొక్కలను నాటారు. హరితహారం లక్ష్యం 115శాతం పూర్తయింది. మొక్కలు నాటడంలో రాష్ట్రంలో మేడ్చల్‌ జిల్లా రెండోస్థానంలో నిలిచింది. గ్రామాలు, పట్టణాల్లో విరివిగా మొక్కలు నాటారు. గ్రామానికో నర్సరీని ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇప్పటివరకూ 61 నర్సరీలను ఏర్పాటు చేశారు. వాటిలో శామీర్‌పేట్‌లో 22, ఘట్‌కేసర్‌లో 11, మేడ్చల్‌లో 17, కీసరలో 11వరకు ఏర్పాటు చేశారు. అయితే పంచాయతీరాజ్‌శాఖ నుంచి 53, అటవీశాఖ నుంచి 8 నర్సరీలను ఏర్పాటు చేశారు.


హరితహారంలో ప్రధానంగా నీడనిచ్చే చెట్లతో పాటు పండ్లు, పూలమొక్కలను పెంచి పంపిణీ చేశారు. టేకు, కానుగ, నేరేడు, ఈత, ఉసిరి, దానిమ్మ, నిమ్మ, జామ, బొప్పాయి, సీతాఫల్‌ పండ్ల మొక్కలు, చెరువు కట్టలపై ఈత, కర్జూర, తుమ్మ మొక్కలను నాటారు. అదే విధంగా ఇళ్లల్లో పెంచుకునేందుకు పలురకాల పూల మొక్కలను కూడా పంపిణీ చేశారు. వీటిలో గులాబీ, గన్నేరు, చామంతి, మల్లెపూలు, తదితర మొక్కలను పంపిణీ చేశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రదేశాలతో పాటు ప్రభుత్వ భూములు, కార్యాలయాలు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేట్‌ సంస్థలు, రోడ్డుకు ఇరువైపులా, ప్రతి ఇంటివద్ద మొక్కలు నాటారు. మునిసిపల్‌ కార్పొరేషన్లలో 6 నుంచి 7లక్షల మొక్కలు, మునిసిపాలిటీల్లో 3నుంచి 5లక్షల వరకూ మొక్కలు నాటారు. ప్రతి మండలంలో 3.50 లక్షల మొక్కలు, పలుశాఖల ఆధ్వర్యంలోనూ ఖాళీ స్థలాల్లోనూ మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని స్థానిక సంస్థ లతో పాటు గ్రామీణాభివృద్ధి, అటవీ, పంచాయతీరాజ్‌, ఉద్యానవన, ఇరిగేషన్‌, ఆబ్కారీ, వ్యవసాయ, విద్యా, పరిశ్రమల, తదితర 30 శాఖల సమన్వయంతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం దాటేశారు. 

Advertisement
Advertisement