Abn logo
Sep 26 2020 @ 04:12AM

సాంస్కృతిక రంగం దిగ్ర్భాంతి

Kaakateeya

బాలును గౌరవ డాక్టరేట్‌తో సత్కరించిన తెలుగు వర్సిటీ  


రవీంద్రభారతి, సెప్టెంబర్‌ 25 (ఆంధ్రజ్యోతి): గాన గాంధర్వుడు బాల సుబ్రహ్మణ్యం స్వరం ఆగిపోవడంతో సాంస్కృతిక రంగం తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టింది. నగరంలోని సాంస్కృతిక వేదికలు రవీంద్రభారతి, ఎన్టీఆర్‌ కళామందిరం, గానసభ, సుందరయ్యవిజ్ఞాన్‌ కేంద్రం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, శిల్పాకళావేదికలు బాలు గానామృతంలో ఓలలాడాయి.  ఇప్పుడు అవన్నీ మూగరోదన అనుభవిస్తున్నాయి. 


పాట ఉన్నంత కాలం బాలు ఉంటారు : రమణాచారి 

బాలుతో 30 ఏళ్ల సోదరభావం. పాట బతికున్నంత కాలం బాలు బతికుంటారు. గాయకుడిగానే కాకుండా నటుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేశారు. ఆయన వల్లే నేను దేవస్థానం సినిమాలో నటించాను. బాలు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. 


పాటంటే ఆయనే గుర్తొస్తారు - బి.శివకుమార్‌, సంగీత నాటక అకాడమీ చైర్మన్‌ 

50 ఏళ్లకు పైగా సినీ ప్రస్థానం, 40 వేలకు పైగా పాటలు, 40 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి ప్రపంచంలోనే అరుదైన రికార్డు సృష్టించారు బాలు. మధురమైన పాటలతో తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. 


సంగీత ప్రపంచాన్ని శాసించారు - మామిడి హరికృష్ణ 

తెలుగు సినీ సంగీతాన్ని శాసించిన బాలసుబ్రహ్మణ్యం మరణం బాధాకరం. చిన్నతనం నుంచి బాలు పాటలు వింటూ పెరిగాను. గాన గాంధర్వుడితో కలిసి వేదికలు పంచుకోవడం నా అదృష్టంగా భావిస్తా. 


తెలుగు వర్సిటీ సంతాపం 

బాలు మృతి పట్ల పొట్టిశ్రీరాములు తెలుగు వర్సిటీ సంతాపాన్ని వ్యక్తం  చేసింది. 1998లో వర్సిటీ ఆరవ స్నాతకోత్సవంలో ఎస్పీ బాలుకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. తెలుగు వర్సిటీ పట్ల బాలు చూపిన ఆదరణ మరువలేనిదని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. తెలుగు భాష, సంస్కృతికి అర్థవంతమైన నిర్వచనాన్ని అందించిన భాషా ప్రియులని అభివర్ణించారు. 


స్వరం మూగబోయింది : సంస్థల నిర్వాహకులు 

సాంస్కృతిక సంస్థల నిర్వాహకులు రఘురామ్‌, సంజయ్‌కిషోర్‌, వంశీరామరాజు, సామల వేణు, కళ పత్రిక సంపాదకుడు మహ్మద్‌ రఫి, సత్కళాభారతి సత్యనారాయణ, ఆమని, ఆకృతి సుధాకర్‌, ధర్మారావు, యువకళావాహిని వైకే.నాగేశ్వరరావు, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞశర్మ, సారంగి ఫౌండేషన్‌ ఖాజా, గుమ్మడి గోపాలకృష్ణ, మైమ్‌ మధు, ప్రముఖ సంగీత దర్శకుడు, సినీ నేపథ్య గాయకుడు జీ.ఆనంద్‌లతో పాటు కళాకారులు, గాయకులు బాలు మృతికి తమ సంతాపాన్ని ప్రకటించారు. ఎస్పీ బాలు స్వరం ఇక వినలేమా అంటూ పలువురు కంటతడి పెట్టారు. 


త్యాగరాయగానసభతో ఎనలేని అనుబంధం

కవాడిగూడ : చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభతో బాలుకు నాలుగు దశాబ్దాల బంధం ఉంది. 1978 నుంచి గానసభలో జరిగిన ఎన్నో కార్యక్రమాలలో బాలు పాల్గొన్నారు. ఈ వేదికపై సినీ గీతాలను ఆలపించి గానప్రియులను మంత్రముగ్ధులను చేశారు. గానసభ పూర్వ అధ్యక్షుడు కళావెంకటదీక్షితులతో పాటు ప్రస్తుత అధ్యక్షుడు కళా జనార్థన మూర్తితో బాలుకు సాన్నిహిత్య సంబంధం ఉంది. 1978, 82, 88, 91, 96, 2001, 2006, చివరగా 2018లో గానసభలో జరిగిన సీడీ ఆవిష్కరణ కార్యక్రమంలో బాలు పాల్గొన్నారు. ఏటా బాలు జన్మదినం సందర్భంగా జూన్‌ మాసంలో బాలు గీత మాలిక శీర్షికన సినీ సంగీత విభావరిలో వర్ధమాన గాయనీ, గాయకులకు వేదిక కల్పిస్తున్నామని జనార్థనమూర్తి తెలిపారు.


ఉత్సాహపరిచేవారు : డాక్టర్‌ రవీంద్రనాథ్‌

ఖైరతాబాద్‌ : ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా బాలు తనతో మాట్లాడేవారని గ్లోబల్‌ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ రవీంద్రనాథ్‌ తెలిపారు. గ్లోబల్‌ ఆస్పత్రి చెన్నైలో బేరియాట్రిక్‌ సర్టరీ చేయించుకున్నారని అన్నారు. లక్డీకాపూల్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో నడిచే ఒబెసిటీ సపోర్ట్‌ గ్రూప్‌ సమావేశాల్లో పాల్గొని అందరినీ ఉత్సాహ పరిచేవారని రవీంద్రనాథ్‌తో పాటు బేరియాట్రిక్‌ సర్జన్‌ డాక్టర్‌ లక్ష్మి తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement