Abn logo
Sep 15 2020 @ 05:24AM

మూగజీవాల రోదన

Kaakateeya

పశువైద్యశాలలో మందుల కొరత

ప్రైవేటు మెడికల్‌ దుకాణాలలో 

మందుల ధరలకు రెక్కలు

బయటి నుంచి తీసుకువచ్చి వైద్యం  

చేయిస్తున్న పశుయజమానులు 

అయోమయంలో పాడి రైతులు


మోమిన్‌పేట: మండలంలోని పశువైద్య ఆసుపత్రిలో మందుల కొరతతో మూగజీవాల రోదన  వినిపిస్తోందని మండల రైతులు వాపోతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో మూగజీవాలు అంతుచిక్కని వ్యాధులతో అనారోగ్యానికి గురవుతున్నాయి. మండలంలోని మోమిన్‌పేట, మొరంగపల్లి గ్రామాలలో ఉన్న పశువైద్యశాలలు, చీమలదరి, ఎన్కతల, మేకవనంపల్లి గ్రామాలలో సబ్‌సెంటర్లు ఉన్నా యి. మోమిన్‌పేట, మొరంగపల్లి గ్రామాలలో డాక్టర్లు ఉన్నా మందుల కొరతతో దిక్కుతోచలేని స్థితిలోఉన్నారు. సబ్‌సెంటర్లలో పశువైద్యం అందించడానికి వైద్యపరికరాలు లేక చెట్లకు కట్టి టీకాలు ఇస్తున్నారు.


మండలంలో సుమారుగా 15వేల పశువులు ఉండగా, ఇందులో 60శాతం పశువులు గొంతునొప్పి, కీళ్ల నొప్పులు, దద్దుర్లు వచ్చి మూగజీవాలు లేవ లేని స్థితిలో ఉన్నాయి. వైద్యులు బయటి నుంచి మందులు తీసుకువస్తేనే టీకాలు ఇస్తామని రైతులకు సూచిస్తున్నారు. ప్రైవేటు మెడికల్‌లలో మందుల ధరలు ఆకాశాన్నంటున్నాయని, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామలలో పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మూగజీవాలకు ఉచిత మందలు, టీకాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.


అనారోగ్యం బారిన పడుతున్నాయి

పశువుల చర్మంపై కంతులు, దద్దుర్లు వచ్చి అనారోగ్యపాలవుతున్నాయి. గ్రామంలో పశువైద్యశాల ఉన్నప్పటికీ సమయానికి డాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. పైగా మందుల కొరత ప్రైవేటు మెడికల్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది.

- రవీందర్‌రెడ్డి, రైతు,ఎన్కతల


వాతావరణ మార్పులతోనే వ్యాధులు

వాతావరణ మార్పుల వల్ల పశువులకు లంపిస్కీన్‌ వ్యాధి సోకుతుంది. మండలంలోని పశువైద్యశాలలో కొన్ని మందులు ఉన్నప్పటికీ, అవసరం ఉన్న మందులను బయట తీసుకోవాలని సూచిస్తున్నాం. ప్రభుత్వం నుండే మందుల కొరత ఉంది. వైద్యశాలలో వైద్యులు, కంపౌండర్ల కొరతతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. వారం రోజుల్లో మందులు అందుబాటులో వస్తాయి. రైతులు ఆందోళన చెందవద్దు. 

- డాక్టర్‌ అన్వేష్‌,మోమిన్‌పేట పశువైద్యాధికారి 

Advertisement
Advertisement