Abn logo
Sep 18 2021 @ 01:16AM

కదం తొక్కిన ‘ఎర్ర’దండు

తిరుపతిలో సీపీపీ పాదయాత్ర 


ప్రభుత్వ ఆస్తులన్నీ అదానీ, అంబానీకి అమ్మేస్తున్నారంటూ కేంద్రంపై రామకృష్ణ ఆగ్రహం 

తిరుపతి(కల్చరల్‌), సెప్టెంబరు 17: కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ‘ఎర్ర’దండు ముందుకు కదిలింది. పాలకుల తీరును నిరసించింది. రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందంటూ ధ్వజమెత్తింది. రాష్ట్రవ్యాప్త కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తిరుపతిలో నేతలు, కార్యకర్తలతో కలిసి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాదయాత్ర నిర్వహించారు. బాలాజీ కాలనీ వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించాక.. గాంధీరోడ్డు, రైల్వేస్టేషన్‌, మీదుగా  ఆర్టీసీ బస్టాండు వరకు  పాదయాత్ర సాగింది. ఈ సందర్భంగా మీడియాతో రామకృష్ణ మాట్లాడుతూ.. గుజరాత్‌కు చెందిన ప్రధాని మోదీ, అమిత్‌షా, అదే రాష్ట్రానికి చెందిన అదానీ, అంబానీలకు ప్రభుత్వ ఆస్తులన్నీ అప్పనంగా అమ్మేస్తున్నారని ఆరోపించారు. విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లు, పోర్టులు, జాతీయ రహదారులనూ వారికే అప్పగిస్తున్నారని మండిపడ్డారు. ఎందరో ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కునూ ప్రైవేటీకరించడం సిగ్గుచేటన్నారు. మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో పది నెలలుగా రైతులు చేపట్టిన ఉద్యమం చారిత్రాత్మకమన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన  హామీలనూ కేంద్రం తుంగలో తొక్కిందని విమర్శించారు. రైతు చట్టాలతోపాటు కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలంటూ ఈనెల 27న భారత్‌బంద్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనికి దేశవ్యాప్తంగా 500 రైతు సంఘాలు, 400 కార్మిక సంఘాలు మద్దతిస్తున్నాయని, రాష్ట్రంలోనూ సీఎం జగన్‌, విపక్ష నేత చంద్రబాబునాయుడు మద్దతివ్వాలని కోరారు. మోదీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు హరినాథరెడ్డి, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్‌ విమర్శించారు. ఈ  పాదయాత్రలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు టి.జనార్దన్‌, చిన్నం పెంచలయ్య, నాగరాజు, ఎల్‌.నరసింహులు, కృష్ణప్ప, గురవయ్య, మురళి, నగరకార్యదర్శి విశ్వనాథ్‌, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు జయలక్ష్మి, ప్రజా సంఘాల నాయకులు  నదియా, రాధాకృష్ణ, శివ, రాజా, ఉదయ్‌, చలపతి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.  

ప్రజా సంఘాల సంఘీభావం


టీడీపీ తిరుపతి లోక్‌సభ కమిటీ అధ్యక్షుడు నరసింహయాదవ్‌, ఆర్సీ మునికృష్ణ, కాంగ్రె్‌సపార్టీ నగర అధ్యక్షుడు మాంగాటి గోపాల్‌రెడ్డి, ఆర్పీఐ అధ్యక్షుడు అంజయ్య, ప్రజా సంఘాల ఐక్యవేదిక నేత కుమార్‌రెడ్డి, తిరుపతి చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు మంజునాధ్‌ తదితరులు ఈ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు.