Abn logo
Sep 14 2021 @ 23:45PM

కాళ్ల పారాణి ఆరకముందే.. భర్త, అత్త అనుమానంతో వేధిస్తున్నారంటూ..

ఆత్మహత్యకు పాల్పడ్డ ఝాన్సీ (ఫైల్‌ఫొటో)

నవవధువు ఆత్మహత్య

అత్తారింటి వేధింపులతో ఘటన

భర్త, అత్త, ఆడబిడ్డలపై కేసు నమోదు 


కడప(క్రైం), సెప్టెంబరు 14: కాళ్ల పారాణి ఆరలేదు.. ఆ ఇంట పెళ్లి ముచ్చట్లు ఇంకా తీరలేదు. పెళ్లి సందడి కూడా తగ్గలేదు. పెళ్లి ఇంటికి కొట్టిన రంగులు చెదిరిపోలేదు. అప్పుడే అత్తారింటి వేధింపులు భరించలేక నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన కడప నగరం నెహ్రూనగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ అమర్‌నాథరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. సీఐ, ఎస్‌ఐల వివరాల మేరకు..


నెహ్రూనగర్‌కు చెందిన జొన్నాదుల ఝాన్సీ (23)కి రాజంపేట మండలం కొత్తబోయిన పల్లెకు చెందిన రాధాకృష్ణయ్యతో నెల క్రితం వివాహం జరిగింది. ఇద్దరూ బీటెక్‌ చదివారు. వేర్వేరు చోట్ల ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్లి అయిన రోజు నుంచి ఝాన్సీని భర్త, అత్త, ఆడబిడ్డలు వరకట్నం కోసం మానసిక, శారీరక వేధింపులకు గురిచేస్తుండేవారు. ఈ నేపథ్యంలో ఆమె పుట్టింటికి వచ్చి ఉంటోంది. అయినా వారి వేధింపులు తగ్గకపోవడంతో మంగళవారం తెల్లవారుజామున ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించి మృతురాలి తల్లి పద్మజ ఫిర్యాదు మేరకు భర్త రాధాకృష్ణయ్య, అత్త వెంకటసుబ్బమ్మ, ఆడబిడ్డలు శేషమ్మ, గీతాంజలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.


8 పేజీల సూసైడ్‌ నోట్‌

నవ వధువు ఝాన్సీ తన భర్త, అత్త, ఆడబిడ్డలు శారీరక, మానసిక వేధింపులకు గురిచేయడంతో పాటు అనుమానంతో వేధిస్తున్నారంటూ 8 పేజీల సూసైడ్‌ నోట్‌ను రాసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.