Abn logo
Sep 18 2021 @ 00:08AM

ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించిన బీజేపీ

మాట్లాడుతున్న ఎంఏ గఫూర్‌

  1. 27న భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలి
  2. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్‌


నంద్యాల, సెప్టెంబరు 17: దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు, కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌ విమర్శించారు. శుక్రవారం ‘బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించండి-దేశాన్ని రక్షించండి’ అనే అంశంపై నంద్యాలలో సదస్సు నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఏ.నాగరాజు అధ్యక్షతన జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా ఎంఏ గఫూర్‌ హాజరై ప్రసంగించారు. 2014-2019 ఎన్నికల్లో దేశ ప్రజలకు మోదీ ఇచ్చిన వాగ్దానాలేవీ అమలుకు నోచుకోవలేదన్నారు. దేశ ప్రజలను నాశనం చేసేందుకు ఎన్నో చట్టాలను చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ కార్పొరేట్‌ శక్తులకు ధారాదత్తం చేస్తుండటం దుర్మార్గమని అన్నారు. పెట్రో ధరలు పెంచి పెట్టుబడి దారులకు ఊడిగం చేస్తున్నారన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ నెలల తరబడి నిరసన వ్యక్తం చేస్తున్నా రైతులను పట్టించుకోకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గర్హనీయమని అన్నారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 27న జరిగే భారత్‌ బంద్‌లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొన్నాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రమే్‌షకుమార్‌, జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు ఏ రాజశేఖర్‌, ఏసురత్నం, జిల్లా నాయకులు తోటమద్దులు, సద్దాం హుసేన్‌, గౌస్‌, పుల్ల నరసింహ, నరసింహనాయక్‌, వివిధ మండలాల సీపీఎం, అనుబంధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.