Sep 27 2020 @ 02:38AM

పాటలో మాటకు విలువిచ్చిన బాలు

పాలు తెల్లగా ఉంటాయనీ, బాలు మధురంగా పాడతాడని సర్వులకూ తెలిసిన సత్యం. అలాగే బాలు పుట్టుపూర్వోత్తరాల గురించి, 16 భాషల్లో ఆయన పాడిన 41 వేలకు పైగా పాటల గురించి, ఆయన బహుముఖ కళావైదుష్యం గురించి ఈ రెండ్రోజులుగా మీడియాలో మళ్లీ మళ్లీ వివరించారు. ఇంతకు మించి బాలు అక్షరానికిచ్చిన ప్రాముఖ్యం గురించి సినీ సంగీత సాహిత్యాలకు వారధిగా ఆయన చేసిన కృషి గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. ‘నా మాతృభాష సంగీతం’ అని బాలు అనడంలోనే ఆయన సంగీతంలో భాషకిచ్చిన ప్రాధాన్యం అర్థమవుతోంది. ఆయన ఎన్ని భాషల్లో పాడినా, పాట గురించి సమగ్రంగా తెలుసుకొని దాన్ని సొంతం చేసుకుంటే తప్ప పాడే వారు కాదు. ఏ భాషలోనయినా తను పాటకు న్యాయం చెయ్యలేకపోతున్నానని అనిపిస్తే మనసును చంపుకోలేక ఆ పాటను సున్నితంగా తిరస్కరించేవారు. ఒక స్థాయికి చేరుకున్న తర్వాత తెలుగులో కూడా చౌకబారు పాటల్ని, అశ్లీలగీతాల్ని పాడ్డానికి నిరాకరించారు. తప్పనిసరి పరిస్థితులలో పాడవలసి వస్తే ‘‘అందరూ ఉదయమే ముఖ ప్రక్షాళన సమయంలో నాలుక గీసుకుంటే, నేనిలాంటి పాటలు పాడి రెండు, మూడు సార్లు నాలుక గీసుకోవలసి వస్తోంది’’ అంటూ అపరాధ భావంతో చమత్కరించేవారు.


సినిమా పాటకు సంబంధించినంత వరకు బాలు సంగీత సాహిత్యాలను రెండు కళ్లుగా భావించేవారు. పాటలో సాహిత్యం వినపడాలని ఎప్పుడూ చెప్పేవారు. ‘తెలుగు సినీ గేయ కవుల చరిత్ర’ పుస్తకానికి రాసిన ముందుమాటలో.. ‘పదాలదేమిటి? శవాల్లా పడి ఉంటాయి. నా సంగీతపు చిరుజల్లు సంజీవనిలా వాటికి ప్రాణం పోస్తుందనే అహం బ్రహ్మస్మిగాళ్లకు చెంపపెట్టు ఈ గ్రంథం’ అన్న బాలు వాక్యాలు సాహిత్యంపై ఆయనకున్న అపారమైన గౌరవానికి ప్రత్యక్ష సాక్ష్యాలు. 


ఎన్ని వేల పాటల్ని పాడినా ప్రతి పాట కోసం మొదటి పాట పాడుతున్నట్టుగా సాధన చేసేవారు. పాట రాసిన కవి ఎవరో తెలుసుకొని, అది తనకు పూర్తిగా అవగతం కాకపోయినా, సందేహాలున్నా కవిని అడిగి తెలుసుకునే వారు. పాటల్లోని చమత్కారాలను అలంకారాలను వేటూరి, సిరివెన్నెల వంటి సమకాలిక కవులు విడమర్చి చెబితే విని పరవశించేవారు. ఉదాహరణకు ‘సాగర సంగమం’ చిత్రంలోని ‘వాగర్థావివ సంపృక్తౌ...’ శ్లోకంలోని ‘పార్వతీ ప-రమేశ్వరౌ’ పదచ్ఛేదాన్ని చెప్పుకోవచ్చు. 


సినిమా పాటను పాడ్డానికి సంగీత జ్ఞానంతో పాటు ముందుగా పాటను అర్థం చేసుకోవడం ముఖ్యమనే మౌలిక విషయాన్ని బోధించిన గీతాచార్యుడు బాలసుబ్రమణ్యం. ఆదరణ తగ్గిన తెలుగు వారి ఆస్తి అయిన పద్యాన్ని కూడా ‘పాడుతా తీయగా’ వేదిక ఎక్కించి భాషాభిమానం చాటుకున్న మహనీయుడు! తను పాడిన పాటల్లో విమర్శకులు ఏవైనా పొరపాట్లను ఎత్తిచూపితే అవి సమంజసం అనిపిస్తే సహృదయతతో స్వీకరించేవారు. తాను చేసిన తప్పు గురించి సవినయంగా, బహిరంగంగా చెప్పి క్షమాపణలు అడిగేవారు. యువకవులు రాసే పాటల్లో దోషాలు దొర్లితే రికార్డింగ్‌ సమయంలోనే వాటిని సూచించి సరిదిద్దుకోమనడానికి వెనుకాడేవారు కాదు.


వినయ వినమ్రతలు బాలు ఆభరణాలు. తను శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించలేదంటూనే, రాగ పరిజ్ఞానం చాలదంటూనే ఎలాంటి పాటనైనా సంగీతజ్ఞులు మెచ్చేలా ఆలపించేవారు. తనకున్న సాహిత్య పరిచయం పరిమితం అంటూనే ‘పాడుతా తీయగా’ కార్యక్రమాల్లో తెలుగు బోధించే అధ్యాపకులకు మించిన సాహిత్య పాటవాన్ని, వ్యాకరణ పరిజ్ఞానాన్ని కనబర్చేవారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వర్ధమాన గాయకులు.. పదాలను తప్పుగా ఉచ్చరిస్తే బాలు అస్సలు ఊరుకునేవారు కాదు. వెంటనే ఆ తప్పుల్ని సరిచేసి, సరిగ్గా పాడేలా చేసేవారు. ఉదాహరణకు.. ‘చందమామ’ అనే పదంలో దంత్య ‘చ’కారానికి బదులు తాలవ్య ‘చ’కారం పలికితే ఒప్పుకొనేవారు కాదు. ఎలా పలకాలో చెప్పి సరిగ్గా పాడించేవారు. ‘ళ’, ‘ణ’ వంటి మూర్ధన్యాలను తప్పుగా పలికినా సరిచేసేవారు. మహాప్రాణాలు (ఒత్తులు) సరిగ్గా పలకకపోతే మళ్లీ పాడించేవారు. బాలు వర్తమాన సినీ గాయనీ గాయకులకు ఒక సిలబస్‌ బుక్‌, సినీ సంగీతానికి నడిచే విశ్వవిద్యాలయం అంటే అతిశయోక్తి కాదు. సినిమా పాటల్ని విని ఆయనను అభిమానించిన వారి కంటే ‘పాడుతా తీయగా’ కార్యక్రమాల్లో ఆయన ప్రవర్తనకు, సంస్కారానికీ ముగ్ధులై అభిమానులైన వారి సంఖ్యే ఎక్కువ. పాతికేళ్ల పాటు నిర్విరామంగా నడిచిన ఆ కార్యక్రమం ద్వారా ఆయనెంతో మంది గాయనీ గాయకులకు శిక్షణనిచ్చి, మెలకువలను నేర్పి చిత్ర పరిశ్రమలో స్థిరపడేలా చేశారు. 


‘ప్రమాదోధీమతామపి’ అన్నట్టు ఒక ‘ఎపిసోడ్‌’లో తన నోటివెంట సమాచారంలో ఏ పొరపాటు దొర్లినా తర్వాతి వారాల్లో తప్పక దానిని సరిదిద్ది చెప్పేవారు. చాలా మంది తనను ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి.. ‘నన్ను అనుసరించి ఆ తప్పు మీరు చేయకండి’ అని చెప్పేవారు. ఉదాహరణకు.. ‘బ్రోచేవారెవరురా..’ పాటను ‘ప్రోచేవారెవరురా..’ అని పాడాలి. ఆ విషయాన్ని ఆయనే చెప్పి సరిచేసుకున్నారు. అదే పాటలో.. ‘భాసురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు’ అనే పాదం ఉంటుంది. వాస్తవానికి అక్కడ.. ‘ఆతురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు’ అని ఉండాలి. సినిమాలో ‘భాసురముగ’ అని వచ్చింది. ఆ విషయాన్ని కూడా బాలు ఒక సందర్భంలో చెప్పి.. ‘ఈ రెండూ నేను తప్పుగా పాడాను. మీరెవరూ అలా పాడొద్దు’ అని క్షమాపణ అడిగారు. మరో సందర్భంలో ‘శోక రసం’ అనే పదప్రయోగం చేశారు. నవరసాల్లో శోక రసం లేదని ఎవరో చెప్తే.. ఆ విషయాన్ని మళ్లీ తన కార్యక్రమంలో అందరి ముందూ చెప్పారు. అలాగే, రచయితలకు దక్కాల్సిన గౌరవం దక్కకపోతే బాలు ఊరుకునేవారు కాదు. ఉదాహరణకు.. ‘ముత్యాల ముగ్గు’ సినిమాలో ‘ఏదో ఏదో అన్నది.. ఈ మసక వెలుతురు’ అనే పాట సి.నారాయణ రెడ్డి రాసినట్టు ఒక కార్యక్రమంలో వేశారు. కానీ ఆ పాట రాసింది ఆరుద్ర. ఈ విషయాన్ని ఆ తర్వాత గమనించిన బాలు.. తరువాతి ఎపిసోడ్‌లో ప్రస్తావించి, ఆ పాట రాసింది ఆరుద్ర అని చెప్పారు.


బాలు అయిదు దశాబ్దాలకు పైగా సినిమా పాటకు చిత్తశుద్ధితో అంకితభావంతో ‘రూపురేఖలు దిద్దిన మహా శిల్పి’. సినిమా పాటను చిన్న చూపు చూడ్డం తగదని, అది కూడా సాహిత్య ప్రక్రియేనని నమ్మి.. దానికి గౌరవాన్ని తెచ్చిన గానగంధర్వుడు. తెలుగు సినిమా పాట, సాహిత్యానికి సంబంధించిన చరిత్ర అంతా నిక్షిప్తం కావాలని.. ఆ గొప్పవాళ్లందరికీ తగిన గౌరవం దక్కాలని తపించేవారు. ఆ ప్రయత్నం చేసినవారికి అన్ని విధాలా అండగా నిలిచేవారు. ఉదాహరణకు సీఎస్‌ గోపాల కృష్ణ అనే ఆయన వద్ద ఘంటసాలకు సంబంధించిన విస్తృత సమాచారం ఉందని తెలుసుకుని, ఘంటసాలపై పుస్తకం రాసేదాకా బాలు ఆయన వెంటపడ్డారు. నేను రాసిన ‘తెలుగు సినిమా పాట చరిత్ర’, ‘తెలుగు సినీ గేయ కవుల చరిత్ర’ పుస్తకాలను స్పాన్సర్‌ చేసి, ఆయనే పబ్లిష్‌ చేయించారు. ఆ పుస్తకాలు రాయడానికి అవసరమైన చరిత్రను సేకరించడానికి ఎంతగానో సహకరించారు. అలాగే.. ‘తెలుగు సినిమాల్లో డబ్బింగ్‌ పాటలు’ పుస్తకం రాస్తుంటే ఆయా పాటలకు తమిళ మూలంలో ఏం రాశారు, కన్నడంలో ఎలా రాశారు? వాటి అర్థాలేంటి.. వాటిని ఇక్కడ తెలుగులో ఎలా మార్చారు.. ఇలాంటి అంశాలపై గంటల తరబడి కూర్చుని విస్తృతమైన సమాచారం ఇచ్చారు. పాటపై ఆయనకున్న ప్రేమకు నిదర్శనం అది. జీవితాన్ని, పాటను, భాషను ఎంతగానో ప్రేమించిన అమర గాయకుడు బాలు ఆత్మశాంతికి.. సినిమా పాట పవిత్రతను, ప్రయోజనాన్ని కాపాడ్డమే మనం ఇవ్వగల ఘనమైన నివాళి!

డా. పైడిపాల 9989106162