Abn logo
May 15 2020 @ 00:43AM

ఆధునిక చిత్రకళా జనకుడు

ఆయన పేరు వినివుండలేదంటే అది తన అజ్ఞానాన్ని అచ్చుకొనడం, ఆయన కళను హర్షించలేనంటే అది తన అరసికత్వాన్ని చాటుకొనడం-ఆధునిక ప్రపంచంలో ఇట్టి ప్రతిపత్తిని గడించుకున్నవాడు నిన్న ఫ్రాన్సులో కన్నుమూసిన పాబ్లో పికాసో. ఒక దశాబ్దం, రెండు దశాబ్దాల పాటు కాదు, అర్ధ శతాబ్దికి పైగా ఆధునిక చిత్రకారులలో ఆయనే ప్రప్రథముడు! ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో ఆధునిక చిత్రకళారీతులకు ఆయనే జనకుడు! 


ఆయన సృష్టించిన ఈ వినూత్న, విలక్షణ రీతులను వికారమైనవిగా, విడ్డూరమైనవిగా విమర్శించినవారు లేకపోలేదు, కళను ఆయన వక్రమార్గాలను పట్టించినట్టు విరుచుకుపడినవారూ లేక పోలేదు. కాని, ఎంతటి తీవ్ర విమర్శకులైనా పికాసో సృజనాత్మక శక్తిని, దాని వైవిధ్యాన్ని, దాని ప్రాగల్భ్యాన్ని గుర్తించక తప్పలేదు. దాన్ని పోల్చవలసింది వర్షాకాలంలో ఒక్కొక్కప్పుడు గట్టులను తెంచుకొని, నురుగులు కక్కుతూ, సుడులు తిరుగుతూ, పరవళ్ళు తొక్కుతూ, చెట్టు చేమలను కూకటివేళ్ళతో పెకలిస్తూ మిట్టలను పల్లాలుగా, పల్లాలను మిట్టలుగా మార్చుతూ, ఉగ్ర నరసింహమూర్తిని గుర్తుకు తెచ్చే నిర్ఘరంతో!


కళాస్రష్టగా తన జీవితంలో ఏ రెండు దశాబ్దాలలోను ఒకే రీతిని పికాసో అనుసరించలేదు. ఎప్పటికప్పుడు ఏదో కొత్త రీతిలో ఆయన కొత్త సృష్టి చేస్తూ పోయాడు. ఈ రీతులలో అతి నవ్యమైనది, అతి ముఖ్యమైన క్యూబిస్టు రీతి. ఒక మిత్రునికి లేక రాస్తూ సుప్రసిద్ధ ఫ్రెంచి చిత్రకారుడు సేజాన్ ప్రకృతిలోని ప్రతిదాన్ని స్ఫియర్స్ కింద, కోన్స్ కింద, సిలిండర్స్ కింద మార్చవచ్చునన్నాడు. ఈ సూక్తి ప్రేరణతోనే కావచ్చు పికాసో క్యూబిస్టు కళారీతిని సృష్టించాడు. ఐతే, క్యూబిజమైనా, ఆయన సృజనాత్మక శక్తికి సీమాంతం కాలేదు. అటు తరువాత సర్రియలిజం మొదలైన కొత్తకొత్త కళారీతులకు అది సాగిపోయింది! కొత్త కొత్త దిగంతాలను తాకింది. 


రూపంలో నైరూప్యాన్ని చూడ్డం పికాసో ప్రత్యేకత; నైరూప్యంలో రూపాన్ని చూడ్డం ఆయన వైశిష్ట్యం. అదే విధంగా ఆకృతిని వికృతిగా వికృతిని ఆకృతిగా మార్చడంలో ఆయన దిట్ట. అర్థాన్ని అయోమయంగా, అయోమయాన్ని అర్థంగా మార్చడంలో సైతం ఆయన ఘటికుడు. ఏ సూత్రానికీ, ఏ నియమానికీ, ఏ సంప్రదాయానికీ లొంగనివాడు కనుకనే పికాసో తనకు తానే సాటి. నిన్న ఫ్రాన్స్‌లో కన్నుమూసింది ఒక వ్యక్తి మాత్రమేఝ కాదు, ఒక అద్భుత శక్తి, ఒక అపూర్వ శకం. 

1979 ఏప్రిల్ 10 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం ‘పికాసో’ నుంచి

పికాసో సృజనాత్మక శక్తిని, దాని వైవిధ్యాన్ని, దాని ప్రాగల్భ్యాన్ని పోల్చవలసింది వర్షాకాలంలో ఒక్కొక్కప్పుడు గట్టులను తెంచుకొని, నురుగులు కక్కుతూ, సుడులు తిరుగుతూ, పరవళ్ళు తొక్కుతూ, చెట్టు చేమలను కూకటివేళ్ళతో పెకలిస్తూ మిట్టలను పల్లాలుగా, పల్లాలను మిట్టలుగా మార్చుతూ, ఉగ్ర నరసింహమూర్తిని గుర్తుకు తెచ్చే నిర్ఘరంతో! కళాస్రష్టగా తన జీవితంలో ఏ రెండు దశాబ్దాలలోను ఒకే రీతిని పికాసో అనుసరించలేదు. ఎప్పటికప్పుడు ఏదో కొత్త రీతిలో ఆయన కొత్త సృష్టి చేస్తూ పోయాడు. ఈ రీతులలో అతి నవ్యమైనది, అతి ముఖ్యమైన క్యూబిస్టు రీతి.

Advertisement
Advertisement
Advertisement