Abn logo
May 12 2020 @ 00:30AM

అనుత్పాదక వ్యయాలే అసలు చేటు

ఉభయ తెలుగు రాష్ట్రాలూ నిధులను ఉద్దేశించిన పథకాలకు వినియోగించడం లేదు. ప్రయోజనకరంగా వాటిని ఖర్చు చేయడం లేదు. ఆఖరుకు రాష్ట్రాల విపత్తు ప్రతిస్పందిత నిధి క్రింద కేటాయింపులను లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులకు ఆహారం, వసతి కల్పించేందుకు ఉపయోగించుకోవచ్చునని కేంద్రం తెలిపినా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు వాటిని వేరే ప్రయోజనాలకు మళ్లించినట్లు సమాచారం అందుతోంది. సంక్షేమ సెస్ క్రింద వసూలు చేసిన మొత్తాన్ని నిర్మాణ కార్మికుల ఖాతాల్లోకి బదిలీ చేయాల్సిందిగా కేంద్రం ఆదేశించినప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఆ శ్రమ జీవులకు తగిన న్యాయం జరిగినట్లు కనపడడం లేదు.


కరోనా మూలంగా తమ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని, కేంద్రం చేతులు ముడుచుకుని కూర్చున్నదని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇటీవల ఆరోపించారు. కేంద్రమే తమను ఆదుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు. మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలో కేంద్ర ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. కానీ కేవలం కరోనా మూలంగానే తమ ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావించడంలో వాస్తవం లేదు.


మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి ఎనలేని ప్రాధాన్యత లభిస్తోంది. 14వ ఆర్థిక సంఘం పన్నుల ఆదాయంలో రాష్ట్రాల వాటాను 32శాతం నుంచి 42శాతానికి పెంచింది. 15వ ఆర్థిక సంఘం అభివృద్ధిని సాధించిన రాష్ట్రాలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. 


రాష్ట్రాలు తమ ఆర్థిక వ్యవహారాలను పకడ్బందీగా నిర్వహిస్తే, తాము పెడుతున్న ప్రతి ఖర్చుకూ ప్రజలకు జవాబుదారీగా నిలిస్తే రాష్ట్రాలు కరోనా నేపథ్యంలో అంతగా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రెవిన్యూ లోటు తీవ్రంగా పెరిగిపోవడానికి, ప్రభుత్వ వ్యయం తారాస్థాయికి చేరుకోవడానికి, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు నెలకొనడానికి కారణం ఆ రాష్ట్రాల ఆర్థిక నిర్వహణ సరిగా లేకపోవడమే. ప్రస్తుతం తెలంగాణ ప్రజలపై రూ.2.30 లక్షల కోట్ల మేరకు అప్పులు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ అప్పులు 31 వేల కోట్లు అదనంగా పెరిగాయని, తెలంగాణలో ప్రతి ఒక్కరిపై రూ.61 వేల మేరకు అప్పు ఉన్నదని ఎంత మందికి తెలుసు? అప్పుల భారం భవిష్యత్‌లో ప్రజల తలకుమించిన భారం కాకుండా చూసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అధ్యయనం చేయలేదని, అటువంటప్పుడు కొత్త అప్పులు చేయడానికి ఆస్కారం ఎలా ఉంటుందని కాగ్ ప్రశ్నించింది.


విచిత్రమేమంటే ఏ ప్రాజెక్టులకోసం తెలంగాణ ప్రభుత్వం మితిమీరిన అప్పులు చేస్తుందో, ఆ ప్రాజెక్టులు లెక్కలు చెప్పలేని స్థితిలో ఉన్నాయి. లెక్కలు ఖరారు చేయని ప్రాజెక్టులకోసం చేసే అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇస్తూ పోతోంది. ఈ గ్యారంటీలు ఆదాయంలో 52 శాతం దాటిపోయాయి. తాము విత్త బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్‌ఆర్‌బిఎం) పరిధిలోనే రుణాలు చేస్తున్నామని కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆర్థిక మంత్రి హరీశ్ రావు అంటున్నారు కాని రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం క్రింద వెల్లడించాల్సిన 10 అంశాల్లో నాలుగు అంశాలను వెల్లడించలేదని కాగ్ స్వయంగా స్పష్టం చేసింది. రిజర్వు బ్యాంకు వద్ద ప్రతి రోజూ నగదు నిల్వ రూ.1.38 కోట్లు చూపాల్సి ఉండగా, తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి 200 రోజులు ఈ నిల్వ చూపలేని దుస్థితిలో ఉన్నది. బడ్జెట్ కేటాయింపుల్లో సగం కంటే ఎక్కువగా, దాదాపు లక్ష కోట్లకు పైగా పింఛన్లు, జీతాలు, వేతనాలు, సబ్సిడీలు, వడ్డీ చెల్లింపులకే సరిపోతోంది. ఆర్భాటంగా ప్రకటించిన రైతు బంధుతో పాటు పింఛన్లు కూడా సరిగా చెల్లించలేని పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. రెవిన్యూ లోటు, పెరుగుతున్న అప్పులు, వడ్డీలు, ఖర్చులు, తాయిలాల మూలంగా తెలంగాణ ఇవాళ దిక్కుతోచని ఆర్థిక సంక్షోభంలో ఉన్నది. దీనికీ, కరోనా రావడానికీ ఏ మాత్రం సంబంధం లేదు.


ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరింత దుర్భరంగా ఉన్నది. రాష్ట్రం దివాళా తీసిన స్థితిలో ఉన్నదని తెలిసి కూడా సంపద సృష్టించే ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోతున్నారు. ఒక అంచనా ప్రకారం ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా రూ.3వేల కోట్ల మేరకు అప్పులు చేస్తూ పోతోంది. రిజర్వు బ్యాంకు సెక్యూరిటీ బాండ్లను వేలం వేయడం ద్వారానే రాష్ట్ర ప్రభుత్వం రూ.25వేల కోట్లకు పైగా రుణాలు చేసింది. ఈ అప్పులతో కొత్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన మౌలిక సదుపాయల కల్పన ఏమైనా చేస్తున్నారా అంటే అదీ లేదు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నీ స్తంభించిపోవడమో, నిధులు లేక నత్త నడకన కొనసాగడమో జరుగుతోంది. తన ఓటు బ్యాంకును పెంచుకునే ఉద్దేశంతో మొత్తం రూ. 2,27,974 కోట్ల బడ్జెట్ లో జగన్మోహన్ రెడ్డి రూ.73వేల కోట్లకు పైగా తాయిలాలను  పంచిపెడుతున్నారు. అనేక కంపెనీలు రాష్ట్రం నుంచి తరలిపోతున్నప్పటికీ, కొత్త పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు వెనుకాడుతున్నప్పటికీ జగన్ కేవలం రాజకీయ ప్రాబల్యం కోసమే ప్రతి చర్యా తీసుకుంటున్నారు.


నిజానికి రెండు రాష్ట్రాల్లో ఎక్కడి నుంచి నిధులు వచ్చినా వాటిని అనుత్పాదక ఖర్చుకే మళ్లిస్తున్న విషయం చాలా రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఆఖరుకు రాష్ట్రాల విపత్తు ప్రతిస్పందిత నిధి (ఎస్‌డిఆర్‌ఎఫ్)ని కూడా పలు రాష్ట్రాలు తమ ఇష్టారాజ్యంగా ఇతర ఖర్చులకు మళ్లిస్తున్నాయి. ఎస్‌డిఆర్‌ఎఫ్ క్రింద కేటాయించిన రూ. 29వేల కోట్లను లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులకు ఆహారం, వసతి కల్పించేందుకు ఉపయోగించుకోవచ్చునని కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. కాని ఈ నిధులను కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మళ్లించినట్లు సమాచారం అందుతోంది. ఆసుపత్రుల్లో ఉపకరణాలకోసం, తెల్ల రేషన్ కార్డు దారులకోసం విడుదల చేసిన నిధుల్ని కూడా ఖర్చు పెట్టడం లేదని అంటున్నారు. భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సెస్ క్రింద వసూలు చేసిన మొత్తాన్ని నిర్మాణ కార్మికుల ఖాతాల్లోకి బదిలీ చేయాల్సిందిగా కేంద్రం ఆదేశాలు జారీ చేసినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ శ్రమ జీవులకు తగిన న్యాయం జరిగినట్లు కనపడడం లేదు.


అభివృద్ధీ, సంక్షేమాలను సమతుల్యం చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన అన్న అంశాలను విస్మరించినట్లు కనపడుతోంది. ఇప్పటికే అప్పుల భారంలో కూరుకుపోయిన ఈ రాష్ట్రాలకు కేంద్రం వివిధ రంగాల క్రింద  విడుదల చేస్తున్న నిధులు అనుత్పాదక వ్యయానికే మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్ఆర్‌బిఎం చట్టాన్ని సడలించి మరిన్ని అప్పులు చేసేందుకు అనుమతిస్తే కేసిఆర్, జగన్ ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించే అవకాశాలు కనపడడం లేదు. బాధ్యత లేని వారు చేసే అప్పులను కేంద్రం ఎందుకు ప్రోత్సహించి గ్యారంటీలు ఇవ్వాలి? ఏ ‘హెలికాప్టర్ మనీ’ని విడుదల చేసినా అది చిల్లర ఖర్చులకే ఉపయోగించుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కరోనా కల్పించిన తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో వృథా ఖర్చును, అనుత్పాదక వ్యయాన్ని మానుకుని నిర్మాణాత్మక కార్యక్రమాలకు, మౌలిక సదుపాయాల కల్పనకు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉన్నది.


కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకోసం డబ్బులు విచ్చలవిడిగా పంపిణీ చేయకుండా ఏ విధంగా అడ్డుకట్టవేయాలో అన్న విషయంపై జాతీయస్థాయిలో చర్చ జరగాల్సి ఉన్నది. కొందరు ముఖ్య మంత్రులు నిర్మాణాత్మక కార్యక్రమాల గురించి మోదీ ప్రభుత్వానికి సూచనలివ్వడం మానేసి తమ రెవిన్యూలోటును భర్తీ చేయాల్సిందిగా మాత్రమే కోరడం సరైంది కాదు. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేసే విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి మోదీ అన్ని వర్గాలతో ప్రజాస్వామిక రీతిలో చర్చిస్తున్నారు. రాష్ట్రాలు బలోపేతం అయితేనే కేంద్రం బలోపేతం అవుతుందని ప్రధానమంత్రికి తెలుసు. రాష్ట్రాలు కూడా ఆ దిశన ఆలోచించి మొత్తం దేశాన్నే బలోపేతం చేసేందుకు ప్రధానికి అండగా నిలవాలి.


వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Advertisement
Advertisement
Advertisement