Abn logo
Sep 26 2021 @ 00:37AM

టర్మ్‌ పాలసీలకు గిరాకీ పెరిగింది

  • వడ్డీ రేట్లు తగ్గడంతో పొదుపు ప్రాధాన్య పాలసీలపైనా ఆసక్తి
  • ఈసారి ప్రీమియం ఆదాయంలో 30% వృద్ధి అంచనా..
  • ఏజియస్‌ ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ విఘ్నేశ్‌ షహానే 


కొవిడ్‌ అనంతరం జీవిత, ఆరోగ్య బీమాపై ప్రజల్లో అవగాహన, ప్రాముఖ్యం గణనీయంగా పెరిగిందని ఏజియస్‌ ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓ విఘ్నేశ్‌ షహానే అంటున్నారు. అనుకోని పరిణామాలు తలెత్తితే ఆర్థికంగా కుటుంబం నిలదొక్కుకోవడం చాలా ముఖ్యమని భావిస్తున్నారని, దీంతో టర్మ్‌ పాలసీలకు గిరాకీ పెరిగిందన్నారు. కొవిడ్‌ తర్వాత బీమా పరిశ్రమలో వచ్చిన మార్పులు, కంపెనీ పనితీరు, భవిష్యత్‌ వ్యూహాలపై ‘ఆంధ్రజ్యోతి’తో ముచ్చటించారు. 

ఆ వివరాలు ఆయన మాటల్లోనే..


జీవిత బీమా పరిశ్రమపై కొవిడ్‌ రెండో దశ ప్రభావం 

క్లెయిమ్‌లపరంగా జీవిత బీమా పరిశ్రమపై చాలా ప్రతికూల ప్రభావం ఉంది. ఏజియస్‌ ఫెడరల్‌ లైఫ్‌నే తీసుకుంటే.. ఈ ఏడాది మే నుంచి మా వద్ద క్లెయిమ్‌లు రెండున్నర రెట్లు పెరిగాయి. అంతకు ముందు బాగున్నప్పటికీ.. కొవిడ్‌  అనంతరం ముఖ్యంగా రెండో దశ తర్వాత పరిశ్రమకు కొద్దిగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. పెరుగుతున్న క్లెయిమ్‌లు సాల్వెన్సీ మార్జిన్లు, లాభాలపై ప్రభావం చూపుతున్నాయి. భవిష్యత్తులో కొవిడ్‌ నియంత్రణపై పరిశ్రమ పనితీరు ఆధారపడి ఉంటుంది. 


టర్మ్‌ పాలసీల వంటి ప్యూర్‌ ప్రొటెక్షన్‌ పాలసీలకు గిరాకీ 

జీవితంలో ఎదురయ్యే ఒడిదొడుకులను అధిగమించడానికి కుటుంబ సభ్యులకు ఆర్థిక  స్థిరత్వం అవసరమన్న అవగాహన వినియోగదారుల్లో పెరుగుతోంది. దీంతో గత కొన్నేళ్లుగా ప్యూర్‌ ప్రొటెక్షన్‌, ఆరోగ్య బీమా పాలసీలకు గిరాకీ పెరుగుతోంది. కొవిడ్‌ అనంతరం అది మరింత పుంజుకుంది. వడ్డీ రేట్లు తగ్గుతున్నందున నాన్‌ పార్టిసిపేటరీ పాలసీలైన గ్యారెంటెడ్‌ పాలసీలకు, పొదుపు ప్రధాన పాలసీలకు కూడా ఆదరణ పెరుగుతోంది. గత ఏడాదిన్నర కాలంలో స్టాక్‌ మార్కెట్‌ కొత్త రికార్డులు సృష్టిస్తున్నందున యూలిప్‌ పాలసీలపై కూడా ఆసక్తి చూపుతున్నారు. రెన్యూవల్స్‌ కూడా చేస్తున్నారు.


మూడో దశ వస్తే దాని ప్రభావాన్ని అధిగమిస్తాం  

మూడో దశ వస్తే.. కంపెనీకి ఎదురయ్యే రిస్క్‌ను అధిగమించడానికి ఎప్పటికప్పుడు విశ్లేషణ చేస్తున్నాం. పటిష్ఠమైన వ్యూహం తో ముందుకు వెళతాం. ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా మా పాలసీల వ్యూహం ఉంటుంది. పాలసీల పంపిణీ వ్యవస్థలో ఏజెంట్లు, డిజిటల్‌ వంటి అన్ని మార్గాలను విస్తరిస్తు న్నాం. ప్రస్తుతం 64 శాఖలు, 12 వేల మంది ఏజెంట్లు ఉన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో డిజిటలైజేషన్‌పై మరింత దృష్టి పెట్టనున్నాం. బ్యాంకష్యూరెన్స్‌లో భాగంగా 1-2 బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఎన్‌బీఎ్‌ఫసీలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నాం.


బీమా రంగంలో డిజిటలీకరణపై కొవిడ్‌ ప్రభావం

కొవిడ్‌ జీవిత బీమా రంగంలో డిజిటలీకరణ వేగాన్ని పెంచిం ది. జీవిత బీమా రంగంలో పాలసీల కొనుగోలు, సర్వీసింగ్‌, రెన్యూవల్స్‌, క్లెయిమ్‌లు ఉంటాయి. ఈ నాలుగు టచ్‌ పాయింట్లను పరిశ్రమ డిజిటలైజ్‌ చేసింది. కేవైసీ, ఆధార్‌ వంటి పత్రాలన్నింటినీ డిజిటల్‌ రూపంలోనే పొందాం. ఐఆర్‌డీఏఐ కూడా కొవిడ్‌ సమయంలో సాధారణ సంతకం తప్పని సరికాదని వెసులుబాటు కల్పించింది. క్లెయిమ్‌లు త్వరగా ప్రాసెస్‌ అవడానికి కూడా నియంత్రణ సంస్థ చర్యలు తీసుకుంది. అవసరమైన పత్రాలను అప్‌లోడ్‌ చేస్తే క్లెయిమ్‌లను డిజిటల్‌ ప్రాసెసింగ్‌ చేశాం. 


అంచనాలకు తగ్గట్టుగానే ఏజియస్‌ ఫెడరల్‌ లైఫ్‌ ఆదాయం

గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం ఆదాయంలో 30-35 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. టర్మ్‌ పాలసీలకు మేం ఇంత వరకు ప్రీమియంలను పెంచలేదు. రీ ఇన్సూరర్లు రేట్లను పెంచాలని భావిస్తున్నారు. రీ ఇన్సూరెన్స్‌ కంపెనీలు రేట్లను పెంచితే.. మేం కూడా టర్మ్‌ పాలసీల రేట్లను పెంచుతాం.