Abn logo
Sep 21 2021 @ 23:59PM

సీతంపేటలో ఉద్రిక్తత!

పొరజా పైడి జేఏసీ సభ్యులతో చర్చిస్తున్న పీవో శ్రీధర్‌




గిరిజనేతరుల ఇళ్ల తొలగింపునకు సమాయత్తం

యంత్రాలతో వచ్చిన అధికారులు

అభ్యంతరం వ్యక్తం చేసిన పొరజా పైడి జేఏసీ నాయకులు

నేటి సాయంత్రం వరకూ అవకాశమిచ్చి వెనుదిరిగిన వైనం

సీతంపేట, సెప్టెంబరు 21: సీతంపేటలో మంగళవారం సాయంత్రం ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీస్‌ బందోబస్తు నడుమ ఇళ్ల తొలగింపునకు అధికారులు సమాయత్తం కావడంతో బాధితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు బుధవారం సాయంత్రం వరకూ వారికి అవకాశమిచ్చారు. స్వచ్ఛందంగా తొలగించకుంటే తామే యంత్రాలతో తొలగించాల్సి ఉంటుందని చెప్పి వెనుదిరిగారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సీతంపేటలో గిరిజనేతరులు ఉండకూడదని ఇటీవల కోర్టు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనిని అమలుచేసే బాధ్యతను ప్రభుత్వం ఐటీడీఏ పీవో శ్రీధర్‌కు అప్పగించింది. కానీ గిరిజనేతరులుగా పేర్కొంటున్న 29 మంది నిరుపేదలు ఉన్నపళంగా ఖాళీ చేయమంటే తాము ఎక్కడికి వెళతామని  ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యామ్నాయంగా ఇళ్లు కానీ, ఇళ్ల స్థలాలు కానీ కేటాయిస్తే వెళ్లిపోతామని చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం పీవో ఆధ్వర్యంలో అధికారులు రంగంలోకి దిగారు. 29 మంది గిరిజనేతరుల్లో ఒకరైన గంటా మోహనరావు ను ఇల్లు ఖాళీ చేయాలని అధికారులు కోరారు. దానిపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం ముదిరింది. తాము కూడా గిరిజనులమేనని..ఇందుకు సంబంధించి హైకోర్టు తీర్పు..ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్‌ కూడా ఉందని పొరజా పైడి జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. అటువంటి న్యాయమైన అంశాలు ఉంటే పరిశీలిస్తామని పీవో వారికి హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి ఇళ్లు ఖాళీ చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. కొంత మంది బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండడంతో తొలగింపు ప్రక్రియకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో గొర్లె నాగరాజు, పసుపురెడ్డి, విజయ్‌, పసుపురెడ్డి ధర్మారావు, నిమ్మక రమణమ్మను పొలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాలకొండ డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో పాలకొండ, బత్తిలి, కొత్తూరు, సీతంపేట, దోనుబాయి పోలీస్‌స్టేషన్ల సిబ్బంది పెద్ద ఎత్తున చేరుకున్నారు. ముందస్తు అరెస్ట్‌లతో బాధిత కుటుంబాలు కన్నీరుమున్నీరయ్యాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం సాయంత్రం వరకూ ఇళ్ల తొలగింపునకు అధికారులు అవకాశమిచ్చారు. గిరిజనేతరుల పక్షాన నిలుస్తున్న సీతంపేట సర్పంచ్‌ కళావతిపై చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ ఆదివాసీ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి బిడ్డిక ఉమామహేశ్వరరావు డిమాండ్‌ చేశారు.