Abn logo
May 22 2020 @ 08:51AM

లంకలో తెలు‘గోడు’.. టూరిస్టులుగా వెళ్లి లాక్‌డౌన్‌తో అవస్థలు

కొలంబోలో చిక్కుకున్న వందలాది మంది తెలుగువారు

‘ఆంధ్రజ్యోతి’తో వేదన పంచుకున్న వైనం

(రాయలసీమ ప్రత్యేక ప్రతినిధి, తిరుపతి-ఆంధ్రజ్యోతి): దేశదేశాల నుంచీ విమానాలు వస్తున్నాయి. లాక్‌డౌన్‌తో రెండున్నర నెలలుగా విదేశాల్లో ఇరుక్కుపోయిన తెలుగువారు వెనక్కి వస్తున్నారు. అయితే, అమెరికా, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, గల్ఫ్‌ దేశాల్లోని భారతీయుల కోసం చేస్తున్న ప్రయత్నం చిన్న దేశాల్లో ఉండిపోయిన వారికోసం చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. శ్రీలంకలో రెండున్నర నెలలకు పైగా ఇరుక్కుపోయిన భారతీయులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. ఈ విషయాన్ని వారు ‘ఆంధ్రజ్యోతి’ దృష్టికి తీసుకొచ్చారు. పర్యాటకులుగా, వివిధ ఉద్యోగ బాధ్యతల్లో శ్రీలంకకు వెళ్లినవారు లాక్‌డౌన్‌ తర్వాత వెనక్కి రాలేకపోయారు. ఉన్న డబ్బులు అయిపోయాయి. కుటుంబాల నుంచి అకౌంట్‌లో వేయించుకుంటున్నా సరిపోవడం లేదు. కొలంబొలో విమానాశ్రయానికి సమీప ప్రాంతాల్లో చిన్న చిన్న హోటళ్లలో వీరంతా ఉన్నారు. వెయ్యి నుంచి 1200 మంది భారతీయులు ఉండగా వీరిలో తెలుగువాళ్లు కూడా వందల్లో ఉన్నారు. కొలంబోలోని భారత ఎంబసీని సంప్రదిస్తున్నా తమకు సరైన సాయం అందడం లేదని వాపోతున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రం మీద వత్తిడి తెచ్చి తమకు లంక నుంచి విముక్తి కల్పించాలని వేడుకుంటున్నారు. వందే భారత్‌, సేతుసముద్ర పేర్లతో 35 దేశాల నుంచి భారతీయులను వెనక్కి తీసుకువస్తున్న ప్రభుత్వం శ్రీలంక విషయంలో వివక్ష చూపుతోందని ఆవేదన వెలిబుచ్చారు. భారత భూభాగానికి అత్యంత సమీపంగా ఉన్న దేశం శ్రీలంక నుంచి తమను పడవల్లో కూడా తీసుకురావచ్చని, ఆదిశగా ఏర్పాటు చేయాలని మొరపెట్టుకుంటున్నారు. 


తీసుకువెళ్లండి ప్లీజ్‌

మార్చి రెండో వారంలో శ్రీలంకకి పర్యటనకు వచ్చాం. నేనున్న చోట మరో 20 మంది ఆంధ్రావాళ్లు కూడా ఉన్నారు. అందరం ఇరుక్కుపోయాం. ఎవరి నుంచీ ఏ సాయమూ మాకు అందడం లేదు. ఇప్పటికి 1.4 లక్షలు నేను ఖర్చు చేయాల్సి వచ్చింది. దయచేసి మమ్మల్ని భారత దేశానికి తీసుకువెళ్ళండి.. ప్లీజ్‌! -వేణుగోపాల్‌, విశాఖ


మమ్మల్ని కూడా పట్టించుకోండి

నేను మెరైన్‌ ఇంజనీర్‌గా డ్యూటీపై లంకకు వచ్చి ఇరుక్కుపోయాను. వందేభారత్‌, సేతుసముద్ర ప్రాజెక్టుల్లో 35 దేశాలకు విమానాలు పంపుతున్నారు. శ్రీలంకను మాత్రం విస్మరించారు. దయచేసి మమ్మల్ని మా ఊళ్లకి చేర్చండి. -రవికుమార్‌, తిరుపతి


విహారం కోసం వచ్చి..

వేసవి సెలవుల్లో విహారం కోసం శ్రీలంక వచ్చాను. లాక్‌డౌన్‌తో వెనక్కి రాలేకపోయాను. రోజుకి కనీసం 50 డాలర్లు ఖర్చవుతోంది. నా దగ్గర ఇక డబ్బుల్లేవు. విశాఖలో గ్యాస్‌ లీక్‌ జరిగిన ప్రాంతంలోనే నా కుటుంబం ఉంది. ఎలా ఉన్నారో అని ఆందోళనగా ఉంది. నా గురించి వారూ ఆందోళనతో ఉన్నారు. నా ఉద్యోగం కూడా ఊగిసలాట స్థితిలో ఉంది. దయచేసి నన్ను వెనక్కి తీసుకువెళ్ళండి. -దీపక్‌, విశాఖ


దయచేసి.. ఆదుకోండి!

మూడునెలలుగా కొలొంబోలో ఇరుక్కుపోయి ఉన్నాం. మానసికంగా, శారీరకంగా బాగా కుంగిపోయాం. చేతులు జోడించి వేడుకుంటున్నాను. దయచేసి మమ్మల్ని భారత దేశానికి తీసుకువెళ్ళండి.  -శ్రీనివాసరావు, విశాఖ

Advertisement
Advertisement
Advertisement