Abn logo
Sep 28 2021 @ 00:25AM

తెలుగు పద్యంలో మానవతా సౌరభం

గబ్బిలాన్ని అపశకున పక్షిగా హైందవ సమాజం పరిగణిస్తుంది. ఎందుకంటే అది వెలుగు చూడలేదు. పంచముల జీవితాలలో వెలుగులేదు. వారి చీకటి బతుకులకు అది ఒక సంకేతం. వారి దైన్యానికి, దయనీయతకు గబ్బిలం తిరుగులేని ప్రతీక. జాషువా పుట్టిన నాటికి భారతదేశం బానిసత్వంలో మగ్గుతోంది. దళితులపై జరుగుతున్న వర్ణ వివక్ష, అన్యాయాలను ఎలుగెత్తి చాటడం కోసం జాషువా ‘గబ్బిలం’ రాశారు.


ఖండకావ్య రచనలో అగ్రగణ్యుడు జాషువా. ఫిరదౌసి, గబ్బిలం, ముంతాజ్‌మహల్‌, నేతాజీ ఆయన అజరామర కావ్యాలు. ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిన కావ్యం ‘గబ్బిలం’. దీని మొదటి భాగం 1941లో, రెండవ భాగం 1946లో వెలుగు చూశాయి. ‘గబ్బిలం’ ఒకవిధంగా ఆయన జీవితానుభవాల చరిత్ర. గుర్రం వీరయ్య, లింగమ్మ దంపతులకు 1895 సెప్టెంబరు 28న వినుకొండలో జాషువా జన్మించారు. ప్రాథమికోపాధ్యాయునిగా జీవితం ప్రారంభించిన జాషువా నాటి మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా ఉంటూ ఊరూరా తిరిగి వీరేశలింగం, చిలకమర్తి వంటి మహామహుల ఆశీర్వాదాలు పొంది కావ్యరచనలు చేసి కావ్య జగత్తులో స్థిరపడ్డారు. ద్వితీయ ప్రపంచసంగ్రామ కాలంలో యుద్ధప్రచారకునిగా, స్వాతంత్ర్యానంతరం 1956 నుంచి ౧960 వరకు ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో తెలుగు ప్రొడ్యూసర్‌గా ఆయన ఉద్యోగాన్ని నిర్వహించారు.


దళితతత్వంతో నిండిన తొలి దళితకావ్యం ‘గబ్బిలం’. ఇది ఒక అపూర్వదృశ్య కావ్యం. ఒక కులంలో పుట్టిన వ్యక్తి ఆ కులం పరిధి దాటడం చాలా కష్టం. కానీ తన అంటరానితనం, అస్పృశ్యత పునాదులపై నిలబడి విశ్వమానవ వ్యక్తిత్వాన్ని ప్రదర్శించిన మహాకవి జాషువా. ఆయన బాల్యం నుంచే కులవివక్షకు గురయ్యాడు. చిన్నతనంలో ఒకరోజు వినుకొండ వీధిలో వెళుతుండగా అగ్రవర్ణానికి చెందిన ఒక బాలుడు ఆ వీధినే పోతూ ‘నన్ను తాకకు, దూరం పాటించు’ అంటూ చీదరించుకున్న సంఘటన ఆయన్ని జీవితాంతం వెంటాడింది. అలాగే మరొక సంఘటన ఆయన మదిని మరింత కలచివేసింది. వినుకొండలో జరిగిన ఒక సభలో ఆశుకవితా నైపుణ్యంతో ‘కొప్పరపు సుబ్బారావు’ ప్రజలను ఉర్రూతలూగించాడు. ఆ సభలో ఉన్న జాషువా ఆయనను అభినందిస్తూ అప్పటికప్పుడు ఏవో కొన్ని పద్యాలు రాశాడు. ఆ పద్యాలను సభాస్థలి దగ్గర ఉన్న సుబ్బారావుకు అందించారు. అవి చదివిన సుబ్బారావు బాలకవి జాషువాను అభినందించాడు. ఆ సభలో జరిగిన ఈ సంఘటనకు, నిమ్నకులస్థుడు ఇక్కడికి ఎలా వచ్చాడని గుసగుసలు మొదలై అక్కడి నుంచి అందరూ వెళ్లిపోయారు.


ఆ రోజంతా తిండి తినకుండా తనలో తాను కుమిలిపోయాడు. ఎన్నో హృదయవిదారక సంఘటనలు జాషువా జీవితంలో జరిగాయి. ఆయన అటు క్రైస్తవులతో వెలివేయబడ్డాడు. ఇటు హిందువుల తిరస్కారానికి గురైనాడు. జాషువా కవిగా లబ్ధప్రతిష్ఠుడైన తరువాత కూడా సభల్లో సన్మానాల్లో ఆయన గురించి ప్రసంగించే వ్యక్తులు ‘పంచమజాతిలో పుట్టి ఇంత గొప్పకవిగా రాణించినాడు’ అని అంటుంటే, ఆయన గుండెలు అవిసిపోయేవి. పంచములలో తెలివితేటలు ఉండకూడదన్న వారి దురహంకారము చూచి ఆయన చలించిపోయేవాడు. తనను సాటి మనిషిగా, జాషువాగా ఈ సమాజం ఎన్నడూ గుర్తించదని ఎంతో మధనపడేవాడు. ఈ వివక్షలన్నిటినీ ఆయన ఆత్మవిశ్వాసంతో ఎదిరించాడు. మొక్కవోని ధైర్యంతో తనను ఈసడించిన సమాజంలో ఎదురోడి కవిత్వ ప్రతిభతో విశ్వమానవ సౌబ్రాతృత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పాడు.


గబ్బిలం కావ్యం రెండు భాగాలు. ప్రథమభాగంలో అరుంధతీసుతుడు, తన బాధను విన్నవించుకుంటాడు. సామాజికంగా అనుభవాలలోని వివక్షను, గబ్బిలం ద్వారా శివునికి చేరవేయటానికి మార్గనిర్దేశం చేస్తాడు. రెండవ భాగంలో కొన్నాళ్లకు గబ్బిలం మరలా కనిపిస్తుంది. వెళ్లిన పని పండేనని చెప్తుంది. మరల అరుంధతీసుతుడు తన గోడును విన్నవించుకుంటాడు. భారతజాతి అనైక్యత కులమత బేధాలు, వైరుధ్యాలు, మూఢాచారాలు, దేశాభిమానం రెండవ భాగంలోని ప్రధానాంశాలు. ఈ రెండు భాగాలలో జాషువా నిర్భయంగా, బలంగా, సూటిగా కవితను చెప్పాడు. ఆ విధంగా తెలుగు దళితకవిత్వానికి స్పష్టమైన పథనిర్దేశం చేశాడు.


గబ్బిలాన్ని అపశకున పక్షిగా హైందవ సమాజం పరిగణిస్తుంది. ఎందుకంటే అది వెలుగు చూడలేదు. పంచముల జీవితాలలో వెలుగు లేదు. వారి చీకటి బతుకుల కది ఒక సంకేతం. వారి దైన్యానికి, దయనీయతకు గబ్బిలం తిరుగులేని ప్రతీక. జాషువా పుట్టిన నాటికి (1895) భారతదేశం బానిసత్వంలో మగ్గుతోంది. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదం బలంగా పుంజుకుంటోంది. సమాజంలో కులవివక్ష, అస్పృశ్యత, అంటరానితనం, విశృంఖలంగా వ్యాపించి ఉన్నాయి. దళితులపై జరుగుతున్న వర్ణవివక్ష, అన్యాయాలను ఎలుగెత్తి చాటడం కోసం జాషువా గబ్బిలం రాశారు. ఈ కావ్యం ‘కాళిదాసు’ మేఘసందేశం తరహాలో సాగుతుంది. అయితే గబ్బిలం కావ్యంలో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు, ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు.


సమాజంలో తనలాంటి పేదవాడికి గొప్ప గొప్ప సందేశహారులు ఎవరుంటారు. అంచేత తన గోడును కైలాసాన ఉన్న పరమేశ్వరునికి గబ్బిలంతో సందేశాన్ని చేరవేయమని చెప్తాడు. గబ్బిలాన్నే సందేశ దూతగా ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే, మహాపురుషులు జన్మించిన ఈ భారతావని కర్మభూమిలో దళితులు ఎలా అయితే వివక్షతతో ఊరికి, ఊరి మనుషులకు దూరంగా ఉంటున్నారో, అదే విధంగా గబ్బిలాల్ని కూడా వివక్షతతో చూస్తున్నారు. పంచముల్ని దేవాలయం గర్భగుడిలోకి వెళ్లనివ్వకుండా అడ్డుకోగలరేమోగానీ గబ్బిలాన్ని మాత్రం అడ్డుకోలేరు. అది గర్భగుడిలోకి నిరభ్యంతరంగా వెళ్లగలదు. అలాంటి ఆ గబ్బిలానికి తప్ప తమ గోడు ఎవరికీ అర్థం కాదని తన సందేశదూతగా దాన్ని ఎంచుకున్నారు. ఈ కావ్యంలో వర్ణన మనసున్న ఏ మనిషినైనా తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. ఈ కావ్యం ఆనాటి దళితుల జీవన స్థితిగతులకు అద్దం పడుతుంది. ఈ అందులో కనిపించే దృశ్యాలన్నీ నాటి చారిత్రక, సామాజిక స్ధితిగతుల్ని, ప్రతిబింబించేవే. 


ఇంతటి గొప్ప కావ్యాలు రాస్తూ కూడా జాషువా రెండు రకాలుగా వివక్షకు గురయ్యారు. సమాజంలో ఒక పౌరునిగా వివక్షను అనుభవించారు. ఒక కవిగా ఆయన ఖ్యాతిని కానీ, ఆయన గొప్పతనాన్ని కానీ గుర్తించడానికి ఇష్టపడని సమకాలీన కవజ్ఞులు, పండితులు కూడా ఆయన్ని దరిచేరనివ్వలేదు. పేదరికంలో పుట్టి పేదల ఆకలిబాధలను చవిచూశారు. కనుకనే కళ్లకు కట్టినట్లుగా, కంటతడి పెట్టించే విధంగా రాయగలిగారు. అందుకే సాహితీ సంస్థలు ఆయనకు వేయికి పైగా సన్మానాలు చేశాయి. జాషువా ఎన్నో బిరుదులు, పురస్కారాలు అందుకున్నారు. గుంటూరు పట్టణం స్వేచ్ఛా పౌరసత్వమిచ్చి గౌరవించింది. క్రీస్తుచరిత్ర కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. గండపెండేరం ధరించి కనకాభిషేకాలు పొంది గజారోహణం చేసి పగటి దివిటీల పల్లకీలో ఊరేగింపు లాంటి వైభవాన్ని చవిచూశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆయనను శాసనమండలి సభ్యునిగా నియమించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదు ప్రదానం చేసింది. కేంద్రప్రభుత్వం ‘పద్మభూషణ్‌’ ఇచ్చి సత్కరించింది. ముప్పదికి పైగా రచనలు చేసి 1971 జూలై 24న కీర్తిశేషులయ్యారు.


జాషువా కవితా పటిమను, ధీరోదాత్తతను మనందరం ఆదర్శంగా తీసుకోవాలి. ‘రాజు జీవించు రాతి విగ్రహములందు, సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’’ అన్న జాషువా మాటలు అక్షరసత్యమే కానీ జాషువా ప్రజల నాలుకల పైనే కాదు హృదిలో కూడా పదిలమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.


-రేగుళ్ల మల్లిఖార్జునరావు సంచాలకులు, ఏపీ భాషా సాంస్కృతిక శాఖ

(నేడు గుర్రం జాషువా 126వ జయంతి)