Abn logo
Sep 26 2020 @ 05:12AM

దేశానికి తెలంగాణ రైతు ఆదర్శం

రైతుల మేలు కోసమే కొత్త రెవెన్యూ చట్టం

మంత్రులు నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్‌


అచ్చంపేట, సెప్టెంబరు 25 : దేశానికి తెలంగాణ రైతు ఆదర్శంగా నిలువనున్నాడని, ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట పట్టణంలో శుక్రవారం ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రాక్టర్ల ర్యాలీకి మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరై, ర్యాలీ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్న రైతు సంక్షేమ పథకాలు, ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా నిలుస్తున్నాయని చెప్పారు.


సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం మూడేళ్ల పాటు సమీక్షించి, నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చారని అన్నారు. కృష్ణానదిలో తెలంగాణ వాటా చెప్పాలని ఊరూరా టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జల ఉద్యమం చేస్తామని వెల్లడించారు. రైతులు, ప్రజల ప్రయోజనాల కోసం రాష్ట్రం చట్టాలు చేస్తుంటే, రైతులకు అన్యాయం చేసే వ్యవసాయ బిల్లులను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వారు ఆరోపించారు. కార్యాక్రమంలో రైతు సమన్వయ సమితి మనోహర్‌, మార్కెట్‌ చైర్మన్‌ సీఎం రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ తులసీరాం పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement