Abn logo
Mar 26 2020 @ 02:23AM

టెక్నాలజీపై ఉత్త మాటలే

  • హోం క్వారంటైన్ల గుర్తింపునకు ఇంకా పాత పద్ధతులేనా?
  • చైనా, హాంకాంగ్‌లో జీపీఎస్‌ ట్రాకర్లు
  • అందుబాటులో అత్యాధునిక టెక్నాలజీ 
  • అయినా ప్రేక్షకపాత్ర పోషిస్తున్న ఐటీ శాఖ 


హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణలో కరోనాను నియంత్రించాలంటే విదేశాల నుంచి వచ్చి ‘హోం క్వారంటైన్‌’లో ఉంటున్న వారు బయటికి రాకుండా చూడటం కీలకం. వీరిపై నిఘా పెట్టేందుకు పోలీసులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల సిబ్బందితో మొత్తం 5,274 నిఘా బృందాలను ఏర్పాటు చేశాం. హోం క్వారంటైన్‌లో ఉన్నవారు బయటికి వెళ్లకుండా నిఘా బృందాలు రోజూ వారిని గమనిస్తూ ఉంటాయి’’.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత ఐదు రోజుల్లో మూడుసార్లు నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పిన మాటలివి. ఈ మాటలు ప్రజారోగ్యంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని స్పష్టం చేస్తున్నప్పటికీ.. టెక్నాలజీ వినియోగంలో మనం ఎంత వెనకబడి ఉన్నామో తెలుపుతోంది. దేశంలోనే తొలి బ్లాక్‌చైన్‌ డిస్ర్టిక్ట్‌ హైదరాబాద్‌లోనే.. యానిమేషన్‌, గేమింగ్‌, ఏఆర్‌, వీఆర్‌ టెక్నాలజీలో దేశంలో హైదరాబాదే అగ్రస్థానం.. ప్రపంచంలోని టాప్‌-5 ఐటీ కంపెనీలకు స్థావరం మన నగరమే.. ఐటీ ఎగుమతుల్లో దేశంలోనే మొదటి స్థానం మనదే.. కృత్రిమ మేధస్సు (ఏఐ)లో తెలంగాణ నంబర్‌వన్‌ అంటూ గొప్పగా 2020ని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సంవత్సరంగా ప్రకటించారు. ‘పేరు చెప్పండి, చరిత్ర చెప్పేస్తా’, ‘ఆవలిస్తే పేగులు లెక్కిస్తా’ అంటూ గొప్ప ప్రకటనలు చేసే ఐటీ శాఖ ఉన్నతాధికారులు.. కీలక తరుణంలో ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. 


టెక్నాలజీ వినియోగించి ఉంటే.. 

నెల రోజుల్లో కరోనా సోకిన దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి సంఖ్య దాదాపు 77,000. వీరిలో 17,283 మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. వీరి చేతికి స్టాంప్‌ వేసి వారి ఇళ్లకు పంపారు. వీరిలో కొంతమంది తమపై ఎలాంటి నిఘా లేదని భావిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి తిరుగుతున్నారు. పెళ్లిళ్లు, శుభకార్యాలకూ హాజరై ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నారు. కొందరిని రైళ్లల్లో, బస్సుల్లో, వీధుల్లో గుర్తించి ప్రజలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అయితే ప్రజలు గుర్తించని వారు ఇంకా అనేక మంది ఉండవచ్చు. క్వారంటైన్‌ నుంచి తప్పించుకు తిరిగిన వారిపై నిఘా ఉంచడంలో చైనా, హాంకాంగ్‌ అద్భుతమైన విజయం సాధించాయి.


మన రాష్ట్రంలో ‘హోం క్వారంటైన్‌’లో ఉన్న వారి చేతులకు స్టాంపులు వేస్తుండగా.. అక్కడ మాత్రం హోం క్వారంటైన్‌లో ఉన్నవారిపై జీపీఎస్‌ ద్వారా నిఘా ఉంచారు. రిస్ట్‌బ్యాండ్‌, జీపీఎస్‌ ట్రాకర్‌, సర్వైలెన్స్‌ ట్యాగ్‌ల సహకారంతో అక్కడి పోలీసులు వారి ప్రతి కదలికనూ పర్యవేక్షించారు. వారు బయటికి వస్తే కరోనా అనుమానితుడన్న విషయం స్థానికులకు తెలిసేలా ప్రత్యేక మొబైల్‌ యాప్‌లు రూపొందించారు. టెక్నాలజీలో దేశంలోనే నంబర్‌ వన్‌ అని ఊదరగొట్టే మన రాష్ట్రంలో మాత్రం ఐటీ శాఖ కనీసం ఈ దిశగా ఎలాంటి ఆలోచనలు చేయలేదు. కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిపై జీపీఎస్‌ ట్రాకర్‌ ద్వారా నిఘా పెట్టి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. 


ఇంతవరకు వెబ్‌సైటే లేదు.. 

కరోనాపై తాజా పరిస్థితిని, ప్రభుత్వ నిర్ణయాలను ప్రజలకు వెల్లడించేందుకు, ప్రజలకు సహాయకారిగా ఉండేందుకు వివిధ రాష్ట్రాలు ప్రత్యేక మొబైల్‌ యాప్‌లు ప్రారంభించాయి. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారి ప్రాంతాల వివరాలను ‘హైరిస్క్‌ జోన్లు’గా ప్రకటించి యాప్‌ల ద్వారా హెచ్చరిస్తున్నాయి. కానీ తెలంగాణ ఐటీ శాఖ ఇంతవరకు అలాంటి ప్రయత్నమే చేయలేదు. కరోనా కోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ కూడా అభివృద్ధి చేయలేదంటే ఐటీ శాఖ పనితీరు ఎలా ఉందో స్పష్టమవుతోంది.


Advertisement
Advertisement
Advertisement