Advertisement
Advertisement
Abn logo
Advertisement

రిటైర్‌ కానున్న టీచర్ల జాబితా అస్తవ్యస్తం

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 2: జిల్లా విద్యాశాఖ వచ్చే ఏడాది ఉద్యోగ విరమణ చేయనున్న స్కూలు అసిస్టెంట్‌ కేడర్‌ ఉపాధ్యాయుల జాబితా విడుదల చేసింది. జాబితా అస్తవ్యస్తంగా ఉందని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 90 శాతం తప్పులు ఉండడంపై ఏపీటీఎఫ్‌–1938 జిల్లా నాయకులు అభ్యం తరం వ్యక్తం చేశారు. రిటైర్‌ కానున్న ఉపాధ్యాయులు ఆరు నెలలకు ముందుగానే పెన్షన్‌, తదితర ఆర్థిక ప్రయోజనాలకు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా సంబం ధిత ఉపాధ్యాయులను అప్రమత్తం చేస్తూ నోటీసులు ఇస్తుంది. 223 మంది టీచర్ల తో కూడిన జాబితాలో విద్యాశాఖ పేర్కొన్న వివరాలు అస్తవ్యస్తంగా ఉండడంతో ఉపాధ్యాయులు అయోమయానికి గురవుతున్నారని సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.రాంబాబు, జి.కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. జాబితాలో ఉన్న టీచ ర్లు ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాల, మండలం తదితర వివరాలన్నీ తప్పుల తడక అన్నారు. త్వరలో రిటైర్‌ అయ్యే టీచర్లు ఆర్ధిక ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసు కోడానికి అవరోధాలు ఏర్పడతాయని, తక్షణమే సవరించాలని డిమాండ్‌ చేశారు.


నేడు సవరించిన జాబితా


కంప్యూటర్‌ సాంకేతిక సమస్యతో జాబితాలో పొరపాట్లు దొర్లినట్లు గమనించా మని జిల్లా విద్యాశాఖ వివరణ ఇచ్చింది. లోపాలు తమ దృష్టికి వచ్చిన వెంటనే బుధవారమే సవరణ చేపట్టి మొత్తం 225 మంది స్కూల్‌ అసిస్టెంట్లతో కూడిన జాబితాను మళ్ళీ రూపొందించే పని చేపట్టామని అధికారులు వివరించారు. సమగ్ర వివరాలతో జాబితా శుక్రవారం విడుదల చేస్తామని ప్రకటించారు.

Advertisement
Advertisement