ఇంటర్నెట్ డెస్క్: తణుకు వైసీపీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినా అసెంబ్లీలో వైసీపీ సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ సోషల్ మీడియా విమర్శించింది. ఒక పక్క అసెంబ్లీలో కారుమూరిని కలిసిన ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలయ్యిందని.. అయినప్పటికీ వైసీపీ అధినేతతో సహా ఒక్క నేత కూడా మాస్కులు పెట్టుకోరని ట్విట్టర్ వేదికగా పేర్కొంది. కరోనా కారియర్లుగా, సూపర్ స్ప్రెడర్లుగా బాధ్యత లేకుండా తిరిగేస్తుంటారని తెలిపింది. వైసీపీ నేతలకు బాధ్యత లేదని.. పైగా మాస్క్ పెట్టుకునే తెలుగుదేశం నేతలను కరోనాకు భయపడుతున్నారంటూ ఎగతాళి చేస్తారని విమర్శించింది. మాస్కు పెట్టుకోవడం భయం కాదని, సాటి మనిషి క్షేమం పట్ల మనకున్న కనీస బాధ్యత అని ఈ మేధావులకు ఎప్పటికి అర్థం అవుతుందో అంటూ ఎద్దేవా చేసింది.