Abn logo
Aug 7 2020 @ 03:23AM

అన్నీ బోగస్‌ లెక్కలు!

 • కరోనా పరీక్షలపై టీడీపీ సంచలన ఆరోపణ
 • కేంద్ర గణాంకాల ప్రదర్శన
 • తుగ్లక్‌ నిర్ణయాలతో కాలక్షేపం
 • జగన్‌ ప్రభుత్వంపై పట్టాభి ఫైర్‌
 • తప్పుడు లెక్కలతో మోసం
 • ఖాళీ పడకలపైనా తప్పులు.. కేసుల పెరుగుదలలో ఫస్టు
 • జాతీయ సగటు కంటే 2 రెట్లు ఎక్కువ.. రికవరీలేమో తక్కువ
 • మరణాలు, యాక్టివ్‌ కేసుల్లో అందరి కంటే టాప్‌ 
 • మంత్రులు హైదరాబాద్‌ పరుగెడితే సామాన్యులు ఎక్కడికి?
 • జగన్‌ ప్రభుత్వంపై తెలుగుదేశం మండిపాటు

అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): కరోనా పరీక్షలపై రాష్ట్రప్రభుత్వం బోగస్‌ లెక్కలు చెబుతోందని టీడీపీ సంచలన ఆరోపణ చేసింది. కేంద్రం అధికారికంగా విడుదల చేసిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో సర్కారు చెప్పినన్ని పరీక్షలు జరగడం లేదని, ప్రచారం కోసం వాటిని పెంచి చూపిస్తోందని మండిపడింది. ఇందుకు రుజువుగా కేంద్రం విడుదల చేసిన వివరాలను ఆ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం గురువారమిక్కడ విలేకరుల భేటీలో ప్రదర్శించారు. ‘ఈ నెల 4న దేశంలో 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్నెన్ని పరీక్షలు చేశాయో కేంద్రం అధికారికంగా వివరాలు విడుదల చేసింది. దాని ప్రకారం ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ ప్రతి పది లక్షల జనాభాకు 26వేల పరీక్షలు జరిపింది. అంటే ఇప్పటికి 13లక్షల మందికి పరీక్షలు చేసినట్లు లెక్క. కానీ అదే రోజు రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో 21లక్షల పరీక్షలు చేసినట్లు ప్రకటించారు. నిజంగా అన్ని పరీక్షలు చేస్తే వాటిని కేంద్రం ఎందుకు గుర్తించలేదు? కేంద్రం ప్రకటించిన వివరాలకు... రాష్ట్రం చెబుతున్న వాటికి మధ్య 8.5 లక్షల వ్యత్యాసం ఉంది. రాష్ట్రం లెక్కలు బోగస్‌ అని కేంద్రమే నిరూపించింది.


పరీక్షల్లో దేశంలోనే తాము మొదటి స్ధానంలో ఉన్నామని రాష్ట్రం చేసుకొంటున్న ప్రచారం ఒట్టి డొల్ల. పరీక్షలు సరిగా చేయడం లేదు. ఫలితాలు సరిగా ఇవ్వడం లేదు. నమూనాలూ సరిగా తీయడం లేదు. దీనితో అవి చాలాభాగం వృధా అవుతున్నాయి’ అని విమర్శించారు. ఆస్పత్రులు, క్వారంటైన్‌ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పడకల లెక్కలు కూడా తప్పుడు తడకలని ఆరోపించారు. ‘డ్యాష్‌ బోర్డు ప్రకారం.. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో 21వేలు, క్వారంటైన్‌ కేంద్రాల్లో 86వేల పడకలు ఖాళీగా ఉన్నాయి. అదే డ్యాష్‌ బోర్డులో జిల్లాలవారీగా ఖాళీగా ఉన్న పడకల సంఖ్య 3,500. విజయనగరం జిల్లాలో ఒక్క పడక కూడా ఖాళీలేదు. అనంతపురం జిల్లా పేరే అందులో లేదు. మరిపైన చూపిస్తున్న లక్ష ఖాళీ పడకలు ఎటుపోయాయి? ఇదే ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 80వేలు ఉన్నాయి. మరి వారంతా ఎక్కడ చికిత్స తీసుకుంటున్నారు? ఎక్కడ ఉంటున్నారు? బెడ్లు దొరక్క ఆస్పత్రుల ముందు గంటల తరబడి వేచి చూసి బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారని రోజూ వార్తలు వస్తున్నాయి’ అని తెలిపారు.


కరోనా వ్యాప్తిలో టాప్‌

కరోనా వ్యాప్తిలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానానికి వెళ్లిందని, జగన్‌ ప్రభుత్వం వ్యాధి నివారణను గాలికి వదిలివేయడం వల్లే ఈ పరిస్ధితి తలెత్తిందని పట్టాభి ఆరోపించారు. ‘కేసుల రోజువారీ పెరుగుదల రేటు జాతీయ స్ధాయిలో 2.82శాతం ఉంటే.. మన రాష్ట్రంలో 6.11శాతం ఉంది. అంటే రెండు రెట్లు ఎక్కువగా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో అత్యధికంగా కేసులు నమోదైన మహారాష్ట్రలో ఇది కేవలం 1.95శాతమే. కర్ణాటకలో 3.9శాతం, తమిళనాడులో 1.99శాతం, తెలంగాణలో 2.4శాతం పెరుగుదల ఉంది’ అని వివరించారు. గతవారం మనరాష్ట్రంలో 400మంది మరణించారని, ఏపీలో మరణాల శాతం 4.46 ఉంటే జాతీయ సగటు 1.97శాతమే అన్నారు. మరణాల రేటు మహారాష్ట్రలో 1.69 శాతం, తమిళనాడులో 2శాతం ఉందని చెప్పారు. ‘మన రాష్ట్రంలో ప్రతి పది సెకన్లకు ఒక కేసు నమోదవుతోంది. ప్రతి ఇరవై నిమిషాలకో మరణం.. గంటకు ముగ్గురు చనిపోతున్నారు. కరోనా నుంచి బయటపడుతున్న వారి శాతం రాష్ట్రంలో తక్కువగా ఉంది. జాతీయ స్థాయిలో ఇప్పటికే 67శాతం మంది రికవరీ అయితే మన రాష్ట్రంలో 55శాతమే రికవరీ అయ్యారు. అగ్రస్ధానంలో ఉన్న పది రాష్ట్రాల్లో రికవరీలో మన రాష్ట్రం అట్టడగున ఉంది.


బిహార్‌లో కూడా 65శాతం రికవరీ ఉంది. దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 30శాతం ఉంటే మనవద్ద 43ు. దేశసగటు కంటే 13శాతం ఎక్కువన్న మాట. యాక్టివ్‌ కేసులు మహారాష్ట్రలో 31శాతం, ఢిల్లీ 7శాతం, తమిళనాడు 19శాతం, ఉత్తరప్రదేశ్‌ 40శాతం ఉంటే మనం బాగా ఎక్కువలో ఉన్నాం. వైరస్‌ నియంత్రణలో జగన్‌ ప్రభుత్వం విఫలం కావడం వల్లే ఈ పరిస్ధితి’ అని విమర్శించారు. జగన్‌ ప్రభుత్వం కరోనా నియంత్రణను గాలికి వదిలి పిచ్చి తుగ్లక్‌ నిర్ణయాలతో కాలక్షేపం చేస్తోందని పట్టాభి విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికీ మూడు మాస్కులు చొప్పున 17 కోట్ల మాస్కులు పంపిణీ చేస్తామని ఘనంగా ప్రకటించారని, ఇప్పటివరకు ఎందరికి పంచారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మూడు మాస్కులే ఇవ్వలేని ప్రభుత్వం మూడు రాజధానులు కడతామని హడావుడి  చేస్తోందని ఎద్దేవా చేశారు. ‘వెయ్యి అంబులెన్సులు కొన్నామని, ఫోన్‌ చేసిన పావుగంటలో అంబులెన్సు వస్తుందని ప్రకటనలు గుప్పించారు. గంటలు కాదు కదా.. రోజుల తరబడి ఎదురుచూసినా అవి రావడం లేదు. విజయసాయిరెడ్డి బంధువులకు రూ.300కోట్లు దోచిపెట్టడానికే అవి. క్వారంటైన్‌ కేంద్రాల్లో భోజనాల కోసం బాఽధితులు ధర్నాలు చేయాల్సి వస్తోంది. గత ప్రభుత్వం పెట్టిన రియల్‌ టైం గవర్నెన్స్‌ కాల్‌ సెంటర్‌ ఉంచినట్లయితే కనీసం ప్రజలకు టెలిమెడిసిన్‌ సౌకర్యమైనా ఉండేది. దానినీ తీసివేశారు’ అని ఆక్షేపించారు.


వారికి ఇక్కడి ఆస్పత్రులు పనికిరావా?

‘కరోనా రాగానే విజయసాయిరెడ్డి, మంత్రులు అంజాద్‌ బాషా, బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాద్‌ పరిగెత్తుకెళ్లి అపోలోలో చేరారు. ఇక్కడి ఆస్పత్రులు వారికి పనికి రాలేదా? మరి సామాన్యులు ఎక్కడకు పోవాలి’ అని పట్టాభి ప్రశ్నించారు. రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 67శాతం రాయలసీమ, ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉన్నాయని, ఈ జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం జగన్‌, ఆరోగ్యమంత్రి ఆళ్ల నాని సిగ్గుపడాలన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స అస్సలు బాగోలేదని రాయలసీమ వైసీపీ ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి కడిగేశారని, అయినా ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా పరీక్షల్లో బోగస్‌ లెక్కలపై వివరణ ఇవ్వాలని పట్టాభి డిమాండ్‌ చేశారు.


 1. కరోనా పరీక్షలపై రాష్ట్రప్రభుత్వం బోగస్‌ లెక్కలు చెబుతోంది. ప్రచారం కోసం పెంచి చూపిస్తోంది.’
 2. ‘ఇప్పటికి 13 లక్షల మందికి పరీక్షలు చేసి.. 21 లక్షల పరీక్షలు చేసినట్లు ప్రకటించింది. నిజంగా అన్ని పరీక్షలు చేస్తే వాటిని కేంద్రం ఎందుకు గుర్తించలేదు?’
 3. టెస్టుల్లో మొదటి స్ధానంలో ఉన్నామని రాష్ట్రం చేసుకుంటున్న ప్రచారం ఒట్టి డొల్ల. పరీక్షలు సరిగా చేయడం లేదు. ఫలితాలు సరిగా ఇవ్వడం లేదు. నమూనాలు సరిగా తీయడం లేదు.’
 4. ‘రాష్ట్రంలో ప్రతి పది సెకన్లకు ఒక కేసు, 20 నిమిషాలకో మరణం చోటు చేసుకుంటోంది. ప్రతి గంటకు ముగ్గురు చనిపోతున్నారు.’
 5. రాష్ట్రంలో ప్రతి వ్యక్తికీ మూడు మాస్కుల చొప్పున  17 కోట్ల మాస్కులు పంపిణీ చేస్తామన్నారు. మూడు మాస్కులే ఇవ్వలేనివారు మూడు రాజధానులు కడతారట!’

Advertisement
Advertisement
Advertisement