Abn logo
Sep 18 2021 @ 01:09AM

టీడీపీ శ్రేణులు భగ్గుభగ్గు

డీజీపీ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసనలో పాల్గొన్న జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి, గొట్టిపాటి, డోలా

బాబు ఇంటిపై దాడి.. నివ్వెరపోయిన జనం 

రాళ్ల దాడిని అడ్డుకున్న ఎమ్మెల్యే ఏలూరి 

హుటాహుటిన వెళ్లి ధర్నాకు దిగిన  ఎమ్మెల్యేలు రవికుమార్‌, స్వామి 

మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపిన ఉగ్ర 

కొత్తపట్నం నిరసన కార్యక్రమంలో దామచర్ల 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు) 

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ వర్గీయుల దాడిని జిల్లాలోని టీడీ పీ నేతలు, శ్రేణులు భగ్గుమన్నారు. అనేక ప్రాంతాల్లో అప్పటి కప్పుడే రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. జిల్లాకు చెందిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురూ హుటాహుటిన చంద్రబాబు నివాసం వద్దకు చేరి దాడిని అడ్డుకునే కార్యక్రమంలో పాల్గొ న్నారు. ఆరంభం నుంచి అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దాడికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ బృందాన్ని అడ్డుకోవటంలో ముందుండి ముఖ్యపాత్ర పోషిం చారు. ఈ సంఘటనపై జిల్లాలోని సామాన్య ప్రజలు కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిలో ఘటన అనంతరం జిల్లాలో ప్రారంభమైన నిరసనలు ఆయా ప్రాంతాల్లో రాత్రి వరకూ కొనసాగాయి. టీడీపీకి చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సీఎం జగన్‌పై చేసిన విమర్శలకు నిరసనగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జోగి రమేష్‌ వైసీపీ శ్రేణులతో కలిసి శుక్రవారం తాడే పల్లిలోని చంద్రబాబు ఇంటిమీద దాడికి ప్రయత్నించారు. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఉన్న పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ముందుగా విషయం తెలుసుకుని అందుబాటులో ఉన్న పార్టీ నాయకులతో కలిసి చంద్రబా బు నివాసానికి చేరారు. కొద్దిసేపటికే అక్కడికి వచ్చిన జోగి రమేష్‌ని చంద్రబాబు ఇంటి లోపలకి ప్రవేశించకుండా అడ్డుకోవటంలో కీలకపాత్ర పోషించారు. జోగి రమేష్‌ అనుచరులు చేసిన రాళ్లదాడిని అడ్డుకోవటంలో ముందున్నారు. ఘటన విషయం తెలియగానే జిల్లాలో ఉన్న అద్దంకి, కొండపి ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్‌, స్వామి కూడా హుటాహుటిన అక్కడికి చేరారు. సాయంత్రం డీజీపీ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో వారంతా పాల్గొన్నారు. జిల్లాలో కూడా ఆ పార్టీశ్రేణులు తీవ్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి మోకాళ్లపై కూర్చుని పార్టీ శ్రేణులతో కలిసి నిరసన తెలిపారు. ఆ నియోజకవర్గంలోని పామూరు, పీసీపల్లి తదితర ప్రాంతాల్లో కూడా కార్యక్రమాలు జరిగాయి. కొత్తపట్నంలో పార్టీ సమావేశంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ కూడా పార్టీశ్రేణులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించి సీఎం జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ముండ్లమూరులో పార్టీశ్రేణులు గుమికూడి రాస్తారోకో నిర్వహించారు. మారుమూల పుల్లలచెరువు మండలంలో కూడా టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం  చేపట్టారు. జిల్లాలోని ఇతర అనేక ప్రాంతాల్లో వివిధ రూపాల్లో నిరసనలు నిర్వహించారు. కాగా మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శలకు దీటైన సమాధానం ఇవ్వాలి. లేదంటే ప్రజాస్వామ్యయుతంగా నిరసనలు తెలియజేయాలి. అంతేగాని చంద్రబాబు ఇంటిమీదకే దాడికి వెళ్లటం సరైన చర్య కాదన్న అభిప్రాయం అత్యధికమంది  జనం నుంచి వ్యక్తమవుతోంది. ఈ సంఘటనపై ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక, రౌడీ పాలన నడుస్తున్నదనేందుకు ఈ ఘటన ఓ నిదర్శనమని వ్యాఖ్యానించారు. మరో ఎమ్మెల్యే గొట్టిపాటి మాట్లాడుతూ బాబు ఇంటిపై దాడిచేసిన వారిని వదిలిపెట్టి టీడీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్‌ చేయటం దుర్మార్గమన్నారు. కొండపి ఎమ్మెల్యే స్వామి మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఓ మాయని మచ్చ అని, జగన్‌ పాలన అరాచకాలు, అక్రమాలకు నిలయంగా మారిందని వ్యాఖ్యానించారు. 

కొత్తపట్నంలో సీఎం జగన్‌ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న దామచర్ల, టీడీపీ నాయకులు


కనిగిరిలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలుపుతున్న ఉగ్ర, టీడీపీ నేతలు