Abn logo
Dec 2 2020 @ 00:03AM

ఎవరిని అడగాలి?



  


రైతుల గోడు పట్టని ప్రభుత్వం

లక్ష ఎకరాల్లో నారు ఎండినా పట్టించుకోలేదు

పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్‌

శ్రీకాకుళం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో లక్ష ఎకరాల్లో వరినారు ఎండిపోయినా వైసీపీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రభుత్వ మాజీ విప్‌ కూన రవికుమార్‌ విమర్శించారు. శ్రీకాకుళంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆరు తుపాన్లు సంభవించాయని...కానీ రైతులకు పరిహారం చెల్లించలేదన్నారు. రైతుల తరుపున మాట్లాడుతున్న విపక్ష నేత చంద్రబాబుపై మాటల దాడి దారుణమన్నారు. టీడీపీ నేతలపై దౌర్జన్యాలకు దిగుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హుద్‌ హుద్‌ తుపానులో విశాఖకు అపార నష్టం కలిగితే 15 రోజులు శ్రమించి కొత్తరూపు తెచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంద ని రవికుమార్‌ గుర్తు చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా రైతుల సమస్యలపై ప్రశ్నించే హక్కు చంద్రబాబుకు ఉందన్నారు. సీఎం జగన్‌ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. స్పీకర్‌ ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడడానికి అవకాశం ఇస్తే, సీఎం హేళన చేస్తూ అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని నిస్సిగ్గుగా సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుడికి కనీస గౌరవం ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్దమన్నారు. మంత్రులు బూతులు మాట్లాడుతుంటే కనీసం సీఎం అడ్డు చెప్పకపోవడం ఆయన నేర మనస్తత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రిగా జగన్‌కు ఎన్ని అధికారాలు ఉన్నాయో, ప్రతిపక్ష నేతగా చంద్రబాబుకు కూడా అవే హక్కులు ఉన్నాయని మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్తెరగాలని ఆయన సూచించారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని ప్రచారం చేస్తున్నారని..ఆ వ్యాఖ్యలు ఎప్పుడు చేశారో రుజువు చేయగలరా అని ప్రశ్నించారు. రైతు సమస్యలపై చంద్రబాబు సభలో ప్రశ్నించడం వల్లే ప్రభుత్వం దిగివచ్చి రాత్రికి రాత్రి నిధులు కేటాయిస్తూ జీఓ విడుదల చేసిందనని తెలిపారు. ప్రజలు తెలిసో తెలియకో ఓటు వేస్తే కనీసం కడప జిల్లాకు కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో సీఎం ఉన్నారన్నారు. సభలో ఇదే పద్ధతి కొనసాగితే భవిష్యత్‌లో ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షుడు ఎం.వెంకటేష్‌, డీసీసీబీ మాజీ ఛైర్మన్‌ సింతు సుధాకర్‌, టీడీపీ నాయకులు భీమశంకర్‌, గుత్తు చిన్నారావు, వి.సూరిబాబు పాల్గొన్నారు.





Advertisement
Advertisement
Advertisement