Abn logo
Sep 17 2021 @ 00:00AM

వ్యవస్థలను భ్రష్టు పట్టించిన జగన్‌

హశేనాపురంలో డీజీపీ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న టీడీపీ నాయకులు

  1. హక్కులను కాలరాస్తున్న వైసీపీ ప్రభుత్వం
  2. చంద్రబాబు ఇంటిపై దాడి దుర్మార్గం 
  3. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎన్‌ఎండీ ఫరూక్‌


నంద్యాల, సెప్టెంబరు 17: రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను జగన్‌ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌ ధ్వజమెత్తారు. శుక్రవారం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఇంటిపై ఎమ్మెల్యే జోగి రమేష్‌, అతని అనుచరుల దాడి ఘటనను ఆయన ఖండించారు. రాజ్‌థియేటర్‌లోని టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య, పౌరహక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాస్తున్నదని అన్నారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు వైసీపీ ప్రభు త్వం గురించి మాట్లాడిన వ్యాఖ్యలు తప్పేమిటని ప్రశ్నించారు. చెత్తపై పన్ను వేసే పాలకులను చెత్త పాలకులు అనక మరేమంటారని అన్నారు. ప్రభుత్వ దుర్మార్గ విధానాలను ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలకు ఉందని అన్నారు. టీడీపీ నాయకులు ఎక్కడ కూడా వ్యక్తిగత విమర్శలు చేయలేదని,  కేవలం ప్రభుత్వ విధానాలను మాత్రమే విమర్శించారన్నారు. దీన్నికూడా జీర్ణించుకోలేక ప్రతిపక్షాలపై అక్కసుతో ఎమ్మెల్యే జోగి రమేష్‌, అతని అనుచరులతో కలిసి కర్రలు, సీసాలు, రాళ్లతో నారా చంద్రబాబునాయుడి ఇంటిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దాడికి యత్నించిన వారిని పోలీసులు ఎందుకు అదుపు చేయలేకపోయారో డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్‌ నంద్యాల ఉప ఎన్నిక బహిరంగ సభలో నడిరోడ్డుపై చంద్రబాబును కాల్చాలని మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. 


రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన: మాజీ జడ్పీ చైర్మన్‌ 


ఓర్వకల్లు: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగానే దుర్మార్గమైన పాలన నడుస్తోందని మాజీ జడ్పీ చైర్మన్‌ రాజశేఖర్‌ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి నిరసనగా శుక్రవారం మండలంలోని హుశేనాపురం గ్రామంలో రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా  రాజశేఖర్‌ మాట్లాడుతూ  వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు  వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారన్నారు. ఇందుకు నిదర్శనం చంద్రబాబు నాయుడు ఇంటిపై జోగి రమేష్‌ దాడి చేయడమేనన్నారు. చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. పోలీసులు వైసీపీ ప్రభుత్వంలో కీలుబొమ్మలుగా మారారని ఆరోపించారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు క్రమశిక్షణను చేతగానితనం కింద జమ చేశారని, వారు తిరగబడితే వైసీపీ నాయకులు ఒక్కరు కూడా బయట తిరగలేరని హెచ్చరించారు. తక్షణమే సీఎం జగన్‌, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, జోగి రమే్‌షలపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సుధాకర్‌, రామగోవిందు, మహబూబ్‌ బాషా, కేవీ మధు, రవి, నారాయణ, రాము పాల్గొన్నారు.  


పాణ్యం: టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి దుర్మార్గమని టీడీపీ నాయకులు రాంమోహన్‌నాయుడు పేర్కొన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నివాసంపై వైసీపీ ఎమ్మెల్యే జోగిరమేష్‌, అనుచరులతో దాడికి పాల్పడడం అవివేకమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. శాంతి భద్రతలు క్షీణించాయన్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడి ప్రతిపక్ష నాయకులు ఆందోళనకు గురవుతున్నారన్నారు.