Abn logo
Jun 2 2020 @ 11:41AM

టీడీపీ నేతలకు తొలి షాక్!

ఆర్థిక మూలాలపై దెబ్బ

ఫిరాయింపుల ప్రయత్నం విఫలం

లొంగని టీడీపీ ఎమ్మెల్యేలు

ముగ్గురు నేతల క్వారీల్లో గ్రానైట్‌ విక్రయాల నిలిపివేత

పర్మిట్లు రద్దు చేసిన ప్రభుత్వం 

న్యాయపోరాటానికి సిద్ధమవుతున్న గొట్టిపాటి, పోతుల?


ఒంగోలు( ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడంపై గురిపెట్టిన జగన్‌ సర్కారు ఆ విషయంలో దూకుడు పెంచింది. జిల్లాలో ముఖ్యమైన టీడీపీ నేతలపై ఆపరేషన్‌ ఆకర్ష్‌ వల విసిరి విఫలం కావడంతో వారిని ఆర్థికంగా దెబ్బతీసే చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా గ్రానైట్‌ రంగంలో ఉన్న నేతలకు తొలిషాక్‌ ఇచ్చింది. వారి గ్రానైట్‌ క్వారీల్లో రాయి విక్రయ పర్మిట్లు రద్దు చేయాలని ఆదివారం ఉన్నతస్థాయిలో నిర్ణయం జరగ్గా, సోమవారమే దాని అమలుకు శ్రీకారం పలికింది. తద్వారా ఆ క్వారీలు మూసివేయాల్సిన పరిస్థితిని కల్పించింది. దీంతో వ్యాపార రంగంలో ఉన్న టీడీపీ ముఖ్యులంతా మున్ముందు ప్రభుత్వ వైఖరిపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


గత సాధారణ ఎన్నికల్లో జిల్లాలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందగా వారిని తమ వైపునకు తిప్పుకునేందుకు అధికారపార్టీ ప్రయత్నించింది. కారణాలు ఏమైనప్పటికీ సీనియర్‌ నాయకుడు, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఒక్కరే వైసీపీలో చేరారు. మిగిలిన ఎమ్మెల్యేలపై వల విసిరినప్పటికీ వారు అందులో చిక్కుకోలేదు. అనంతరం గ్రానైట్‌ రంగంలో ఉన్న టీడీపీ నేతలే లక్ష్యంగా వివిధ యజమానులకు భారీ జరిమానాలు విధించిన ప్రభుత్వం తాజా ముగ్గురు టీడీపీ నేతల గ్రానైట్‌ పర్మిట్లను నిలిపివేసింది.

 

ఆపరేషన్‌ ఆకర్ష్‌ విఫలం

జిల్లాలోని టీడీపీ నేతల్లో కరణం బలరాం వైసీపీకి మద్దతు తెలపక ముందే గ్రానైట్‌ రంగంలో ఉన్న అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌తో ఆ పార్టీలోని కొందరు మంత్రులు మంతనాలు జరిపారు. అలాగే మాజీమంత్రి శిద్దా రాఘవరావుతో ఇటీవల చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. శిద్దా సమీప బంధువులు ఇప్పటికే వైసీపీలో చేరిపోయారు. వారి ద్వారా ఆయన్ను రాబట్టుకునే ప్రయత్నం చేసినట్లు ప్రచారం జరిగింది. ఇంకో వైపు పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కొండపి ఎమ్మెల్యే స్వామిలపై కూడా ఒత్తిడి చేసిన దాఖలాలు ఉన్నాయి.


ప్రధానంగా ఏలూరిపై గురిపెట్టి ఆయనపై ఒత్తిడి పెంచారు. అంతేగాక ఆయన పార్టీ మారబోతున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం ముమ్మరం చేసి మైండ్‌గేమ్‌కు తెరతీశారు. చివరకు ఏలూరి పార్టీ మారేందుకు ససేమిరా అన్నారు. ఆ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. అటు గొట్టిపాటి, శిద్దా.. ఇటు ఏలూరి, ఆయనకు స్నేహితుడైన గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే సత్యప్రసాద్‌పై ప్రయోగించిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ విఫలమైంది. 


ఆ ముగ్గురికీ గనుల శాఖ అధికారుల ఫోన్లు 

ఈ నేపథ్యంలో ప్రభుత్వం టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బతీసే చర్యలకు దిగింది. అందుకు గ్రానైట్‌ రంగంలో ఉన్న ఎమ్మెల్యే రవికుమార్‌, మాజీమంత్రి శిద్దా, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావును టార్గెట్‌ చేయడంతో ప్రభుత్వ వైఖరిని తేటతెల్లమైంది. ఒకానొక దశలో తిరిగి పోతుల వైసీపీలోకి వస్తే కొండపి ఇన్‌చార్జిగా బాధ్యతలు ఇవ్వాలని వైసీపీ నేతలు భావించినట్లు వినికిడి. ఏది ఏమైనా ఈ ప్రయత్నాలన్నీ విఫలమవడంతో గ్రానైట్‌ రంగంలో ఉన్న ముగ్గురు నేతలపై దృష్టిపెట్టడం చర్చనీయాంశమైంది.


సోమవారం ఉదయం రవికుమార్‌, శిద్దా, పోతులకు చెందిన క్వారీల మేనేజర్లను గనుల శాఖ అధికారులు ఫోన్లు చేశారు. మీరు వెలికి తీసిన గ్రానైట్‌ రాయి విక్రయానికి ఇకపై పర్మిట్లు ఇవ్వబోమని, మీరు కూడా కొంతకాలం వ్యాపారాన్ని నిలిపివేస్తే మంచిదని సలహా ఇచ్చినట్లు తెలిసింది. మీ యజమానులకు చెప్పండి. ‘మాకు పైనుంచి ఒత్తిడి ఉంది. కాదూ కూడదని మీరు ముందుకు అడుగు వేస్తే ఏదో రూపంలో మిమ్మల్ని ఇబ్బందిపెట్టడం మాకు పెద్ద పనేం కాదు’ అంటూ వారు సూటిగా హెచ్చరించినట్లు తెలిసింది.


అప్పటికే ఇలా జరగబోతుందని ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంతో అప్రమత్తమైన ఆ ముగ్గురు నేతలు గనుల శాఖ నుంచి వచ్చిన ఫోన్‌ సమాచారంతో మరింత అప్రమత్తమయ్యారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ ముగ్గురికీ భారీనష్టం జరిగే అవకాశం లేక పోలేదు. మాజీ ఎమ్మెల్యే పోతులకు ప్రస్తుతం ఒక్క క్వారీలోనే పని జరుగుతున్నందున తక్కువ నష్టం ఉండవచ్చని భావిస్తున్నారు. రవికుమార్‌, శిద్దాల  ఆదాయానికి మాత్రం భారీగా గండిపడే అవకాశం ఉంది.


పరోక్ష పద్ధతిలో ఆటంకాలు

ప్రస్తుత ప్రభుత్వ విధానం ప్రకారం క్వారీల్లో వెలికితీసిన గ్రానైట్‌ను విక్రయించుకునేందుకు అవసరమైన అనుమతి కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. గనులు, భూగర్భ శాఖ అధికారులు ఆ క్వారీలను పరిశీలించి అనుమతులు ఇస్తారు. అప్పుడు మాత్రమే వారికి పర్మిట్లు వస్తాయి. పర్మిట్లు లేకుండా గ్రానైట్‌ను విక్రయిస్తే భారీమూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కొనుగోలుదారులు కూడా పర్మిట్లు లేకపోతే ఆ వైపు చూడరు. పర్మిట్లు నిలిపివేస్తూ నేరుగా నోటీసులు జారీచేస్తే యజమానులు కోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్న ఉద్దేశంతో పరోక్ష పద్ధతిలో ముందుకు వెళ్లాలని సూచించినట్లు తెలిసింది.


అంతేగాక ప్రభుత్వం అనుకుంటే ఇంకేదైన రూపంలో కూడా క్వారీల నిర్వహణకు ఆటంకాలు కల్పించే అవకాశాలు ఉన్నాయి. దీంతో తాజా ప్రభుత్వ వైఖరితో గ్రానైట్‌ రంగంలో ఉన్న ఈ ముగ్గురు టీడీపీ నేతలు పూర్తిస్థాయిలో ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. ప్రత్యేకించి మాజీ మంత్రి శిద్దా కుటుంబీకులు మరింత కలవరడిపడిపోతున్నారని చెప్తున్నారు. ఎమ్మెల్యే రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యే పోతుల మాత్రం న్యాయబద్ధంగా సమస్యను ఎలా అధిగమించవచ్చన్న అంశంపై దృష్టిపెట్టారని అంటున్నారు. ఏదిఏమైనా ప్రభుత్వం రాజకీయ కోణంలో ప్రత్యర్థుల ఆర్థికమూలాలను దెబ్బతీసే చర్యలకు ఉపక్రమించడంతో జిల్లాలో మున్ముందు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న విషయం చర్చనీయాంశమైంది. సాధారణ ప్రజలు మాత్రం ప్రభుత్వ చర్యను తీవ్రంగా నిరసిస్తున్నారు. 

Advertisement
Advertisement
Advertisement