Abn logo
Jul 29 2021 @ 01:17AM

టీడీపీ నేతల గృహ నిర్బంధం

బుద్దా వెంకన్న నివాసం ఎదుట పోలీసులు

ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్టులు 


విజయవాడ, జూలై 28 (ఆంధ్రజ్యోతి) : మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ వర్గీయుల దాడి నేపథ్యంలో నిరసనలకు దిగుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులపై పోలీసులు నిర్బంధం విధించారు. దేవినేని ఉమా అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ బుధవారం నిరసన వ్యక్తం చేసేందుకు నందివాడకు బయల్దేరిన టీడీపీ నాయకులను బయటకు రానీయకుండా పోలీసులు ఎక్కడికక్కడ హౌస్‌ అరెస్టులు చేశారు. విజయవాడలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్నను మంగళవారం రాత్రే హౌస్‌ అరెస్టు చేసిన పోలీసులు బుధవారం కూడా బయటకు అడుగు పెట్టనీయకుండా ఆయన ఇంటి వద్ద  పహారా కాశారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యను, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌ను నిర్బంధంలో ఉంచారు. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీమంత్రి నెట్టెం రఘురామ్‌ను మంగళవారం రాత్రే హౌస్‌ అరెస్టు చేసిన పోలీసులు బుధవారం కూడా గృహ నిర్బంధంలోనే ఉంచారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావును, మాజీమంత్రి కొల్లు రవీంద్రను బందరులో హౌస్‌ అరెస్టు చేశారు. కైకలూరు మండల టీడీపీ అధ్యక్షుడు పెనుమత్స త్రినాథరాజు.. ఇలా జిల్లావ్యాప్తంగా కాస్త పేరున్న టీడీపీ నాయకులందరినీ పోలీసులు గృహ నిర్భందంలోనే ఉంచారు. 


 టీడీపీ శ్రేణుల నిరసనలు 

దేవినేని ఉమాపై వైసీపీ వర్గీయుల దాడిని ఖండిస్తూ నందివాడ పోలీసుస్టేషన్‌ వద్ద టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన చేశారు. అరెస్టు చేసిన దేవినేని ఉమాను విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. గన్నవరం మండలం హనుమాన్‌ జంక్షన్‌లో తెలుగురైతు, టీడీపీ శ్రేణులు భారీ మోటారు సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. పెనుగంచిప్రోలు, ఆగిరిపల్లి, నూజివీడు, ఎ.కొండూరు, పామర్రు, విస్సన్నపేట, చందర్లపాడు, చల్లపల్లి, తిరువూరు.. ఇలా జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పలుచోట్ల డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేసి నిరసన తెలిపారు.