Abn logo
Sep 17 2021 @ 23:44PM

టీడీపీ నాయకుల ఆగ్రహం

గూడూరులో మాట్లాడుతున్న కోడుమూరు ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌

రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని టీడీపీ నాయకులు మండిపడ్డారు. శుక్రవారం  మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం అమానుషమన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


పత్తికొండ, సెప్టెంబరు 17: మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడి చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు సిగ్గుచేటని  టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు. శుక్రవారం ఆంధ్రజ్యోతితో ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ తుంగలో తొక్కారన్నారు. జగన్‌కు ఓట్లు వేసి నష్టపోయామన్న విషయాన్ని ప్రజలు ఇప్పటికే గుర్తించారన్నారు. దీంతో సీఎం జగన్‌ మాజీ సీఎం చంద్రబాబును టార్గెట్‌ చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌తో వైసీపీ గుండాలు ఇంటిపై రాళ్ల దాడి చేయడం అమానుషమన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమనేని, ఈ విషయాన్ని వైసీపీ శ్రేణులు గుర్తుంచుకోవాలని సూచించారు.


మద్దికెర: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంతమై రాజారెడ్డి రౌడీరాజ్యం నడుస్తోందని టీడీపీ జిల్లా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ సభ్యుడు జమేదార్‌ రాజన్నయాదవ్‌ ఆరోపించారు. శుక్రవారం మద్దికెర గ్రామంలోని టీడీపీ నాయకులు వైఎం గోపీనాథ్‌ లాల్‌ స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయన్నారు. సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌చౌదరి, టీడీపీ జిల్లా నాయకులు రంగయ్య, గుడిగోపాల్‌, పట్టణ అధ్యక్షుడు గడ్డం రామాంజనేయులు ఉన్నారు. 


క్రిష్ణగిరి: మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై ఎమ్మెల్యే జోగి రమేష్‌, వైసీపీ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ లీగల్‌ సెల్‌ కర్నూలు లోక్‌సభ నియోజకరవ్గ ప్రధాన కార్యదర్శి ఎల్వీ ప్రసాద్‌ ఓ ప్రకటనలో ఖండించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 


వెల్దుర్తి: మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి హేయమైన చర్య అని టీడీపీ మండల అధ్యక్షుడు బలరాం గౌడు, సీనియర్‌ నాయకులు బొమ్మన శివశంకర్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో వీరభద్రుడు, కలుగొట్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


డోన్‌: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటిపై వైసీపీ గూండాలు దాడి చేయడం అటవిక చర్య అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామక్రిష్ణ అన్నారు. శుక్రవారం డోన్‌లో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో వాటిని కప్పి పుచ్చుకునేందుకు సీఎం జగన్‌ మరిన్ని కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసుల సమక్షంలోనే మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై వైసీపీ నాయకులు రాళ్లు, కట్టెలతో దాడులు చేయడం ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమేనన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తే.. అప్పటి సీఎం చంద్రబాబు ఎక్కడ చిన్న సంఘటన కూడా జరగకుండా పోలీసుల రక్షణ కల్పించారన్నారు. ఆ రోజు చంద్రబాబు అలా అనుకుని ఉంటే.. వైసీపీ నాయకులు రోడ్లుపై తిరిగేవారా అని ప్రశ్నించారు. అధికారం ఉందన్న అహంకారంతో వైసీపీ నాయకులు చంద్రబాబుపై దాడి చేసేందుకు పూనుకోవడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. అధికారం శాశ్వతం కాదన్నది వైసీపి నాయకులు గుర్తు పెట్టుకోవాలన్నారు. చంద్రబాబుకు హానీ చేయాలని చూస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. 


బేతంచెర్ల: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం అమానుషమని టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర ఉపాధ్యక్షుడు పోలూరు వెంకటేశ్వరరెడ్డి, టీడీపీ మండల నాయకులు తిరుమలేష్‌ చౌదరి, అంబాపురం సర్పంచ్‌ శ్రీనివాస్‌ యాదవ్‌ శుక్రవారం తీవ్రంగా ఖండించారు. 


కోడుమూరు: మాజీ సీఎం చంద్రబాబుకు సీఎం జగన్‌ భేషరతుగా క్షమాపణ చెప్పాలని టీడీపీ రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి సీబీ లత డిమాండ్‌ చేశారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై ఎమ్మెల్యే జోగి రమేష్‌ చేసిన దాడి వెనక ముఖ్యమంత్రి జగన్‌ హస్తం ఉందని ఆరోపించారు. జగన్‌ పాలనలో రాష్ట్రంలో రౌడీ రాజ్యం కొనసాగుతుందన్నారు. జోగి రమేష్‌పై కేసులు నమోదు చేయడంతో చంద్రబాబు పై దాడికి బాధ్యత వహిస్తూ హోంమంత్రి సుచరిత వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడలేని డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ ప్రజలకు ఏమి సమాధానం చెప్తారని ప్రశ్నించారు. టీడీపీ కర్నూలు లోక్‌సభ ఉపాధ్యక్షులు కేఈ మల్లికార్జునగౌడ్‌, మాజీ సర్పంచ్‌ కేయి రాంబాబు, సింగిల్‌విండో మాజీ అధ్యక్షులు హేమాద్రిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, టీఎన్‌టీయూసీ నియోజకవర్గ అధ్యక్షుడు గోపాల్‌నాయుడు, మండల అధ్యక్షుడు కేఈ రఘుబాబు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎల్లప్పనాయుడు తదితరులు పాల్గొన్నారు.  


గూడూరు: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఇంటిపై దాడి అమానుషమని టీడీపీ కోడుమూరు ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌ అన్నారు. శుక్రవారం గూడూరు పట్టణంలో మాట్లాడారు. పథకం ప్రకారం వైసీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు ఇంటిపై దాడికి పాల్పడడం హేయమైన చర్య అని ఖండించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు గజేంద్రగోపాల్‌, నాయకుడు విజయరాఘవరెడ్డి ఉన్నారు.


కర్నూలు(అగ్రికల్చర్‌): మాజీ సీఎం చంద్రబాబు ఇంటిపై దాడి చేయడం దుర్మార్గమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై.నాగేశ్వరరావు యాదవ్‌ ముఖ్యమంత్రి జగన్‌ను హెచ్చరించారు. శుక్రవారం కర్నూలు నగరంలోని ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ దాడిని తీవ్రంగా ఖండించారు.

కోడుమూరులో మాట్లాడుతున్న అధికార ప్రతినిధి సీబీ లత