Abn logo
Jul 12 2020 @ 08:44AM

నిరుద్యోగ ద్రోహి జగన్: కళా వెంకట్రావు

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిపై టీడీపీ నేత కళా వెంకట్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ నిరుద్యోగ ద్రోహి అని వ్యాఖ్యానించారు. వైసీపీలోని రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలిచ్చి... లక్షలాది నిరుద్యోగులను నట్టేట ముంచారని ఆరోపించారు. ఎన్నికల ముందు హోదా తెస్తా, యువతకు ఉద్యోగాలు కల్పిస్తాన్న జగన్.. ఎన్నికలయ్యాక హోదా గురించి నోరు ఎత్తటం లేదని... నిరుద్యోగ యువత గురించి పట్టించుకోవటం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తామని అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 3 లక్షల ఉద్యోగాలు తొలగించారన్నారు. జగన్ తన 13 నెలల పాలనలో నిరుద్యోగ యువతకు ఒక్క శాశ్వత ఉద్యోగం అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఒక్క పరిశ్రమ అయినా తెచ్చారా? అని నిలదీశారు. ‘‘ఉద్యోగాల భర్తీ అంటే మీ తాబేదార్లను  సలహాదారులుగా నియమించటమా? లేక ఒకే సామాజికవర్గానికి పదవులు కట్టబెట్టడమా?’’ అని మండిపడ్డారు. 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు అన్న జగన్ పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారిని సలహాదారులుగా నియమించటం వాస్తవం కాదా? అని నిలదీశారు. 


రైతులు వర్షం కోసం ఎదురు చూసినట్లు నిరుద్యోగులు నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారని కళావెంకట్రావు తెలిపారు. పోటీ పరీక్షల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి శిక్షణ పొందిన నిరుద్యోగులు రోడ్డున పడ్డారన్నారు. 10 తరగతి కూడా పాసవ్వని కొడాలి నానికి మంత్రిగా ఉద్యోగం ఇచ్చిన జగన్ డిగ్రీ, ఎంబీఏ, బీటెక్ చేసిన వాళ్లని వైన్ షాపుల్లో బేరర్లుగా చేశారని వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో శాసించే స్థాయిలో ఉన్న యువతను వైసీపీ ప్రభుత్వం యాచించే స్థాయికి దిగజార్చిందని విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని... ఉద్యోగులకు జీతాలు లేవన్నారు. 


కేంద్రం మెడలు వంచి తెస్తానన్న ప్రత్యేక హోదా ఏమైందని ప్రశ్నించారు.  జగన్ ఇప్పటి వరకు ఎన్ని సార్లు కేంద్రం మెడలు వంచారో ప్రజలకు లెక్క చెప్పాలని...మెడలు వంచేటప్పుడు విజయసాయిరెడ్డి లెక్కపెట్టడం మరిచిపోయారా? అంటూ కళా వెంకట్రావు ఎద్దేవా చేశారు. 


Advertisement
Advertisement
Advertisement