Abn logo
Sep 24 2021 @ 23:59PM

కలిసొచ్చిన ప్రయోగం

ఆచంటలో ప్రమాణ స్వీకారం అనంతరం టీడీపీ, జనసేన ఎంపీపీ, వైస్‌ ఎంపీపీలు

టీడీపీ, జనసేనలదే ఆచంట, వీరవాసరం 

కొత్త పొత్తుపై తమ్ముళ్లలో ఆనందం

కొనసాగింపునకు పెరుగుతున్న డిమాండ్‌

మిగతాచోట్ల ఈ రకమైన పోటీ లేకున్నా అప్రమత్తమైన అధికార వైసీపీ

మండల పాలకవర్గాల నియామకం.. వైసీపీలో బయటపడిన అంతర్గత విభేదాలు


ఆచంట, వీరవాసరం మండలాల్లో అధికార వైసీపీకి చోటు దక్కలేదు. ముందస్తుగా ఎన్ని అంచనాలు వేసినా.. మరిన్ని వ్యూహాలు తెరముందుకు తెచ్చినా.. ఓటర్లకు భారీగా ఎర వేసినా గెలుపు మాత్రం అందుకోలేకపోయింది. విపక్ష తెలుగుదేశం, జనసేన అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను సునాయాసంగా కొల్లగొట్టింది. ఈ తరహా ప్రయోగానికి మరింత పదును పెట్టి రాబోయే ఎన్నికల్లో పాటించాలని తమ్ముళ్లు పట్టుబడుతున్నారు. 


ఆచంట స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి   పోటీ చేసి విజయం సాధించాయి. ఈ విషయంలో మా పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లి రానున్న రోజుల్లో జనసేనతో పొత్తు  విషయాన్ని చర్చిస్తాం. జనసేనతో పాటు మిగిలిన పార్టీలు కలిసి వస్తే వారితో  కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. 

– మాజీ మంత్రి పితాని సత్యనారాయణ


(ఏలూరు–ఆంధ్రజ్యోతి): 

మండలాధీశులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నికల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. మండల కొత్త పాలక వర్గాలు తెర ముందుకు వచ్చాయి. అధికార వైసీపీలో మెజార్టీ తమవైపే వున్నా కిందిస్థాయిలో ఎవరికి వారు వ్యవహరించి రాద్దాంతాలకు, తగువులకు ఉసిగొల్పడంతో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. జీలుగుమిల్లిలో పార్టీ ఒకటి నిర్ణయి స్తే.. ఎంపీటీసీలు మరొకటి నిర్ణయించి తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. మొత్తం తొమ్మిది ఎంపీటీసీ స్థానాలకు గాను, ఏడు వైసీపీ, రెండు టీడీపీ దక్కించుకున్నాయి. వైసీపీ ఏడుగురిలో ఐదుగురు ఓ వైపు, ఇద్దరు మరో వైపు ఎంపీపీ స్థానానికి పోటీపడ్డారు. ఇద్దరే బలం వున్న గ్రూపునకే ఎం పీపీ పదవి కట్టబెట్టేలా అధిష్టానం నిర్ణయించడం రగడకు దారితీసింది. చివరికి ఎంపీటీసీలను బతిమలాడి మీకు మూడేళ్లు.. వాళ్లకు రెండేళ్లనే ప్రాతిపదికన నచ్చచెప్పారు. ఐదుగురున్న వర్గానికే ఎంపీపీ పదవి దక్కేం దుకు అంగీకరించారు. చింతలపూడిలో ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య కో ఆప్షన్‌ సభ్యుడి ఎన్నికలో వివాదం చోటు చేసుకుంది. చివరకు టీడీపీ ఎంపీటీసీలు ముగ్గురిని కో ఆప్షన్‌ ఎన్నికల్లో అధికార వైసీపీ తమవైపు తిప్పుకోగలిగింది. ఫలితంగా ఎమ్మెల్యే సూచించిన వారికే కో ఆప్షన్‌ పదవి దక్కింది. 

ఫలించిన ప్రయోగం...!

మెజార్టీ ఎంపీపీ పదవులు అధికారపక్షం వశమైనా కొత్త సర్దుబాటుతో వీరవాసరం, ఆచంట విపక్షం దక్కించుకుంది. చాన్నాళ్ల తర్వాత టీడీపీ వర్గాల్లో సరికొత్త ఊరట కనిపిం చింది. జనసేన, టీడీపీ మధ్య ఎన్నికల సర్దుబాటు ప్రయోగం పూర్తిగా సక్సెస్‌ అయినట్లు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చీలిక భారీగా వున్న కారణంగా టీడీపీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. స్థానిక ఎన్నికల్లో ఆచంట నియోజకవర్గంలో మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ  సామాజిక వర్గాల మధ్య సమతుల్యత పాటిస్తూ చీలిక శాతాన్ని తగ్గి స్తూ పావులు కదిపారు. ఆ మేరకు ఆచంట నియోజక వర్గంలో జనసేన, తెలుగుదేశం మధ్య అంతర్గత ఎన్నికల ఒప్పందానికి వచ్చారు. ఎన్నికల సమ యానికి అధికార వైసీపీ నువ్వా నేనా అన్నట్లు దూకుడు ప్రదర్శించడం, పోటీకి దిగుతున్న వారిపై బెది రింపులకు పాల్పడడం, బిల్లులు గల్లంతవుతాయంటూ మరికొందరిని హెచ్చరించడం వంటి అనేక ఘటనలు చోటు చేసుకున్న తరుణంలో ఇక్కడ ఓట్ల చీలిక తప్పించేందుకు పితాని వ్యూహా త్మకంగా అడుగులు వేశారు. స్థానిక జనసేన నేతలతోపాటు జిల్లాస్థాయి ఆ పార్టీ పెద్దలతో చర్చించారు. ఫలితం తమవైపే ఉండేలా ఆచంట జడ్పీటీసీ పదవికి టీడీపీ అభ్యర్థి పోటీ చేయడం, ఎంపీటీసీల విషయంలో ఫిఫ్టీ... ఫిఫ్టీ అన్న ట్లు వ్యవహరించారు. మెజార్టీ స్థానాలు ఏ పార్టీకి దక్కితే మిగతా వర్గం మద్దతు పలికేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆచంట మండలంలో వైసీపీ నుంచి ఆరుగురు ఎంపీటీసీలు గెలుపొందగా టీడీపీ నుంచి ఏడుగురు, జనసేన నుంచి నలుగురు ఎన్నికయ్యారు. ఎంపీపీ స్థానాలతోపాటు ఉపాధ్యక్ష పదవిని  కైవశం చేసేందుకు ఈ రెండు పార్టీల మెజార్టీ సరిపోతుంది. ఇక్కడ బీసీ, కాపు సామాజిక వర్గాల వారితోపాటు మిగతా కొన్ని వర్గాలు పితాని ప్రయోగానికి తలూపాయి. ఫలితంగా ఆచంటలో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానం టీడీపీ చేజిక్కించుకుంది. ఈ తరుణంలోనే మంత్రి రంగనాధరాజు వ్యూహాత్మకంగా పావులు కదిపి నా వైసీపీకి ఈ మండలం దక్కలేదు. చివరి క్షణం వరకూ ఎంపీటీసీల కొనుగోలు జరుగుతుందని టీడీపీ, జనసేన భావించినా వైసీపీ ప్రయ త్నాలు సాగించి సైలెంట్‌ అయింది. ఇక్కడి టీడీపీ, జనసేన ప్రయోగం రాష్ట్రవ్యాప్తంగా ఇరు పార్టీల అధినాయకత్వాన్ని ఆకర్షించినట్లు చెబుతు న్నారు. వీరవాసరం మండలంలోనూ ఈ తరహా ప్రయోగమే అక్కడ ఫలించింది. అక్కడ వైసీపీ అడ్రస్‌ గల్లంతై జడ్పీటీసీ, ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవులు ఈ కొత్త కూటమికి దక్కాయి. బలమైన సామాజిక వర్గాల మధ్య ఓట్లు చీలకుండా జాగ్రత్త పడడమే ఈ ప్రయోగం వెనుక రహస్యం గా భావిస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ ఈ ప్రయోగాన్ని కొనసాగించాలని అప్పుడే తెలుగు తమ్ముళ్లు పట్టుబడుతున్నారు. 

వైసీపీలోనూ అంతర్మథనం 

జిల్లావ్యాప్తంగా 46 మండలాల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న వైసీపీకి ఈ రెండు మండలాల ఫలితాలు కంటిలో నలుసుగా మారాయి. అతి విశ్వాసంతో వ్యవహరించామనే భావన ఆ పార్టీలో నెలకొంది. కేవలం రెండు స్థానాలు కోల్పోయినంత మాత్రాన పార్టీకి నష్టం ఏమి లేదని అయితే టీడీపీ, జనసేన కూటమి పొత్తుల ప్రభావం తమ పార్టీని దెబ్బ తీసిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.