Abn logo
Sep 28 2020 @ 05:56AM

సమతూకం..సంస్థాగతంగా బలోపేతానికి టీడీపీ కసరత్తు

మూడు పార్లమెంటరీలకు అధ్యక్షుల నియామకం

ఓసీ, బీసీ, ఎస్సీ వర్గాల వారికి పదవులు

కాకినాడకు జ్యోతుల నవీన్‌కుమార్‌

అమలాపురానికి రెడ్డి అనంతకుమారి

రాజమహేంద్రవరానికి కేఎస్‌ జవహర్‌


(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

సంస్థాగతంగా బలోపేతంగా కావడానికి టీడీపీ నడుంబిగించింది. ఇప్పటికే గ్రామ, మండల, పట్టణ కమిటీలను ఇంచు మించుగా ఏర్పాటుచేసింది. కొత్త జిల్లాలు ఏర్పడనున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం జిల్లాలోని మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు ముగ్గురుని అధ్యక్షులుగా ప్రకటించింది. కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా జడ్పీ మాజీ చైర్మన్‌ జ్యోతుల నవీన్‌కుమార్‌,  రాజమహేంద్రవరం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌,  అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షురాలుగా  రెడ్డి అనంతకుమారిని నియమించారు. కాకినాడ పార్లమెంటరీ అధ్యక్షుడు కాపువర్గానికి చెందిన నేత. కాకినాడ విషయానికొస్తే జ్యోతుల నవీన్‌ యువకుడు,  కావడంతో పాటు జడ్పీ చైర్మన్‌గా చేసిన అనుభవం కూడా ఉండడంతో ఈ పదవి లభించింది. భవిష్యత్తులో యువతకు ప్రాధాన్యం ఇస్తారనడానికి ఇదో సంకేతం. 


రాజమహేంద్రవరం అధ్యక్షుడిగా కొత్తపల్లి శామ్యూల్‌ జవహర్‌ను నియమించారు. ఎస్సీ వర్గాలను బాగా ఆకర్షించడానికి  ఈయనకు పదవి ఇచ్చి ఉండవచ్చు. జవహర్‌ 2014లో కొవ్వూ రు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. అంతేగాక ఆయన అత్తగారి ఊరు పశివేదల. ఉపాధ్యాయుడిగా కెరీర్‌ ప్రారంభించి అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఆయనకు పదవి ఇవ్వడం పట్ల కొవ్వూరులో కొంతమంది అలకబూనారు. మంత్రిగా ఉన్నప్పటి నుంచీ ఆయనకు అక్కడ కొంద రితో విబేధాలున్నా అధిష్ఠానం పెద్దగా పట్టించుకున్నట్టు లేదు. ఈ పదవికి గుడా మాజీ చైర్మన్‌ గన్ని కృష్ణ పేరు కూడా పరిశీలించారు. సీనియర్‌ నేత, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరితోపాటు, అనపర్తి, రాజానగరం మాజీ ఎమ్మెల్యేలు కూడా గన్ని కృష్ణకు అవకాశం ఇవ్వమని కోరినట్టు సమాచారం. అధిష్ఠానం కూడా మొదట ప్రస్తావించినట్టు సమాచారం. కానీ ఉభయ గోదావరి జిల్లాలను ఒక యూనిట్‌గా తీసుకుని ఐదు పార్లమెంటరీ జిల్లాల్లో ఏలూరు కమ్మ వర్గానికి, నరసాపురం, కాకినాడ కాపు వర్గానికి, అమలాపురం బీసీ  కోటాలో శెట్టిబలిజవర్గానికి, రాజమహేంద్రవరం నుంచి ఎస్సీ వర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ గత ఎన్నికల్లో గన్ని కృష్ణకు ఎంపీ సీటు ఇస్తారని భావించారు. అది ఇవ్వకపోవడంతో ఇదైనా వస్తుందని ఆయన వర్గం భావించింది. దీనిపై అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తోంది. కానీ కృష్ణ మాత్రం మౌనం దాల్చారు.  


అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్ష పదవి రెడ్డి అనంతకుమారికి లభించింది. ఆమె శాసనమండలి వైస్‌ చైర్మన్‌  రెడ్డి సుబ్రహ్మణ్యం సతీమణి. కొత్తపేట సర్పంచ్‌గా, ఎంపీపీగా పనిచేసిన అనుభవం ఉంది. అమలాపురం పార్లమెంటరీ పరిధిలో ఓసీ, బీసీ, ఎస్సీ వర్గాల మధ్య పోటీ ఎక్కువ ఉంటుంది. దీంతో బీసీల్లో ఎక్కువ సంఖ్యలో ఉన్న శెట్టిబలిజ వర్గానికి ప్రాధాన్యంతో పాటు మహిళకు ఇవ్వడం ద్వారా ఆ కోటా కూడా పూర్తి చేసినట్టు పార్టీ అధిష్ఠానం సంకేతం పంపించింది. 


విశాఖపట్నం, అనకాపల్లి కో-ఆర్డినేటర్‌గా చినరాజప్ప

పెద్దాపురం: విశాఖపట్నం, అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గాల కో-ఆర్డినేటర్‌గా మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో పార్టీ అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానన్నారు. టీడీపీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు.


పార్టీ పటిష్టతకు శక్తివంచన లేకుండా కృషి:రెడ్డి అనంతకుమారి

పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. భర్త సుబ్రహ్మణ్యం సహాయ సహకారాలతో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తాను. నాకీ అవకాశం కల్పించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌, పొలిట్‌బ్యూరో  సభ్యులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావులకు కృతజ్ఞతలు. 


ప్రణాళికాబద్ధంగా నడిపిస్తా: జ్యోతుల నవీన్‌కుమార్‌

కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలో పార్టీని ప్రణాళికాబద్ధంగా ముందుకు  తీసుకెళ్తాను. చంద్రబాబు తనపై వచ్చిన నమ్మకాన్ని నిలబెడతాను. యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప వంటి పెద్దలు నాపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయను. నేను ఈ స్థాయికి రావడానికి అనేక మంది ఆశీస్సులు ఉన్నాయి. మొదటి ప్రత్యక్షదైవం నా తండ్రి నెహ్రూ. ఆయనకు పాఽదాభివందనాలు చేస్తున్నారు. పెద్దల సహకారంతో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తాను.


పెత్తందార్లకు కాదు... పనిచేసే వారికే భరోసా: కేఎస్‌ జవహర్‌

నాకు అందరితోనూ పరిచయాలు ఉన్నాయి. సమస్యల విషయంలో నేనే షూటర్‌గానే ఉంటాను. మేకర్‌గా ఉండను. ఇప్పటికే రెండు అసెంబ్లీలో మా పార్టీ విజయపతాకం ఎగరవేసింది. మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీ జెండా ఎగిరేలా పెద్దలు, పార్టీనేతలందరితో కలిసి క్షేత్రస్థాయిలో ప్లానింగ్‌ చేస్తాను. గ్రామ/వార్డు స్థాయి నుంచీ పార్టీని పటిష్టం చేస్తా. ప్రస్తుతం బెదిరింపు ధోరణి రాజకీయాలు నడుస్తున్నాయి. వాటి నుంచి కాపాడడానికి కింది స్థాయి కేడర్‌లోనూ ఉత్తేజాన్ని, ధైర్యాన్ని నింపుతాను. కొవ్వూరులో  సంస్థాగత ఎన్నికలను త్వరలో పూర్తి చేస్తాను.

Advertisement
Advertisement
Advertisement