Abn logo
Jul 15 2020 @ 09:21AM

పోలీసు అధికారులు కంపెనీలో ఉండి తతంగం అంతా నడిపిస్తారా?: చంద్రబాబు

అమరావతి: విశాఖ దుర్ఘటనలో మృతుడి కుటుంబానికి రూ. కోటి పరిహారం చెల్లించాలని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు ఇచ్చిన ప్యాకేజి, రాంకీ సాల్వెంట్ బాధితులకు కూడా ఇవ్వాలని సూచించారు. అలాగే టీడీపీ, సీపీఐ, బీజేపీ, జనసేన, కార్మిక సంఘాల నాయకుల నిర్బంధంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాల్వెంట్ కంపెనీ బాధ్యులను అరెస్ట్ చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పాలకుల బాధ్యతారాహిత్యం విశాఖ ప్రజలకు ప్రాణాంతకంగా మారిందన్నారు. పారిశ్రామిక భద్రతను పెనుప్రమాదంలో పడేశారని ధ్వజమెత్తారు. 


వరుస ప్రమాదాలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారని పేర్కొన్నారు. ‘‘విశాఖ కంపెనీల్లో విస్ఫోటనాలపై ఎందుకింత నిర్లక్ష్యం..?. మీ బాధ్యతారాహిత్యానికి హద్దు అదుపు లేదా..?. రాంకీ ఫార్మాసిటీ సాల్వెంట్ పరిశ్రమ పేలుడుకు బాధ్యులపై చర్యలు తీసుకోరా..?. రియాక్టర్ వద్ద ఉష్ణోగ్రతలు, వాక్యూమ్ క్రమబద్దీకరణ బాధ్యత కంపెనీది కాదా..?. తన కొడుకు లోపల మంటల్లో ఉన్నాడని గేటువద్ద రోదిస్తున్న తల్లి ఆవేదన పట్టదా..?. రెవెన్యూ, పోలీసు అధికారులు కంపెనీలో ఉండి ఈ తతంగం అంతా నడిపిస్తారా..?. కుటుంబ సభ్యులు తెల్లవార్లూ గేటు వద్ద ధర్నా చేస్తుంటే మృతదేహాన్ని వాళ్లకు చూపించరా..?. దొడ్డిదారిన మృతదేహాన్ని ఆసుపత్రికి పంపిస్తారా..?. 6 గంటలపాటు టీడీపీ, సీపీఐ, బీజేపీ, జనసేన, కార్మిక సంఘాల నాయకులను పోలీస్ స్టేషన్‌లో నిర్బంధిస్తారా..?. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్ట్ చేస్తారా..?. ప్రమాదానికి కారకులను వదిలేసి పరామర్శకు వెళ్లిన వాళ్లను అరెస్ట్ చేస్తారా..?. ప్రజలకు అండగా ఉండటం ప్రజాప్రతినిధుల బాధ్యత కాదా...?.  ప్రజా ప్రతినిధులను నిర్బంధించడం కోసమేనా ఒక్కఛాన్స్ ఇవ్వాలని అడిగింది..?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు. 


సీఎం జగన్ బాధ్యతారాహిత్యం వల్లే విశాఖలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. పాలకుల బాధ్యతారాహిత్యం విశాఖ ప్రజలకు ప్రాణాంతకంగా మారడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 68 రోజుల్లో 3 దుర్ఘటనలు, 15 రోజుల్లో ఫార్మాసిటిలోనే 2 ప్రమాదాలు జరిగినా మొద్దునిద్ర నుండి మేల్కొనరా..? అని ప్రశ్నించారు. ఎల్జీ పాలిమర్స్  తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోరా..?.. మీరు తప్పులు చేసి టీడీపీపై నిందలు వేస్తారా..? అని ప్రశ్నించారు. మీ చేతగానితనానికి టీడీపీని నిందించడం హేయమన్నారు. రాంకీ ఫార్మాసిటి సాల్వెంట్ పరిశ్రమలో మృతుడి కుటుంబానికి రూ కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. గాయపడిన వారికి అత్యున్నత వైద్యం అందించాలన్నారు. ఎల్జీ పాలిమర్స్ మృతులు, క్షతగాత్రులకు ఇచ్చిన ప్యాకేజియే సాల్వెంట్ బాధితులకు కూడా అందించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాంకీ సాల్వెంట్ ప్రమాద బాధ్యులను తక్షణమే అరెస్ట్ చేయాలన్నారు. 

Advertisement
Advertisement
Advertisement