Advertisement
Advertisement
Abn logo
Advertisement

పన్ను బాదుడు

డిసెంబరు నుంచి చెత్తపై యూజర్‌ చార్జీలు వసూలు

ప్రతి ఇంటి నుంచి నెలకు రూ.120 వసూలు

నివాసాల ద్వారా రూ.పది కోట్లు ఆదాయం

నివాసేతర భవనాల నుంచి మరో రూ.13 కోట్లు

వచ్చే నెలలో ఆస్తి పన్ను పెంపు నోటీసులు

ఆస్తి విలువ ఆధారంగా నివాసాలకు 0.12 శాతం, నివాసేతర భవనాలకు 0.30 శాతం

ఖాళీ స్థలాలకు 0.50 శాతం చొప్పున పన్ను

రెండింటికీ ఇప్పటికే కౌన్సిల్‌ ఆమోదం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఆదాయం కోసం స్థానిక సంస్థల పరిధిలో పన్నుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. వీలైనంత వేగంగా చెత్తపై యూజర్‌ చార్జీలు, మూలధనం విలువ ఆధారంగా ఆస్తి పన్ను వసూలు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబరు నుంచి చెత్తపై యూజర్‌ చార్జీల వసూలుకు మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) సిద్ధమవుతోంది. అలాగే మరో నెల రోజుల్లో ఆస్తి పన్ను పెంపును అమలులోకి తేనున్నట్టు తెలిసింది.  


పారిశుధ్య నిర్వహణ కోసం నివాసాల నుంచి నెలకు రూ.120 చొప్పున యూజర్‌ చార్జీలు వసూలు చేయాలని జీవీఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు కౌన్సిల్‌లో ఆరు నెలల కిందటే తీర్మానం చేసింది. నగరంలో సుమారు 5,08,700 అసెస్‌మెంట్లు ఉండగా...వీటిలో మూడున్నర లక్షలు వరకూ నివాసాలు, మిగిలినవి నివాసేతర భవనాలు. నివాసాల నుంచి నెలకు రూ.120 చొప్పున, నివాసేతర భవనాల నిర్వాహకుల వద్ద రూ.150 నుంచి రూ.15 వేలు వరకూ వసూలు చేయాలని నిర్ణయించింది. రెండు నెలల కిందట ప్రయోగాత్మకంగా నగర పరిధిలోని 58 వార్డు సచివాలయాల పరిధిలో యూజర్‌ చార్జీల వసూలును ప్రారంభించారు. ఆయా సచివాలయాల పరిఽధిలో రూ.26 లక్షల వరకూ వసూలైనట్టు అధికారులు చెబుతున్నారు. ఇదేవిధంగా డిసెంబరు ఒకటి నుంచి నగరవ్యాప్తంగా యూజర్‌ చార్జీలు వసూలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. యూజర్‌ చార్జీలు వసూలుచేసే బాధ్యతను వార్డు సచివాలయాల్లోని శానిటరీ సెక్రటరీలకు అప్పగించారు. వారంతా ఇంటింటికీ వెళ్లి ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌లో యూజర్‌ చార్జీలను చెల్లించేలా అవగాహన కల్పించాల్సి ఉంటుంది. యూజర్‌ చార్జీల రూపంలో నివాసాల ద్వారా నెలకు రూ.పది కోట్లు వరకూ సమకూరనున్నది. అలాగే నగరంలోని తోపుడు బండ్లు, హోటళ్లు, లాడ్జిలు, ఆస్పత్రులు, కల్యాణ మండపాలు, ఇతర దుకాణాలు, వాణిజ్య సముదాయాల నుంచి నెలకు రూ.150 నుంచి రూ.15 వేల వరకూ వసూలు చేయాలని నిర్ణయించారు. వీటి ద్వారా మరో రూ.13 కోట్లు ఆదాయం రానున్నది. అంటే నెలకు రూ.23 కోట్లు చొప్పున ఏడాదికి యూజర్‌ చార్జీల రూపంలో రూ.270 కోట్లు వరకూ జీవీఎంసీకి సమకూరుతుంది.


ఆస్తిపన్ను సవరణ ద్వారా మరింత భారం

ప్రస్తుతం వార్షిక అద్దె ఆధారంగా ఆస్తి పన్ను విధిస్తుండగా...ఇకపై ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నివాస భవనాలకు ఆస్తి విలువలో 0.15 శాతం, నివాసేతర భవనాలకు 0.30 శాతం, ఖాళీ స్థలాలకు 0.50 శాతం వరకూ పన్ను విధించుకునే అవకాశాన్ని స్థానిక సంస్థలకు కల్పిస్తూ జీవో నంబర్‌ 198ను విడుదల చేసింది. నివాస భవనాలకు 0.12 శాతం, నివాసేతర భవనాలకు 0.30, ఖాళీ స్థలాలకు 0.50 శాతం చొప్పున పన్ను విధించేలా ఈ ఏడాది ఆగస్టులో జీవీఎంసీ ప్రత్యేక సమావేశం తీర్మానం చేసింది. పన్ను పెంపును విపక్షాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకించినా అధికార పార్టీ పట్టించుకోలేదు. కొత్తవిధానంలో పన్ను ఎంత విధించాలనే దానిపై రెవెన్యూ విభాగం అధికారులు వార్డు సచివాలయ సిబ్బంది సహాయంతో నగరంలోని అన్ని భవనాలు, ఖాళీ స్థలాలను సర్వే చేశారు. ఆయా భవనాలకు సంబంధించిన ప్లాన్‌ కాపీలు, భవన నిర్మాణం తీరును పరిశీలించి నివేదిక తయారుచేశారు. ప్రస్తుతం ఎంత పన్ను చెల్లిస్తున్నారు...కొత్త విధానంలో ఎంత చెల్లించాల్సి వస్తుందో లెక్కించారు. ఆ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ కార్యక్రమం పూర్తికావడానికి మరో 20 రోజులు పడుతుందని రెవెన్యూ విభాగం అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత నోటీసులు తయారుచేస్తారు. వాటిని భవన యజమానులకు అందజేసి 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచే పన్ను కట్టించుకుంటారు. ఒక ప్రాంతంలో భూమి రిజిస్ర్టేషన్‌ విలువ, భవన నిర్మాణానికి అయిన ఖర్చును లెక్కించి ఆస్తి విలువను నిర్ణయిస్తారు. నివాస భవనం అయితే ఆ విలువలో 0.12 శాతం పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు భీమిలి ప్రాంతంలో నివాస భూమి చదరపు గజం ధర కనిష్ఠం రూ.5,500 కాగా గరిష్ఠంగా రూ.12 వేలు ఉంది. నిర్మాణం ఖర్చు కింద చదరపు అడుగుకు కనిష్ఠంగా రూ.1,140, గరిష్ఠంగా రూ.1,240గా అంచనా వేశారు. ఈ లెక్కన భీమిలిలో ఒక నివాసం విలువ భూమి, నిర్మాణ వ్యయంతో కలుపుకుని చదరపు అడుగుకు రూ.1,450 నుంచి రూ.1,750 అవుతుందని లెక్కించారు. ఎవరికైనా వెయ్యి చదరపు అడుగుల్లో భవనం వుంటే ఆ భవనానికి 0.12 శాతం చొప్పున కనిష్ఠంగా రూ.1,740, గరిష్ఠంగా రూ.2,100 ఆస్తిపన్ను కింద చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రస్తుతం చెల్లిస్తున్న పన్ను కంటే 25 శాతానికిపైగా పెంచాల్సి వస్తే మాత్రం...ఒకేసారి కాకుండా ఆరేళ్లపాటు సర్దుబాటు చేస్తారు. 


అయితే ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మించినట్టయితే మాత్రం భారీగా పన్ను విధించనున్నారు. చిన్నపాటి ఉల్లంఘన ఉన్నా మూడేళ్లు గడిచేసరికి రెండు నుంచి మూడు రెట్లు పెరిగే అవకాశం లేకపోలేదు. ఉల్లంఘన స్థాయిని బట్టి 25 శాతం నుంచి వంద శాతం వరకూ అదనంగా పన్ను విధించాలని అధికారులు నిర్ణయించారు. నగరంలో వున్న భవనాల్లో కనీసం 50 శాతం ప్లాన్‌కు విరుద్ధంగానే నిర్మించినవి ఉన్నాయి.  బీపీఎస్‌లో క్రమబద్ధీకరించుకోనివి, ప్లాన్‌ మంజూరుకు వీలుపడని 100 గజాల్లోపు వున్న భవనాలు, ప్లాన్‌ వచ్చేందుకు వీల్లేని భూముల్లో వున్నవాటిపై మోయలేన భారం పడడం ఖాయమంటున్నారు.

Advertisement
Advertisement