Abn logo
May 13 2020 @ 03:36AM

స్వావలంబన లక్ష్యంగా..

కరోనాకాలంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ఇది ఐదోసారి. మంగళవారం నాటి ఆయన ప్రసంగం అనేకులకు కొత్తగా అనిపించింది. తెరమీదకు వచ్చినప్పుడల్లా ఆయన చప్పట్లు చరచడం, దీపాలు వెలిగించడం వంటివి ప్రతిపాదిస్తున్న నేపథ్యంలో ఈ ప్రసంగం కాస్త భిన్నంగా ఉండటం కారణం కావచ్చు. ఈ ప్రసంగంలో ఆయన కష్టకాలంలో భారతదేశం మిగతా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన ఘనతను చాటిచెబుతూనే కుదేలైన ఆర్థికరంగాన్ని తిరిగినిలబెట్టేందుకు నిర్దిష్టంగా ఓ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం సంతోషించవలసిన పరిణామం. కనీసం పదిలక్షలకోట్ల ప్యాకేజీ ప్రకటిస్తారని మీడియా ముందుగానే అంచనాలు కట్టినా, దేశ స్వావలంబన, స్వయంసమృద్ధి లక్ష్యంగా ‘2020లో 20లక్షలకోట్ల ప్యాకేజీ’ని ఆయన ప్రకటించారు. గతంలో ఆర్థికమంత్రి, రిజర్వుబ్యాంకు ఇచ్చిన ఉద్దీపనలు కూడా ఈ మొత్తంలో కలగలసి ఉన్నందున ఏతావాతా ప్రధాని ఇప్పుడు కొత్తగా చేర్చినది పదిలక్షలకోట్ల లోపేనని ఆర్థికవేత్తల లెక్క. 


ముఖ్యమంత్రులతో సుదీర్ఘభేటీ మర్నాడు ప్రధాని ఇలా ప్రజల ముందుకు వచ్చినందున ప్రసంగం మరింత నిర్దిష్టంగా, అనేక అనుమానాలకు, ప్రశ్నలకు పరిష్కారాలు అందించేదిగా ఉంటుందని అనేకులు ఆశించారు. కానీ, ప్రధాని లోతుల్లోకి పోకుండా రాబోయే కాలానికి మనల్ని మనం సన్నద్ధం చేసుకోవాల్సిన అవసరాన్ని మాత్రమే చెప్పారు. కరోనా మనల్ని నియంత్రించలేదని అంటూనే, కరోనాపై పోరాడుతూ ముందుకు సాగాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. మే 17వతేదీ తరువాత నాలుగోవిడత లాక్‌డౌన్‌ అమల్లోకి రాబోతున్నదని ప్రకటించారు. ముఖ్యమంత్రుల సమావేశంలోనే ఆయన లాక్‌డౌన్‌ కొనసాగాల్సిందేనని అభిప్రాయపడినందున ఇది అనూహ్యమైన ప్రకటన కాదు కానీ, ఇకపై అమలుకాబోయేది కచ్చితంగా గతానికి భిన్నంగా ఉంటుందని మాత్రం ఆయన హామీ ఇస్తున్నారు. ఇప్పటికే, కొంతమేర లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపులతో పలు పరిశ్రమలు, ప్రైవేటురంగ సంస్థలు కార్యకలాపాలు ఆరంభించాయి. కొన్ని రాష్ట్రాలు వద్దన్నా పరిమిత సంఖ్యలో రైళ్ళ రాకపోకలు కూడా మొదలైనాయి. మరిన్ని సడలింపులపై రాష్ట్రాలు 15వ తేదీలోగా తమ అభిప్రాయాలు తెలియచేయాల్సి ఉన్నందున ఆయా సలహాలు, సూచనల ఆధారంగా నాలుగోదశ లాక్డౌన్ రూపుదిద్దుకోబోతున్నది. 


మరింతకాలం లాక్‌డౌన్‌ తప్పదన్న విషయాన్ని అటుంచితే, దేశ జీడీపీలో దాదాపు పదిశాతం అంటూ ప్రధాని ఇప్పుడు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీని ఉద్దీపనగా అభివర్ణించలేం. వేగంగా పాతాళంలోకి జారిపోతున్న ఆర్థిక వ్యవస్థకు కాస్తంత మద్దతు ఇచ్చి, ఉపశమనం చేకూర్చేందుకు పనికి వస్తుంది కనుక, ఇది సహాయక చర్య మాత్రమే. కుటీర పరిశ్రమలనుంచి మధ్యతరహా పరిశ్రమల వరకూ అన్నింటిని నిలబెట్టే, దేశంలోని ప్రతి పారిశ్రామిక కార్మికుడినీ కలుపుకొనిపోగలిగే ప్యాకేజీ అని ప్రధాని హామీ ఇస్తున్నారు. ఈ చిన్నమొత్తంతో స్వయం సమృద్ధభారతాన్ని సాధించగలమా? అన్న విమర్శలు అటుంచితే, ఈ ప్యాకేజీ కనీసం ఎంతమేరకు ఆర్థికరంగాన్ని తెప్పరిల్లజేస్తుందో ఆర్థికమంత్రి రేపటినుంచి ప్రకటించబోయే వివరాలు తెలియచెబుతాయి.


స్వయం సమృద్ధభారత్ సాధనకు కొన్ని సంస్కరణలు కూడా అవసరమని ప్రధాని వ్యాఖ్యానించినందున, ఇప్పటికే కార్మిక చట్టాలను కొన్ని రాష్ట్రాలు నిర్వీర్యపరిచిన స్థితిలో ఆ కొత్తవాటికి ఎదురుచూడక తప్పదు. ఆపదలో తయారుచేయాల్సివచ్చిన పీపీఈ కిట్లని ఉదహరిస్తూ స్వావలంబన, దేశీయోత్పత్తి గురించి ప్రధాని మాట్లాడటం కొందరికి కష్టంగా ఉన్నప్పటికీ, ఈ ఆదర్శాలు మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో కొంతకాలం వల్లెవేసినవే. దేశం ఆర్థికంగా ఎంతో బలంగా ఉంటూ, అన్ని వ్యవస్థలూ సవ్యంగా ఉన్నప్పుడే అవి ఆచరణ సాధ్యం కాలేదు. ఈ కష్టకాలంలో మారోమారు గుర్తుకు వచ్చిన మేకిన్ ఇండియా కూడా అనతికాలంలోనే చతికిలబడిపోయింది. ప్రపంచమంతా మూసుకుపోయి, సరఫరా వ్యవస్థలు ఛిన్నాభిన్నమైన తరుణంలో మార్గాంతరం లేక ఇలా స్వదేశీ తయారీ జెండా ఎత్తుకోవాల్సి వచ్చినా సంతోషించవలసిందే. ప్రపంచీకరణతో వ్యాపించిన రోగానికి విరుగుడుగా ప్రతీదేశమూ స్థానిక తయారీపై దృష్టిపెడుతున్న తరుణం ఇది. డెబ్బయ్ వేల పైచిలుకు కేసులు దేశం ఎదుర్కొంటున్న స్థితిలో, మోదీ ప్రజారోగ్య వ్యవస్థలకు ఊతం ఇచ్చే చర్యల ఊసెత్తనందుకు కొందరికి ఆగ్రహం కలిగినా, ఆయన ప్రసంగం మొత్తంగా మనలను మరో దశ ప్రయాణానికి మానసికంగా సంసిద్ధులను చేసింది.

Advertisement
Advertisement
Advertisement