త్వరలో తమిళ తెరపై అనసూయ భరద్వాజ్ తెరంగేట్రం చేయనున్నారు. తెలుగునాట బుల్లితెరపై వినోదాత్మక కార్యక్రమాలతో వీక్షకులను, వెండితెరపై విభిన్న పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారామె. ఇప్పుడు తమిళ వెండితెరపైకి వెళ్తున్నారు. ప్రస్తుతం ఓ తమిళ చిత్రం చేస్తున్నారామె. చెన్నైలో జరుగుతున్న ఆ సినిమా చిత్రీకరణలో అనసూయ పాల్గొంటున్నారు. ‘‘మరో మంచి కథలో జీవిస్తున్నా. తమిళ చలనచిత్ర పరిశ్రమలో కొత్త ప్రయాణం మొదలైంది’’ అని ఆమె ఫేస్బుక్లో పేర్కొన్నారు. చేతికి గాజులు, కాళ్లకు పట్టీలు, ముక్కుపుడక, నుదుట బొట్టు చూస్తుంటే... ‘రంగస్థలం’లో రంగమ్మత్త తరహా పాత్ర చేస్తున్నట్టున్నారు. ఇటీవల చెన్నైలో విజయ్ సేతుపతిని అనసూయ కలిశారు. అప్పుడు తీసుకున్న ఫొటోను సైతం నెటిజన్లతో పంచుకున్నారు. తెలుగులో ‘రంగమార్తాండ’, ‘ఖిలాడి’, ‘థ్యాంక్యూ బ్రదర్’ చిత్రాల్లో అనసూయ నటిస్తున్నారు.