Oct 23 2021 @ 10:55AM

వెండితెరపైకి త్వరలో టామ్‌ అండ్‌ జెర్రీ

బెంగళూరు(Karnataka): ప్రపంచవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన కెజిఎఫ్‌ కన్నడ చిత్రంలో పవర్‌ఫుల్‌ డైలాగులను రాసిన రాఘవ్‌ వినయ్‌ శివగంగ తాజాగా దర్శకుడి అవతారమెత్తారు. ఆయన దర్శకత్వంలో చిత్రీకరణ పూర్తి చేసుకున్న తొలి చిత్రం టామ్‌ అండ్‌ జెర్రీ విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన తొలి పాట్‌ ఇప్పటికే బాగా హిట్‌ అయి అందరి నోళ్ళలో నానుతోంది. హాయాగిదె ఎదెయోళగె అనే పాటను ఆనంద్‌ ఆడియో సంస్థ యూట్యూబ్‌ ద్వారా విడుదల చేసిన సంగతి విదితమే. కేవలం నెల రోజుల్లోనే ఈ పాటను కోటి మందికి పైగా అభిమానులు వీక్షించారు. దక్షిణాదిన ఖ్యాతి గడిం చిన సిద్‌ శ్రీరామ్‌ ఈ పాటు పాడారు. ఇది ఆయనకు తొలి కన్నడ పాట కావడం మరో విశేషం. చిత్రానికి సంబంధించిన కాదల్‌ నీ అన్నలె అనే పాటను గాయకుడు మోహన్‌ ఆలపించారు. ఈ చిత్రానికి మాథ్యూస్‌ మను సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రంలో మొత్తం 6 పాటలున్నాయని అన్నీ బాగా ఆకట్టుకునేవేనని చిత్ర నిర్మాత రాజుశేరిగార్‌ అన్నారు. కుందాపురకు చెందిన రాజు ప్రస్తుతం గుజరాత్‌లో పారిశ్రామిక వేత్తగా స్ధిరపడ్డారు. రిద్ది సిద్ది ఫిల్మ్స్‌ పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఒ అద్భుత ప్రేమ కథా కావ్యమని ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు. టైటిల్‌కు తగ్గట్లే ఈ చిత్రంలో కధానాయకుడు, కధా నాయకి తరచూ గొడవపడుతూ ఉంటారన్నారు. ఈ నేపథ్యంతోనే కథ అనేక ఆస క్తికరమైన మలుపులు తిరుగుతూ చిత్రంలోని ప్రతి సన్నివేశం ఆకట్టుకునేలా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో హీరోగా శివమొగ్గకు చెందిన నిశ్చిత్‌  కూరూడి నటించగా హీరోయిన్‌గా చైత్రారావ్‌ నటించారు. హీరోయిన్‌ పాత్రకూడా అత్యంత భిన్నంగా ఉంటుందని చెప్పారు. చిత్రంలో విలన్‌గా సూర్య శేఖర్‌ విలక్షణ పాత్రను పోషించారన్నారు. చిత్రంలో తారా అనురాధ, జై జగదీష్‌, కోటె ప్రభాకర్‌, కడ్డీపుడి చంద్రు, రాక్‌ లైన్‌ సుధాకర్‌, సంపత్‌ మైత్రేయ, పద్మజారావ్‌, ప్రకాష్‌ తుమ్మినాడు, ప్రశాంత్‌ నటన, మైత్రి జగ్గి ప్రధాన పాత్రలను పోషించారు. ఇది పూర్తిగా యూత్‌ ఓరియంటెడ్‌ చిత్రమన్నారు. చిత్రానికి సెన్సార్‌బోర్డు యు-ఎ సర్టిఫికెట్‌ మంజూరు చేసిందన్నారు.