Abn logo
Oct 24 2020 @ 04:48AM

పార్టీలకు అతీతంగా నగదు పంపిణీ : తలసాని

పార్టీ మనుషులకే ఇస్తున్నారు : బీజేపీ ఆందోళన


మంగళ్‌హాట్‌, అక్టోబర్‌ 23(ఆంధ్రజ్యోతి): వర్షం కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా సహాయాన్ని అందిస్తామన్నారు. గన్‌ఫౌండ్రీ డివిజన్‌ నేతాజీనగర్‌ కాలనీలో బాధితులకు స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్‌, కార్పొరేటర్‌ మమత సంతోష్‌ గుప్తాలతో కలిసి రూ. 10ల చొప్పున నగదు సహకారం అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌, నాంపల్లి నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జి ఆనంద్‌ కుమార్‌ గౌడ్‌, కార్పొరేటర్‌లు మమత సంతోష్‌ గుప్తా, పరమేశ్వరీ సింగ్‌, ముఖేష్‌ సింగ్‌, డీఆర్‌వో అనిల్‌తో పాటు అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు. 


బీజేపీ నాయకుల ఆందోళన

తలసానికి తమ బాధలు చెప్పుకునేందుకు బీజేపీ నాయకులు, స్థానిక బస్తీ ప్రజలు తరళివెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో గన్‌ఫౌండ్రీ యువ అసోసియేషన్‌ అధ్యక్షుడు, బీజేపీ యువ నాయకులు ఓం ప్రకాశ్‌ భీష్వ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పోలీస్‌ జులుం నశించాలి... టీఆర్‌ఎస్‌ డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. టీఆర్‌ఎస్‌ ఫాలోవర్స్‌గా ఉన్న వారికే నగ దు పంపిణీ చేస్తున్నారని ప్రకాశ్‌ భీష్వ ఆరోపించారు. దాదాపు 150 మంది బాధితులు ఉంటే 70 మందికి మాత్రమే ఇచ్చారని అన్నారు. గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో అసలైన బాధితులను వదిలేసి డబ్బులు పంచుతున్నారని ఆరోపించారు. రాజాసింగ్‌ వినతి మేర కు ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. 

Advertisement
Advertisement