Oct 14 2021 @ 16:44PM

మీకు ఫోనే ముఖ్యం ముఖ్యం కదా.. దాన్ని మీరే ఉంచుకోండి.. Aryan Khan తరపున లాయర్ తాజా వాదనలివీ..!

ముంబైలోని ప్రత్యేక ఎన్డీపీఎస్ కోర్టులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. బుధవారం జరిగిన వాదనలకు కొనసాగింపుగా గురువారం ఎన్సీబీ తరపున ఏఎస్‌జీ వాదించారు. ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. అతడికి బెయిల్ ఇస్తే ఆధారాలు ధ్వంసం చేస్తాడని తేల్చిచెప్పారు. అంతర్జాతీయ డ్రగ్స్ డీలర్స్‌తో ఆర్యన్ ఖాన్ ఫోన్‌లో జరిపిన లావాదేవీలు ఉన్నాయన్నారు. ఆర్యన్ ఖాన్ ఆ సమయంలో డగ్ర్స్ తీసుకోనప్పటికీ, అతడే ప్రముఖ పాత్రధారి అనడానికి ఆధారాలు ఉన్నాయన్నారు. అయితే ఏఎస్‌జీ వాదనల తర్వాత ఆర్యన్ ఖాన్ తరపున లాయర్ అమిత్ దేశాయ్ కూడా పాయింట్స్ లేవనెత్తారు. 

‘విచారణలో మాటి మాటికి వాట్సప్ చాటింగ్, ఫోన్ కాల్ డేటా అంటూ ఎన్సీబీ మాట్లాడుతోంది. ఇప్పుడు ఆ ఫోన్ వారి వద్దే ఉంది. ఇప్పటికే ఆర్యన్ ఖాన్ వద్ద నుంచి ఒక్కసారి మాత్రమే స్టేట్‌మెంట్ తీసుకుంది. మరి ఆ ఫోన్‌ను వారి వద్దే ఉంచుకుని విచారణ కోసం ఉపయోగించుకుని ఆర్యన్ ఖాన్‌ను బెయిల్ పై విడుదల చేయడానికి ఎన్సీబీకి ఏం అభ్యంతరం. ఆ ఫోన్‌లో ఉన్న డేటా ముఖ్యమా..? లేక ఆర్యన్ ఖానే ముఖ్యమా..? ఆర్యన్ ఖానే ముఖ్యమయితే వారి వద్ద కస్టడీలో ఉన్న సమయంలో ఒకే ఒక్కసారి మాత్రమే ఎందుకు స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత ఎందుకు అతడిని ప్రశ్నించలేదు. ఆర్యన్ ఖాన్‌ను అక్టోబర్ 3వ తారీఖున అరెస్ట్ చేశారు. ఈ రోజు 14వ తారీఖు. విచారణలో ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నామన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ దందాలో చివరి కొనలో ఉన్నటువంటి వ్యక్తి ఆర్యన్ ఖాన్.. అతడు ఓ బాధితుడు. అలాంటిది బాధితుడిని తీసుకెళ్లి జైల్లో పెడతాను అని అనడం న్యాయమా..?’ అని ఆర్యన్ ఖాన్ లాయర్ అమిత్ దేశాయ్ కోర్టులో వాదనలు వినిపించారు.

కాగా, బుధవారం కూడా ఇదే అంశంపై వాదనలు జరిగాయి. ‘ఆ క్రూయిజ్‌పై దాడులు జరిగిన సమయంలో ఆర్యన్ ఖాన్ వద్ద ఫోన్ తప్ప ఎలాంటి నగదు లేదని పంచనామాలో ఎన్సీబీ అధికారులే రాశారు. అతడి వద్ద డబ్బే లేనప్పుడు డ్రగ్స్ కొనడం, అమ్మడం వంటివి ఎలా జరుగుతాయి. ఎవరో తప్పుడు సమాచారం అందించి ఆర్యన్ ఖాన్‌ను చిక్కుల్లోకి నెడుతున్నారు. అమాయక పిల్లలను మరింత శిక్షించకండి.’ అంటూ లాయర్ అమిత్ దేశాయ్ కోర్టులో బుధవారం వాదనలు వినిపించారు. ఆ తర్వాత సమయాభావం వల్ల విచారణ గురువారానికి వాయిదా పడింది. ఇప్పటికే ఓసారి బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన సంగతి తెలిసిందే. దీంతో ముంబైలోని ప్రత్యేక ఎన్‌డీపీఎస్ కోర్టులో ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు. 

Bollywoodమరిన్ని...