Abn logo
May 23 2020 @ 00:00AM

ఫోన్‌లో వైరస్‌... తెలుసుకొనేదెలా?

ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వినియోగదారులను టార్గెట్‌ చేస్తూ వైరస్‌ తయారీదారులు ఎప్పటికప్పుడు వినూత్నమైన పన్నాగాలు పన్నుతున్నారు. మరి ఫోన్‌లో వైరస్‌ ఉన్న విషయం ఎలా గుర్తించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ విషయాల గురించి తెలుసుకుందాం!


మీ ఫోన్‌లో ఏదైనా మాల్‌వేర్‌ ఉంది అని అనుమానం వచ్చిన వెంటనే తప్పనిసరిగా యాంటీ వైరస్‌ లేదా యాంటీ మాల్‌వేర్‌ ప్రోగ్రాం ఇన్‌స్టాల్‌ చేసుకోండి. దీని ద్వారా ఫోన్‌ మొత్తాన్ని స్కాన్‌ చేస్తే ఏమైనా ప్రమాదకరమైన ప్రోగ్రామ్స్‌ ఉంటే అది గుర్తించి రిపోర్టు చూపిస్తుంది.


మీ ఫోన్లో వాట్సప్‌, ఫేస్‌బుక్‌, జీమెయిల్‌ వంటి అప్లికేషన్స్‌ ఉపయోగిస్తున్నప్పుడు లేదా సెట్టింగ్స్‌, హోమ్‌స్ర్కీన్‌ వంటి ఆప్షన్లు ఉపయోగించినప్పుడు మీ ప్రమేయం లేకుండా విపరీతంగా స్ర్కీన్‌ మీద వ్యాపార ప్రకటనలు, ముఖ్యంగా పాపప్‌ ప్రకటనలు ఎక్కువగా వస్తున్నట్లయితే కచ్చితంగా మీ ఫోన్‌లో మాల్‌వేర్‌ ప్రోగ్రామ్‌ పొంచి ఉన్నట్లు భావించాలి. కొన్ని సందర్భాలలో ఇటీవలే ఇన్‌స్టాల్‌ చేసిన ఏదైనా అప్లికేషన్‌ కారణంగా ఇలా ఇబ్బడిముబ్బడిగా వ్యాపార ప్రకటనలు కనిపించడం మొదలుపెడతాయి. అలాంటప్పుడు ఆ నిర్దిష్టమైన అప్లికేషన్‌ తొలగిస్తే సరిపోతుంది. అయితే అధిక శాతం సందర్భాలలో మాత్రం వివిధ పద్ధతుల ద్వారా మీ ఫోన్లకి ఏదైనా మాల్‌వేర్‌ వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది.


బ్యాటరీ మీద ప్రభావం

మీ ఫోన్లో మాల్‌వేర్‌ దాగి ఉన్నప్పుడు అది బ్యాక్‌ గ్రౌండ్‌లో అనేక రకాల పనులు చేస్తూ ఉంటుంది. ఇలా నిరంతరం అదనంగా ప్రాసెస్‌లు రన్‌ చేయడంవల్ల మీ ఫోన్‌ బ్యాటరీ జీవితకాలం తగ్గిపోతుంది. ఛార్జింగ్‌ ఊరికే ఖాళీ అవ్వడం, మళ్లీ ఛార్జింగ్‌ చేయాల్సి రావటం దీని ప్రధాన లక్షణాలు. ఒక ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ కనీసం రెండు సంవత్సరాల పాటు మెరుగైన బ్యాటరీ బ్యాకప్‌ ఇవ్వగలుగుతుంది. మీరు వాడుతున్న ఫోన్‌ కొనుగోలు చేసి, రెండు సంవత్సరాలు కూడా కాకుండానే, బ్యాటరీ ఊరికే తగ్గిపోతుంటే మాత్రం అనుమానించాల్సిందే.


అపరిచిత అప్లికేషన్స్‌

ఫోన్‌లో ఎలాంటి అప్లికేషన్స్‌ కావాలన్నా మనకు మనం నిర్ణయించుకొని గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుంటూ ఉంటాం. అయితే మీ ఫోన్లో మాల్‌వేర్‌ ఉన్నప్పుడు మీ ప్రమేయం లేకుండా వాటంతట అవే అపరిచితమైన అప్లికేషన్స్‌ అన్నీ డౌన్‌లోడ్‌ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా వీటిలో అధిక శాతం స్పై వేర్‌ ప్రోగ్రామ్స్‌ అయి ఉంటాయి. ఇవి నిరంతరం మీ ఫోన్‌ మీద నిఘా పెడుతూ ఉంటాయి. కాబట్టి మీకు తెలియకుండా ఏమైనా అప్లికేషన్స్‌ మీ ఫోన్లో ఇన్‌స్టాల్‌ అవుతుంటే కచ్చితంగా అప్రమత్తం అవ్వాలి.


డేటా వినియోగం పెరగడం

మీ మొబైల్‌ డేటా లేదా వైఫై డేటా వినియోగం ఒక్కసారిగా పెరిగిపోతోందా? అయితే మీ ఫోన్‌లో మాల్‌వేర్‌ ఉంది అన్న దానికి అది సంకేతమే అవుతుంది. మొబైల్‌ డేటా ఈ మధ్యకాలంలో అందరికీ లభిస్తోంది కాబట్టి, డేటా వినియోగం పెరిగినా అది ఎందుకు జరుగుతోంది అన్న విషయం చాలామంది గుర్తుపట్టలేక పోతున్నారు. కానీ నిశితంగా పరిశీలించి మీకు తెలియకుండా డేటా వినియోగం జరుగుతుంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోండి.అడ్డుకోవడం ఎలా?

మీ ఫోన్‌లో ఏదైనా మాల్‌వేర్‌ ఉంది అని అనుమానం వచ్చిన వెంటనే తప్పనిసరిగా యాంటీ వైరస్‌ లేదా యాంటీ మాల్‌వేర్‌ ప్రోగ్రాం ఇన్‌స్టాల్‌ చేసుకోండి. దీని ద్వారా ఫోన్‌ మొత్తాన్ని స్కాన్‌ చేస్తే ఏమైనా ప్రమాదకరమైన ప్రోగ్రామ్స్‌ ఉంటే అది గుర్తించి రిపోర్టు చూపిస్తుంది. గూగుల్‌ సంస్థ కూడా గూగుల్‌ ప్లే ప్రొటెక్ట్‌ అని ఒక ప్రత్యేకమైన ఏర్పాటును ప్రతీ ఆండ్రాయిడ్‌ ఫోన్లో చేస్తోంది. అది తరచూ మీ ఫోన్‌ స్కాన్‌ చేసి ప్రమాదకరమైన ప్రవర్తన కలిగి ఉన్న ప్రోగ్రాంలను విశ్లేషించి అప్రమత్తం చేస్తుంది. అయినా యాంటీవైరస్‌ కానీ, గూగుల్‌ ప్లే ప్రొటెక్ట్‌ గానీ పూర్తిస్థాయిలో మనకు రక్షణ కల్పిస్తాయి అనే భ్రమలో ఉండకండి. కొంతవరకు మాత్రమే వీటి ద్వారా రక్షణ పొందగలుగుతాం.


ఫ్యాక్టరీ రీసెట్‌ చేయడం ద్వారా...

కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ మాల్‌వేర్‌ పూర్తిగా తొలగించాలి అంటే అన్నింటికంటే ఉత్తమమైన పరిష్కారం మీ ఫోన్‌ ఫ్యాక్టరీ రీసెట్‌ చేయటం! మీ ఫోన్‌ సెట్టింగ్స్‌లో ఈ ఆప్షన్‌ లభిస్తుంది. దీని ఎంపిక చేసుకున్నప్పుడు మీ ఫోన్లో ఇన్‌స్టాల్‌ చేయబడి ఉన్న అన్ని ప్రోగ్రాములు, హోమ్‌స్ర్కీన్‌ సెట్టింగ్స్‌ అన్నీ తొలగించబడి, ఫోన్‌ కొన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ కండిషన్‌కి వెళ్తుంది. కాబట్టి ఫోన్‌ ఫ్యాక్టరీ రీసెట్‌ చేసిన తర్వాత అన్ని అప్లికేషన్లు మళ్లీ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. అలాగే రీసెట్‌ చేయడానికి ముందు మీ ఫోన్‌లో కాంటాక్ట్స్‌, కాల్‌ లాగ్స్‌ వంటివన్నీ తప్పనిసరిగా బ్యాకప్‌ తీసుకోండి. దీనికోసం ప్రత్యేకంగా గూగుల్‌ ప్లే స్టోర్‌లో అప్లికేషన్స్‌ కూడా లభిస్తుంటాయి. మెమొరీ కార్డు బ్యాకప్‌ తీసుకోవాల్సిన పనిలేదు. కేవలం ఇంటర్నల్‌ స్టోరేజ్‌ మాత్రమే ప్రభావితమవుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఫోన్‌ను కాపాడుకోవచ్చు.


నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothu sridhar


Advertisement
Advertisement
Advertisement