Abn logo
Mar 27 2020 @ 04:28AM

టీ20 వరల్డ్ కప్ కూ తప్పదా?

Kaakateeya

కరోనా.. కరోనా.. ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా అందరినోటా ఇదే మాట. సూక్ష్మాతి సూక్ష్మమైన ఈ వైరస్‌ ధాటికి ధరిత్రి మొత్తం వణికిపోతుండగా.. ఏకంగా ప్రపంచ ప్రఖ్యాత ఒలింపిక్స్‌ క్రీడలనే వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఎన్నో క్రీడా ఈవెంట్ల మాదిరే ఐపీఎల్‌ది కూడా దాదాపు అదే పరిస్థితి. ఇక మిగిలింది.. టీ20 వరల్డ్‌కప్‌. ఇంకో ఏడు నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పుడు అందరి దృష్టీ ఈ మెగా ఈవెంట్‌పై పడింది. ఇదైనా షెడ్యూల్‌ ప్రకారం జరుగుతుందా.. లేక వచ్చే ఏడాదికి వాయిదా వేసుకోక తప్పదా? అనేది హాట్‌ టాపిక్‌గా మారింది..


వాయిదా పడితే డబ్ల్యుటీసీ, వన్డే లీగ్‌పై ఒత్తిడి

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

కొవిడ్‌-19 విజృంభిస్తుండడంతో ప్రపంచ దేశాన్నీ దాదాపుగా లాక్‌డౌన్‌ స్థితికి వెళ్లిపోయాయి. అందుకే ప్రజల ప్రాణాలే ముఖ్యమనే భావనతో విశ్వవ్యాప్తంగా అనేక క్రీడా పోటీలు కూడా వాయిదా పడుతున్నాయి. అన్ని వైపుల నుంచీ తీవ్రమైన ఒత్తిడి రావడంతో టోక్యో ఒలింపిక్స్‌ గేమ్స్‌ కూడా వచ్చే ఏడాదికి వెళ్లాయి. ఫుట్‌బాల్‌ లో ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌, కోపా, యూరో కప్‌లు కూడా అదే బాట పట్టాయి. ఈ నేపథ్యంలో ఐసీసీ కూడా ఈ ఏడాది జరిగే ఈవెంట్లపై దృష్టి సారించింది. ఇందులో అక్టోబర్‌-నవంబర్‌లో జరిగే పురుషుల టీ20 ప్రపంచకప్‌, ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌పతో పాటు మే నుంచి జరపాలనుకుం టున్న వన్డే లీగ్‌ కూడా ఉన్నాయి. అనుకోని పరిస్థితులు ఎదురైతే వీటిని ఎలా నిర్వహించాలనేది ఐసీసీకి కత్తి మీద సామే కానుంది.


 టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడితే..

    వాస్తవానికి టీ20 ప్రపంచకప్‌ భవిష్యత్‌పై ఐసీసీ ఇప్పటికిప్పుడు ఆలోచిస్తున్నట్టు కనిపించడం లేదు. ఈ టోర్నీ జరిగేందుకు ఇంకా సమయం ఉండగా, అప్పటి వరకు కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుందన్న అంచనాలో ఉంది. అందుకేనేమో.. అటు టోర్నీకి ఆతిథ్యమిచ్చే క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) కూడా ధీమాతోనే ఉంది. కానీ.. ఊహించని పరిస్థితులు ఎదురై వాయిదా దిశగా వెళ్తే పొట్టి ప్రపంచక్‌పను సర్దుబా టు చేయడం నిర్వాహకులకు తలకు మించిన భారమే అవుతుంది. ఎందుకంటే ఈ మెగా ఈవెంట్‌ ముగియగానే ఆస్ర్టేలియా జట్టు అఫ్ఘానిస్థాన్‌తో ఏకైక టెస్టును ఆడా ల్సి ఉంటుంది. ఆ తర్వాత వెంటనే జనవరి 2021 వరకు భారత్‌తో నాలుగు టెస్టులు, మూడు వన్డేల సిరీ్‌సలో తలపడాల్సి ఉంటుంది. 


2022 వరకు ఆగాల్సిందేనా..?

ఒకవేళ ఈ టోర్నీ వచ్చే ఏడాదికి వాయిదా పడినా అప్పుడు కూడా నిర్వహణ సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే 2021లో భారత్‌లోనే టీ20 ప్రపంచకప్‌ జరగాల్సి ఉంది. ఇక ఐసీసీ ముందున్న ఏకైక అవకాశం 2022 మాత్రమే. ఎందుకంటే ఆ ఏడాది ఎలాంటి గ్లోబల్‌ ఈవెంట్స్‌ లేవు. సీఏ, బీసీసీఐలతో చర్చల తర్వాత ప్రత్యామ్నాయ పరిష్కారం లభించినా భవిష్యత్‌ పర్యటన కార్యక్రమాల (ఎఫ్‌టీపీ)తో సమన్వయం చేసుకోవడం అన్నింటికన్నా ముఖ్యం. 


డబ్ల్యుటీసీ పరిస్థితి..

  టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడితే ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప (డబ్ల్యుటీసీ)లో భాగంగా చాలా సిరీ్‌సలు షెడ్యూల్‌ ప్రకారం జరిగే వీలుండదు. వచ్చే మార్చిలో తొలి అంచె పూర్తయి లార్డ్స్‌లో ఫైనల్‌ (జూన్‌) ఆడాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో తొమ్మిది జట్లు ఆడే సిరీ్‌సలకు ఎలా సమయం కేటాయించాలనేది మరో సమస్య. ఇదిలా వుండగా.. 2023లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌లో బెర్త్‌ల కోసం ఈ ఏడాది మే 1 నుంచి మార్చి 31, 2022 వరకు ఆయా జట్లు వన్డే సూపర్‌ లీగ్‌ ఆడాల్సి ఉంటుంది. ఇందులో 12 టెస్టు జట్లతో పాటు వన్డే హోదా దక్కించుకున్న నెదర్లాండ్స్‌ పాల్గొంటుంది. ఇవన్నీ ఎనిమిది సిరీస్‌లు ఆడాలి. ఇప్పుడు ఈ లీగ్‌ను కూడా వాయిదా వేయాలా? లేక సిరీ్‌సల సంఖ్యను తగ్గించాలా అనేది ఐసీసీ తేల్చాల్సి ఉంది. ఏదిఏమైనా మే 8 నుంచి 10 వరకు జరిగే ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో ఈ అంశాన్ని కూడా చర్చించనున్నారు. 


ఐసీసీ అర్హత టోర్నీలు వాయిదా

దుబాయ్‌: ఐసీసీ గ్లోబల్‌ ఈవెంట్స్‌కు సంబంధించి ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు జరిగే అర్హత టోర్నీ మ్యాచ్‌లు వాయిదా పడ్డాయి. ఇందులో 2021 టీ20 వరల్డ్‌కప్‌ కోసం రీజనల్‌ క్వాలిఫికేషన్‌ ఈవెంట్స్‌, 2023 వన్డే వరల్డ్‌కప్‌ లీగ్‌-2, చాలెంజ్‌ లీగ్‌ (అసోసియేట్‌ సభ్యదేశాల కోసం) మ్యాచ్‌లు ఉన్నాయి. కొవిడ్‌-19 తీవ్రత తగ్గాక తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ ప్రకటించింది. అలాగే 2021 మహిళల వన్డే వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లపై కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారు. 

Advertisement
Advertisement