Abn logo
Mar 1 2020 @ 03:55AM

అమ్మాయిల జైత్రయాత్ర

టీ20 వరల్డ్‌క్‌పలో భారత అమ్మాయిలు.. జైత్రయాత్ర కొనసాగిస్తున్నారు. వరుసగా నాలుగో విజయంతో లీగ్‌ దశను ఓటమనేదే లేకుండా ముగించారు. శనివారం జరిగిన తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో.. రాధా యాదవ్‌ తిప్పేయగా, చిచ్చరపిడుగు షఫాలీ వర్మ ధనాధన్‌ బ్యాటింగ్‌తో భారత్‌ 7 వికెట్ల తేడాతో  శ్రీలంకను చిత్తు చేసింది. మొత్తం 8 పాయింట్లతో హర్మన్‌ప్రీత్‌ సేన గ్రూప్‌-ఎ టాపర్‌గా సెమీ్‌సకు సిద్ధమైంది.


టీమిండియాకు  వరుసగా నాలుగో విజయం

లంకపై 7 వికెట్లతో గెలుపు

టీ20 వరల్డ్‌కప్‌


మెల్‌బోర్న్‌: మినీ డైనమైట్‌ షఫాలీ వర్మ (34 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్‌తో 47) మరోసారి మెరుపులు మెరిపించడంతో.. మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో భారత్‌ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్‌-ఎలో శనివారం జరిగిన తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ స్పిన్నర్‌ రాధా యాదవ్‌ (4/23) కెరీర్‌ బెస్ట్‌ ప్రదర్శనతో.. తొలుత శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 113 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్‌ చమరి ఆటపట్టు (33) టాప్‌ స్కోరర్‌. ఓ మాదిరి లక్ష్యాన్ని భారత్‌ 14.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో లీగ్‌ దశను ఓటమనేదే లేకుండా ముగించింది. ఈపాటికే సెమీస్‌ బెర్త్‌ను ఖరారు చేసుకున్న భారత్‌ మొత్తం 8 పాయింట్లతో గ్రూప్‌-ఎలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకొంది. 


షఫాలీ బాదుడు: భారత ఛేదనలో షఫాలీ ఆటే హైలైట్‌. ఫుల్‌ఫామ్‌లో ఉన్న వర్మ.. డేరింగ్‌ షాట్లతో అలరించింది. రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న షఫాలీ.. కెరీర్‌లో తొలి అర్ధ శతకాన్ని మాత్రం నమోదు చేయలేక పోయింది. డాషింగ్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన (17) మరోసారి శుభారంభాన్ని చేజార్చుకుంది. 5వ ఓవర్‌లో ప్రబోఽధని బౌలింగ్‌లో క్రాస్‌ షాట్‌ ఆడే క్రమంలో మిడాన్‌లో ఉన్న దిల్హరికి క్యాచ్‌ ఇచ్చింది. దీంతో తొలి వికెట్‌కు 34 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (15)తో కలిసి షఫాలీ స్కోరుబోర్డును నడిపించింది. అయితే, హర్మన్‌ను అవుట్‌ చేసి సిరివర్దనె.. రెండో వికెట్‌కు 47 పరుగుల భాగస్వామ్యాన్ని బ్రేక్‌ చేసింది. 88/2 వద్ద షషాలీ అనవసరంగా రనౌట్‌ అయింది. ఆ తర్వాత జెమీమా రోడ్రిగ్స్‌ (15 నాటౌట్‌), దీప్తి శర్మ (15 నాటౌట్‌) మరో 32 బంతులు మిగిలుండగానే భారత్‌ను గెలిపించారు. 


చమరి దూకుడు: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లంక.. ఓపెనర్‌ ఉమేషా తిమాషిని (2) వికెట్‌ను స్వల్ప స్కోరుకే కోల్పోయింది. దీప్తి శర్మ (1/16) బౌలింగ్‌లో రాజేశ్వరి క్యాచ్‌ పట్టడంతో తిమాషిని వెనుదిరిగింది. ఫామ్‌లో ఉన్న ఆటపట్టు.. హర్షిత మాధవి (12)తో కలసి 30 పరుగులు జోడించింది. మాధవిని రాజేశ్వరీ గైక్వాడ్‌ (2/18) క్లీన్‌ బౌల్డ్‌ చేసింది. 9వ ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన రాధ.. మూడో బంతికి ఆటపట్టును అవుట్‌ చేయడంతో లంక బ్యాటింగ్‌ కుప్పకూలింది. హన్సిమ కరుణరత్నె (7), హాసిని పెరీరా (7)ను పెవిలియన్‌ చేర్చిన రాధ.. అనుష్క సంజీవని (1)ని వికెట్ల ముందు దొరకబుచ్చుకొంది. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన శశికళ (13)ను రాజేశ్వరి క్యాచ్‌ అవుట్‌ చేసింది. నీలాక్షి డిసిల్వ (8)ని పూనమ్‌ పెవిలియన్‌ చేర్చగా.. సత్య సందీపని (0)ని శిఖా పాండే బౌల్డ్‌ చేసింది. కవిషా దిల్హరి (25 నాటౌట్‌) చివర్లో కొంత కౌంటర్‌ అటాక్‌ చేయడంతో లంక స్కోరు సెంచరీ దాటింది. 


స్కోరు బోర్డు

శ్రీలంక: ఉమేష తిమాషిని (సి) రాజేశ్వరి (బి) దీప్తి 2, చమరి ఆటపట్టు (సి) శిఖా పాండే (బి) రాధ 33, మాధవి (బి) రాజేశ్వరి 12, హన్సిమ కరుణరత్నె (సి) వేద (బి) రాధ 7, హాసిని పెరీరా (సి) తానియా (బి) రాధ 7, శశికళ (సి) వేద (బి) రాజేశ్వరి 13, నీలాక్షి డిసిల్వ (సి) హర్మన్‌ (బి) పూనమ్‌ 8, అనుష్క (ఎల్బీ) రాధ 1, కవిష దిల్హరి (నాటౌట్‌) 25, సత్య సందీపని (బి) శిఖ 0, ప్రబోధిని (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 113/9; వికెట్ల పతనం: 1-12, 2-42, 3-48, 4-58, 5-75, 6-78, 7-80, 8-104, 9-104; బౌలింగ్‌: దీప్తి శర్మ 4-0-16-1, శిఖా పాండే 4-0-35-1, రాజేశ్వరి గైక్వాడ్‌ 4-1-18-2, పూనమ్‌ యాదవ్‌ 4-0-20-1, రాధా యాదవ్‌ 4-0-23-4.


భారత్‌: షఫాలీ వర్మ (రనౌట్‌/హన్సిమ) 47, స్మృతి మంధాన (సి) దిల్హరి (బి) ప్రబోధిని 17, హర్మన్‌ప్రీత్‌ (సి) హన్సిమ (బి) శశికళ 15, జెమీమా రోడ్రిగ్స్‌ (నాటౌట్‌) 15, దీప్తి శర్మ (నాటౌట్‌) 15; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 14.4 ఓవర్లలో 116/3; వికెట్ల పతనం: 1-34, 2-81, 3-88; బౌలింగ్‌: ఉదిక్ష ప్రబోధిని 4-0-13-1, శశికళ సిరివర్దనె 4-0-42-1, సత్య సందీపని 1-0-11-0, చమరి ఆటపట్టు 2-0-21-0, కవిషా దిల్హరి 3-0-18-0, ఉమేష తిమాషిని 0.4-0-7-0. 

Advertisement

క్రీడాజ్యోతిమరిన్ని...

Advertisement
Advertisement