Abn logo
May 21 2020 @ 08:22AM

విదేశాల నుంచి వ‌చ్చిన‌ ముగ్గురు ప్రవాసులకు కరోనా లక్షణాలు

విమానాశ్రయం నుంచి నేరుగా జీజీహెచ్‌కు తరలింపు

లండన్‌, జెడ్డా నుంచి 223 మంది విజయవాడకు రాక

విజయవాడ/విశాఖపట్నం, మే 20 (ఆంధ్రజ్యోతి): వందే భారత్‌ మిషన్‌-2లో   భాగంగా ఏపీకి చెందిన ప్రవాసులు విదేశాల నుంచి ప్రత్యేక విమానాలలో వచ్చారు. బుధవారం ఉదయం లండన్‌ నుంచి 143 మంది ఎయిర్‌ ఇండియా ఎయిర్‌ బస్‌ విమానంలో, రాత్రి జెడ్డా నుంచి 80 మంది ప్రత్యేక విమానంలో గన్నవరం(విజయవాడ) వచ్చారు. వారికి ఎయిర్‌పోర్టు అధికారులు, ఏపీఎన్‌ఆర్‌టీ అధికారులు, కృష్ణాజిల్లా అధికారులు ఆత్మీయ స్వాగతం పలికారు. ప్రవాసులపై పూలు చల్లి బస్సులలో ఇంటర్నేషనల్‌ టెర్మిన ల్‌ బిల్డింగ్‌కు తరలించారు. అక్కడ వారి వివరాలతోపాటు ఆరోగ్యసమస్యలు నమోదు చేసుకొన్నారు. ప్రాఽథమిక పరీక్షలలో ముగ్గురికి కరోనా లక్షణాలు గుర్తించారు. ఈ ముగ్గురిలో కృష్ణా, తూర్పుగోదావరి జిల్లా వ్యక్తులతోపాటు  తెలంగాణకు చెందిన ఒకరు ఉన్నారు.


వారిని నేరుగా జీజీహెచ్‌కు తరలించారు. మిగిలిన వారిని ప్రత్యేక బస్సుల్లో ఆయా జిల్లాల్లోనే క్వారంటైన్‌కు తరలించారు. కాగా, లండన్‌ నుంచి వచ్చినవారందరూ పెయిడ్‌ క్వారంటైన్‌కే మొగ్గు చూపారు. కాగా, విమానాశ్రయంలో ఓ భద్రతా విభాగం అధికారి ఒక యువతిని స్వయంగా పంపించటం విమర్శలకు దారితీసింది. ప్రొటోకాల్‌ కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అధికారులే మరొకరిని బస్సులో కాకుండా ప్రత్యేకంగా తరలించటం విమర్శలకు దారితీసింది. ఇదిలాఉంటే తెలం గాణకు చెందిన ఒకరిని అక్కడి ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ప్రత్యేకంగా పంపించారు. ఆయన తండ్రి చనిపోవటంతో, జీజీహెచ్‌లో పరీక్షలు చేయించుకున్నాక ఆయన్ను కారులో పంపించారు. జిల్లా యంత్రాంగ స్థాయిలో కూడా ఒకరిని పంపించారు.


ఖతార్‌ నుంచి 149 మంది 

ఖతార్‌ నుంచి ఎయిరిండియా ప్రత్యేక విమానంలో బుధవారం 149మంది విశాఖ పట్నం చేరుకున్నారు. వీరిలో ఏపీ 138 మంది, కేరళ, ఒడిసా, తమిళనాడు, తెలంగాణకు చెందిన 11మంది ఉన్నారు.  

Advertisement
Advertisement
Advertisement